సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల జనరల్, పోలీస్ ఎన్నికల పరిశీలకులు జిల్లా పర్యటనకు వచ్చారు. సికింద్రాబాద్-8 పార్లమెంట్ నియోజకవర్గానికి డాక్టర్ సరోజ్‌కుమార్ (2008 ఐఏఎస్ బ్యాచ్), హైదరాబాద్-9 పార్లమెంట్ నియోజకవర్గానికి (2010 ఐఏఎస్ బ్యాచ్)కు చెందిన పి.శ్రీవిద్య, హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శశాంక్ ఆనంద్ బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. నగర పర్యటనలో భాగంగా గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను తెలుసుకున్నారు. అంతేకాకుండా ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు చేపడుతున్న ఏర్పాట్లను ఎన్నికల అధికారి, కమిషనర్ రొనాల్డ్ రాస్ వివరించారు. అనంతరం వీరి సమక్షంలో ఎన్నికల విధులు నిర్వహించనున్న పీఓ, ఏపీఓలు ఇతర పోలింగ్ సిబ్బంది సంబంధించిన ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి పోలీస్, జనరల్ ఎన్నికల పరిశీలకులు జిల్లా ప్రొఫైల్‌తో పాటు పోలింగ్ స్టేషన్, కౌంటింగ్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్, పోలింగ్ పర్సనల్ ట్రైనింగ్ పోస్టల్ బ్యాలెట్ హోం ఓటింగ్, వీవీటీ తనిఖీ బృందాలు, ఈవీఎం ర్యాండమైజేషన్ ప్రక్రియపై జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ వివరించారు. పోలీసులు చేపట్టిన చర్యలపై పోలీస్ అడిషనల్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కంఫ్లైంట్ గ్రీవెన్స్ కాల్ సెంటర్, ఎంసీసీ కంట్రోల్ రూంను జనరల్ పరిశీలకులు పరిశీలించారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై జనరల్, పోలీస్ పరిశీలకులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.