Allahabad High Court : వరకట్నం (Dowry) కోసం వేధించిన ఆధారాలు ఉండి, వివాహమైన ఏడేళ్లలోపే మహిళ మరణిస్తే ఆమె వరకట్న హత్య (Dowry killing) కు గురైనట్లుగానే పరిగణించవచ్చని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) పేర్కొన్నది. ఇలాంటి సందర్భంలో ఆమె మృతికి భర్త, అత్తింటి వారి ప్రత్యక్ష ప్రమేయం ఉందనడానికి ఎలాంటి సాక్ష్యాలు అవసరంలేదని స్పష్టంచేసింది.
వరకట్న హత్య కేసులో సందీప్ సింగ్ హోరా అనే వ్యక్తికి విధించిన జీవిత ఖైదును పదేళ్లకు తగ్గిస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అతని భార్య అత్తగారింట అసహజ మరణానికి గురయ్యారని కోర్టు నిర్ధారించింది. అయితే దోషిగా నిర్ధారించిన భర్తకు జీవిత ఖైదు విధించడానికి గల కారణాలను, పరిస్థితులను దిగువ కోర్టు సహేతుకంగా పేర్కొనలేదని హైకోర్టు జడ్జి అభిప్రాయపడ్డారు. అరుదైన కేసుల్లోనే యావజ్జీవ కఠిన కారాగారాన్ని విధిస్తారని తెలిపారు.