శివ్వంపేట : శివ్వంపేట మండలంలోని ఎమ్మెల్యే స్వగ్రామమైన గోమారం గ్రామంలో బోనాల ( Bonalu ) పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి (Sunitha Laxma Reddy ) కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని గ్రామదేవతలకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. అమ్మవారికి బోనాలు సమర్పించిన అనంతరం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, వాకిటి హనుమంతు రెడ్డి, కుంట లక్ష్మణ్, బిక్షపతి రెడ్డి, నవీన్, దేవేందర్, నగేష్, విజయ్ గౌడ్, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.