ఉట్నూర్, జూలై 27 : కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగం తగ్గించి సూర్యకాంతితో సోలార్ విద్యుత్‌ను ఉపయోగించుకొనేందుకు ‘పీఎం సూర్యఘర్.. ముఫ్త్ బిజ్లీ’ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు కోటి కుటుంబాలకు ఈ పథకం అమలు చేయాలన్న లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన పథకాన్ని అమలు చేస్తున్నది. ఇందుకు కిలో వాట్స్లవారిగా సబ్సిడీ అందిస్తున్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని కుటుంబాలకు గృహజ్యోతి పథకం ద్వారా 200 ఉచిత విద్యుత్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ గృహజ్యోతి పథకం నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి భారంగా మారిన విషయం తెలిసిందే. దీంతో గృహజ్యోతి లబ్ధిదారులకు పీఎం సూర్య ఘర్ పథకం కింద సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించి చేతులు దులుపుకుందామని చూస్తున్నది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో మొట్టమొదటి మోడల్ సోలార్ గ్రామంగా ఉట్నూర్ మండలంలోని లక్కారంను ఎంపిక చేసింది.
గ్రామంలో 250 మందికే గృహజ్యోతి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో మోడల్ సోలార్ గ్రామంగా ఉట్నూర్ మండలంలోని లక్కారం గ్రామాన్ని ఎంపికైంది. నియోజకవర్గంలోనే ఉట్నూర్ డివిజన్ పెద్దది. పేరుకు ఖానాపూర్ నియోజకవర్గంగా ఉన్న ఉట్నూర్ కేంద్రంగానే పరిపాలన, అభ్యర్థులు ఇక్కడి నుండే దాదాపు ఉంటారు. అటువంటి ప్రాంతమైన ఉట్నూర్‌ను అనుకొని ఉన్న జంట గ్రామం లక్కారం. అయితే గ్రామంలో సుమారు 1700ల వరకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వం 250 మందికి మాత్రమే గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నది. దీంతో వీరికే ప్రభుత్వం రూ.1.40 లక్షలతో ఉచితంగా 2 కిలోవాట్స్ల సోలార్ ప్యానెల్ ద్వారా విద్యుత్ అందించేందుకు ఆసక్తి చూపుతున్నది. ఇందులో మళ్లీ పక్కా స్లాబ్ లేని వారు ఉండడంతో సుమారు 130 మందికి మాత్రమే సోలార్ విద్యుత్ కనెక్షన్ ఉచితంగా అందే అవకాశం ఉంది. దీంతో మిగతా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తమకు కూడా ప్రభుత్వం ఉచితంగా సోలార్ విద్యుత్ ప్యానెల్ అందించాలని కోరుతున్నారు.
ప్రజలకు సోలార్‌పై ఆసక్తి
గ్రామంలో కొందరికే ఉచితంగా సోలార్ అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు అందరు తమకు కావాలన్న ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సోలార్ పెట్టించుకున్నాక విద్యుత్ బిల్లులు జీరో అవడంతో తమకు కూడా కావాలని కోరుతున్నారు. 25 సంవత్సరాల వరకు ఒక్కో ప్యానెల్ మైలేజీ ఇవ్వడం, పర్యావరణ కాలుష్యం తగ్గడం, కేంద్ర ప్రభుత్వం ఒక కిలో వాట్స్కు 30 వేల సబ్సిడీ, 2 కిలో వాట్స్కు రూ.60వేలు, మూడు వాట్స్కు రూ.78 వేల వరకు సబ్సిడీ ఇస్తుంది. దీంతోపాటు గృహ అవసరాలకు పోను మిగిలింది గ్రీడ్‌కు వాడుకొని ట్రాన్స్‌కో డబ్బులు ఇచ్చే అవకాశం కూడా ఉండడంతో సోలార్ కావాలంటున్నారు. దానికి తోడు బ్యాంక్‌ల నుంచి లోన్ తీసుకునే అవకాశాలు ఉండడంతో ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ప్రభుత్వం గృహజ్యోతి ఉన్న వారికే కాకుండా గ్రామంలో పూర్తిగా ఉచిత సోలార్ విద్యుత్ కల్పించాలని కోరుతున్నారు.
3కేవీ ప్యానెల్ పెట్టాలి..
లక్కారం గ్రామంలో గృహజ్యోతి లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.1.40 లక్షలతో రెండు కేవీ ప్యానెల్ ఏర్పాటు చేయనున్నారు. అయితే లబ్ధిదారులు మాత్రం రెండు కేవీ కాకుండా మూడు కేవీ ప్యానెల్ అందించాలని కోరుతున్నారు. రెండు కిలోవాట్స్‌కు ప్రతి నెల 240 యూనిట్లు ఉత్పత్తి అవుతున్నదని, అదే వేసవికాలం విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండడంతో యూనిట్లు ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉన్నందున మూడు కిలో వాట్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మూడు కిలో వాట్స్కు 360 యూనిట్లు ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు. అలాగే సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ వాడుకోగా గ్రిడ్ కూడ ఉపయోగిస్తున్నందున మూడు కిలో వాట్లది బాగుంటుందని ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం
ఉచితంగా సోలార్ ప్యానెల్ అందించనున్నాం..
ఆదిలాబాద్ జిల్లా లోని లక్కారం గ్రామం మోడల్ సోలార్ విలేజ్‌గా ఎంపికైంది. గ్రా మంలో ఇప్పటికే ప్రభుత్వం నుం చి గృహజ్యోతి ద్వారా ఉచితంగా విద్యుత్ పొందుతున్న వారికి సోలార్ ప్యానెల్ బిగించనున్నాం. అంటే గృహజ్యోతి లబ్ధిదారులకు ప్రభు త్వం రూ.1.40 లక్షలతో రెండు కిలో వాట్స్ గల సోలార్ ప్యానెల్ అందించ నుంది. ఇది పూర్తిగా ప్రభుత్వమే ఖర్చు భరించనుంది. ఇందుకోసం ఇప్పటికే లక్కారం గ్రామంలో సర్వే నిర్వహిస్తు న్నాం. లబ్ధిదారులు గృహజ్యోతి ద్వారా ఉచితంగా విద్యుత్ పొందుతున్నవారై ఉండాలి. వారికి స్లాబ్ ఉండాలి. అప్పుడే ఈ సోలార్ ప్యానెల్ అందుతుంది. త్వరలోనే సర్వే పూర్తిచేయనున్నాం.
– తెలంగాణ రెడ్కో కంపెనీ ఆదిలాబాద్ జిల్లా మేనేజర్ శ్రీనివాస్.