వేములవాడ రూరల్ మండలం జయవరం మూలవాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలో అక్రమాలను కప్పిపుచ్చేందుకు క్షేత్రస్థాయి అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. అందులో భాగంగానే వాస్తవాలు దాచి, పై అధికారులను పక్కదారి పట్టించేందుకు ఆ శాఖలో పనిచేసే ఓ కీలక అధికారి చక్రం తిప్పుతున్నారు. ఉన్నతాధికారులు అడిగిన మేరకు నివేదిక ఇవ్వకుండా.. సదరు అధికారి అత్యంత లౌక్యం ప్రదర్శించి, తప్పులు దొరకకుండా ఓ నివేదికను పంపడంలో కీలక భూమిక పోషించినట్టు తెలుస్తున్నది. అయితే, విచారణలో భాగంగా సమర్పించిన నివేదికను పరిశీలిస్తున్నామని నీటిపారుదల శాఖ ఎస్ఈ రమేశ్ తెలిపారు.
కరీంనగర్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కట్టకుండానే కొట్టుకపోయిందట!’ శీర్షికన ఈ నెల 7న ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. వేములవాడ రూరల్ మండలంలోని జయవరం మూలవాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలో జరిగిన అక్రమాలు, కరకట్ట కట్టకుండానే కట్టినట్టు చూపి ఎంబీ రికార్డులు తయారు చేసి పేమెంట్ కోసం చేస్తున్న ప్రయత్నాలు, అందులో ఓ అధికారి అనుసరిస్తున్న తీరు వంటి అనేక అంశాలను కండ్లముందుంచిన విషయం విదితమే. అయితే ఈ కథనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా నీటిపారుదల శాఖలో కలకలం రేపింది. ఆ మేరకు ‘నమస్తే కథనం’పై ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. కథనంలో వచ్చిన సమాచారం మేరకు.. క్షేత్రస్థాయిలో పరిశీలించి, నివేదిక ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఆ మేరకు ఓ నివేదిక ఉన్నతాధికారులకు అందినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే, జరిగిన అక్రమాలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా ఓ అధికారి చక్రం తిప్పి, నివేదికను తనకు అనుకూలంగా.. మమ అనిపించేలా పంపినట్టు తెలిసింది. ‘నమస్తే’కు అందిన సమాచారం ప్రకారం చూస్తే.. సదరు అధికారి, ఉన్నతాధికారులనే పక్కదారి పట్టించి, వాస్తవాలు బహిర్గతం కాకుండా విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది.
వాస్తవాలను కప్పిపుచ్చుతూ..
జయవరం వద్ద మూలవాగుపై నిర్మించిన చెక్‌డ్యాం ఆది నుంచీ వివాదాస్పదంగా మారిందని, అసలు గుత్తేదారు కాకుండా సబ్ కాంట్రాక్టర్ పనిచేస్తూ వచ్చారని, ఆరంభంలోనే మూలవాగు ఎఫ్టీఎల్ పరిధిలోనే కాంక్రీట్ మిక్సింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి.. చెక్ డ్యాం నిర్మాణాన్ని సాకుగా చూపి వివిధ ప్రాంతాలకు విక్రయించిన విషయాన్ని ‘నమస్తే’ బహిర్గతం చేసింది. అలాగే చెక్‌డ్యాం నిర్మాణంలో అనేక లోపాలున్నాయని, అవగాహన లేక 3.2 మీటర్ల ఎత్తుకు నిర్మించడం కారణంగా 2023లో వచ్చిన వరదలతో పరీవాహక ప్రాంతాల రైతులు భారీగా నష్టపోయారని, కాగా తాజా ప్రభుత్వంలో దాని ఎత్తును 2.5 మీటర్లకు కుదించారని, దీని వల్ల సర్కారుకు దాదాపు 70 లక్షల నష్టం వాటిల్లిందనే విషయం కూడా బయటపెట్టింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ చెక్‌డ్యాం పరిధిలో కరకట్ట కట్టకుండానే కట్టినట్టు ఎంబీ రికార్డులు చేసి, సుమారు 30 లక్షలు దండుకోవడానికి ప్రతిపాదనలు సిద్ధమైన విషయాన్ని సైతం ఎండగట్టింది. నిజానికి ఈ విషయాలను కప్పిపుచ్చడానికి అధికారులు నానా తంటాలు పడుతూ.. ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. 2023లో వరదలు వచ్చే సమయం నాటికి కరకట్ట నిర్మాణం లేకపోవడం వల్ల రైతుల పొలాల్లోకి నీళ్లు వచ్చి ఇసుక దిబ్బలు పెట్టాయి. కానీ, తాజాగా అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే.. 2023 లోభారీ వరదలు వచ్చిన మాట వాస్తవమేనని ఒప్పుకుంటూనే.. ఈ వరదల కారణంగా చెక్‌డ్యాం చుట్టూ ఉన్న వ్యవసాయ భూములతో సహా ఎడమ వైపు ఎగువ, దిగువ వైపు కరకట్ట కొట్టుకుపోయిందని పేర్కొన్నారు. కొట్టుకుపోయిన కరకట్టకు కొలతలు రికార్డు చేశామని, అయితే అది కొట్టుకపోవడం వల్ల చెల్లింపులకు సిఫారసు చేయలేదని నివేదిక ఇచ్చినట్టు తెలుస్తున్నది.
ఎన్నెన్నో అనుమానాలు
ఇదే అంశాన్ని నిశితంగా చూస్తే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కరకట్ట కట్టకపోవడం వల్లే వరదల సమయంలో తమ పొలాలు దెబ్బతిన్నాయని స్థానిక రైతులు అప్పుడూ ఇప్పుడూ చెబుతున్నారు. కానీ, అధికారులు మాత్రం సదరు కట్టలకు సంబంధించిన ఎంబీలు రికార్డు చేసినట్టు పేర్కొంటూనే.. కొట్టుకుపోవడం వల్ల బిల్లు చెల్లింపునకు సిఫారసు చేయలేదంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ పై అధికారులకు నివేదిక పంపారన్న విమర్శలు వస్తున్నాయి. అధికారులు చెప్పిన ప్రకారం చూసినా.. కొట్టుకుపోయిన కరకట్టలకు ఎంబీ రికార్డులు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఎక్కడా వివరించలేదు. అలాగే అసలు అక్కడ కరకట్ట నిర్మాణాలే లేవని తెలుస్తుండగా.. కొట్టుకుపోయినట్టు అధికారులు చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని లోతుగా చూస్తే.. వరద ముసుగులో కట్టని కరకట్టలకు ఎంబీలు రికార్డు చేసి, బిల్లులు పొందేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారన్న విషయం మరోసారి స్పష్టమవుతున్నది. అలాగే బిల్లు చెల్లింపులకు సిఫారసు చెయ్యలేదనే చెబుతున్నారే తప్ప వాటిని రద్దు చేసినట్టు ఎక్కడా నివేదికలో పేర్కొనకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
అలాగే సబ్ కాంట్రాక్టర్లకు సంబంధించి ఎక్కడా అధికారిక ఒప్పందాలు లేవని నివేదికలో పేర్కొన్న అధికారులు, సబ్ కాంట్రాక్టర్లను ఎలా ప్రోత్సహిస్తారన్న దానికి మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేశారు. చెక్‌డ్యాం నిర్మాణం కోసం మాత్రమే అనుమతి పొందిన రెడిమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ దుర్వినియోగానికి పాల్పడిన విషయాన్ని అప్పుడే అధికారులు తెలుసుకొని, రాజన్న సిరిసిల్ల అసిస్టెంట్ డైరెక్టర్, మైన్స్, జియాలజీ శాఖ అధికారులు ఆ ఏజెన్సీపై జరిమానా విధించినట్టు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తున్నది. అయితే ఆనాడు ఎంత మొత్తం రికవరీ చేశారు? ఆ తర్వాత సంబంధిత కాంట్రాక్టర్‌పై తీసుకున్న చర్యలేమిటీ? అన్న వివరాలను నివేదికలో పొందుపరచలేదని తెలిసింది. నిజానికి కాంట్రాక్టు నిబంధనల ప్రకారం చూస్తే.. ఒక పనిలో 45 శాతానికి మించి సబ్‌కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వరాదు. కానీ, ఇక్కడ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు. అలాగే, సబ్ కాంట్రాక్టర్ ఏకంగా రెడిమిక్స్ ప్లాంట్ పెట్టినట్టు అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టర్‌కు కాకుండా సబ్ కాంట్రాక్టర్ రెడీమిక్స్ ప్లాంట్ పెట్టడం ఏమిటీ? కేవలం ఫైన్‌తో సరిపెట్టడం ఏమిటీ? వీటిని చూస్తే సబ్ కాంట్రాక్టర్‌కు.. కీలకం చక్రం తిప్పే అధికారి పూర్తి వత్తాసు పలుకుతున్నట్టు తెలుస్తున్నది.