Flydubai flight : దుబాయ్‌లోని ఫ్లై దుబాయ్ సంస్థకు చెందిన విమానం హైజాక్ అయినట్లు కోడ్ అలర్ట్ అందింది. దీంతో అంతా కంగారు పడిపోయారు. చివరకు సౌదీ అరేబియాలో సేఫ్‌గా ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ఈ ఘటన బుధవారం తీవ్ర కలకలం రేపింది. అయితే, అసలు ఏం జరిగింది అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు ఫ్లై దుబాయ్ సంస్థకు చెందిన విమానం బయల్దేరింది.
ఇందులో దాదాపు 200 మంది వరకు ప్రయాణికులున్నారు. వీరిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్ పౌరులే. ఎఫ్‌జడ్1073 అనే పేరుగల బోయింగ్ 737 మ్యాక్స్ 8 అనే విమానం దుబాయ్ నుంచి బయల్దేరిన కాసేపటికి ఇజ్రాయెల్ కంట్రోల్ రూంకు 7700 అనే కోడ్ పంపింది. ఇది ఏదైనా విమానంలో సాధారణ, అత్యవసర పరిస్థితి తలెత్తితే పంపే కోడ్. ఆ తర్వాత కొద్ది క్షణాలకు 7500 అనే మరో కోడ్ పంపారు. ఇది విమానంలో నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగినప్పుడు, హైజాక్ జరిగినప్పుడు పంపే కోడ్. ఈ కోడ్ రావడంతో దుబాయ్‌లో, ఇజ్రాయెల్‌లో ఆందోళనకర వాతావరణం నెలకొంది.
ఇజ్రాయెల్ ఏకంగా రెండు యుద్ధ విమానాల్ని రంగంలోకి దింపింది. విమానం భద్రత, ప్రయాణికుల రక్షణకు సాయం అందించేందుకు ఈ విమానాల్ని ఇజ్రాయెల్ పంపింది. అయితే, కొద్ది సేపటి తర్వాత ఈ ఫ్లై దుబాయ్ విమానం తిరిగి సౌదీ అరేబియాకు బయల్దేరింది. అక్కడి టబుక్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ సేఫ్ ల్యాండింగ్ అయింది. ఈ విమానాన్ని ఫాలో అవుతూ వచ్చిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు కూడా అక్కడే దిగాయి. ప్రస్తుతం ప్రయాణికులు అంతా క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. మరోవైపు హైజాక్ వార్తల్ని ఇజ్రాయెల్ కొట్టిపారేసింది.
విమానాన్ని నడుపుతున్న పైలట్ల మధ్య ఘర్షణ చెలరేగిందని, దీనివల్లే పొరపాటున ఎమర్జెన్సీ కోడ్స్ తమకు వచ్చాయని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే, ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఆ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం, సైన్యం కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.