‘ఎర్రవల్లిలోని 325 సర్వే నెంబర్లో ఉన్న 388 ఎకరాల ప్రభుత్వ భూమిని కేసీఆర్ తన ఆధీనంలో ఉంచుకున్నారు. వెంటనే సర్వే చేసి కబ్జా సంగతి 30 రోజుల్లో తేల్చాలని అధికారులను ఆదేశిస్తున్నా. ఈ భూమిని ప్రభుత్వం తీసుకొని ఒక్కొక్కరికి అర ఎకరం చొప్పున 800 మంది దళితులకు పంపిణీ చేస్తా. ఇక్కడే పట్టాలు పంపిణీ చేస్తా’
– అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన ఇది.
మూడు రోజులుగా సిద్దిపేట జిల్లా రెవెన్యూ అధికారులు ఎర్రవల్లి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా, 325 సర్వేనంబర్‌లో సర్వే చేస్తున్నారు. సీఎం రేవంత్ ఆరోపించినట్టుగా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి, 325 సర్వే నంబర్లోని అసైన్డ్ భూమికి సంబంధమే లేదని తేల్చారు. అసెంబ్లీ సాక్షిగా ఘీంకారాలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి నవ్వులపాలయ్యే పరిస్థితి వచ్చింది.

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): అప్పుడెప్పుడో 1980లో ఇందిరమ్మ కాలంలో దళితులకు భూములు ఇచ్చినప్పటికీ నాలుగు దశాబ్దాలపాటు అవి గడ్డి భూములుగానే మిగిలిపోయాయి. ఆ భూములను దళితులు చూసుకొని మురవటమే తప్ప పైసా ఆమ్దానీ పొందలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే రాళ్లురప్పలతో నిండిన భూమిని సాగుయోగ్యంగా మార్చారు. తన వ్యవసాయ క్షేత్రం పక్కనే ఉన్న దళితుల దయనీయ స్థితిని చూసి వారికి బతుకునిచ్చే ఉద్దేశంతో ఆ భూములను కేసీఆర్ సిరుల మాగాణంగా కొత్త రూపునిచ్చారు. రాజకీయంగా కేసీఆర్‌పై కక్షతో రగిలిపోతున్న కాంగ్రెస్ సర్కారు, దళితుల భూములను కేసీఆర్ కబ్జా చేశారని అసెంబ్లీ సాక్షిగా ఆరోపించింది. సీఎం రేవంత్ సభలో ప్రటించిన 325 సర్వేనంబర్‌లో అసలు కేసీఆర్‌కు ఇంచు భూమి కూడా లేదని తేలడంతో సర్కారు పరువుపోయింది.
ఎర్రవల్లి దళిత రైతులు ప్రభుత్వానికే మద్దతుగా ఉంటారని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతారని, వాళ్లను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ అధినేతను మరింత ఇరకాటంలోకి నెట్టొచ్చని రేవంత్‌రెడ్డి భావించారు. కానీ ఇది కూడా అడ్డం తిరిగింది. దీంతో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చకోవడానికి ఎర్రవల్లి దళిత రైతులపైకి సర్కారు దండెత్తింది. అసైన్డ్ భూములుగా దళితులకు హక్కున్నప్పటికీ, వాటిని గైరాన్ ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ అవి మీ కబ్జాలో ఎందుకున్నాయి? మీకెలాంటి హక్కులున్నాయో చెప్పాలని నోటీసులు ఇచ్చింది.
అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించినట్టుగా డపుపకొట్టిన 800 మంది రైతులకు అరెకరం చొప్పున ఎర్రవల్లి దళితుల భూములను పంచుతానని చెప్పి వారిలో గుబులు పుట్టించారు. మరోవైపు ఈ వివాదం చాలదన్నట్టు ఎర్రవల్లి శివారు వెంకటపూర్ రైతులు ఆభూములు తమవని, కొన్నేండ్ల కిందట రికార్డులు మారిపోయాయని కొత్త పంచాయతీని తెరపైకి తీసుకొచ్చారు. ఎకరం కోటిన్నరపైనే పలికే భూములపై ఎవరి కన్నుపడింది? ఎందుకు ఈ వివాదం పెద్దదవుతున్నది? కుట్ర దాగి ఉన్నదా? అనే కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేసీఆర్‌ను బద్నాం చేయాలనుకున్న సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు బద్దలయ్యాయి. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఇంచు అసైన్డ్ భూమి కూడా లేదని అధికారుల సర్వేలో తేటతెల్లమైంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారనుకున్న ఎర్రవల్లి దళిత రైతులు కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు. కుట్రలు, కుతంత్రాలన్నీ బెడిసికొట్టడంతో సీఎం ఫ్రస్ట్రేషన్ పతాకస్థాయికి చేరింది. కేసీఆర్‌పై కక్షను ఎర్రవల్లి దళిత రైతులపై తీర్చుకునేందుకు పంతంగట్టారు. అక్కడి దళిత రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ‘మీరు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూమి మీదేనని నిరూపించుకోవాలి’ అంటూ హుకుం జారీచేసింది. శనివారం సిద్దిపేట జిల్లా మర్కూక్ తహసీల్దార్ తొలి విడుతగా 120 మంది రైతులకు నోటీసులు జారీ చేశారు. రెండురోజుల్లో ఆధారాలు చూపించాలని ఆదేశించారు. ఆ నోటీసులతో దళిత రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న తమ భూమిని కాంగ్రెస్ సర్కార్ ఎక్కడ గుంజుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మూడురోజులుగా రెవెన్యూ అధికారులు ఎర్రవల్లిలోని 325 సర్వేనంబర్‌లో ఉన్న 388 ఎకరాల అసైన్డ్ భూమిలో సర్వే చేస్తున్నారు. ఇక్కడ ఎంత భూమి ఉన్నది? ఎంత మంది రైతులున్నారు? ఎవరు కబ్జాలో ఉన్నారు? ఎవరి పేరుపై ఎంత భూమి ఉన్నది? అనే లెక్కలు తీస్తున్నారు. అధికారులు దాదాపుగా సర్వే పూర్తిచేశారు. ఆ తర్వాత అక్కడి అసైన్డ్ భూమిలో కబ్జాలో ఉన్న దళిత రైతులకు నోటీసులు జారీచేస్తున్నారు. మొత్తం 243 మంది దళిత రైతులకు గానూ శనివారం 120 మందికి నోటీసులు అందజేశారు. మిగతా వారికి నేడో, రేపో జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
‘మర్కూక్ మండలం, ఎర్రవల్లి గ్రామ పరిధిలోని రెవెన్యూ రికార్డు, సేత్వార్ ప్రకారం సర్వే నం. 325లో గైరాన్ ప్రభుత్వ భూమిగా నమోదైన మొత్తం విస్తీర్ణం 388.05 ఎకరాల భూమి సమగ్ర సర్వే/ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించబడును. కావున పైభూమికి సంబంధించి పహాణీలో పట్టాదారులు/అనుభవదారులుగా నమోదైన మీకు తేదీ 21.09.2026 రోజున మీ యొక్క భూమి వద్ద తగిన ఆధారాలతో తప్పనిసరిగా హాజరై మీ హద్దులను సర్వే అధికారులకు తెలుపగలరు’ అంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కబ్జాలో ఉన్న భూమికి సంబంధించిన ఆధారాలు చూపించాలని ఆదేశాలు జారీచేశారు.
325 సర్వేనంబర్‌లో 388 ఎకరాల ప్రభుత్వ భూమిని కేసీఆర్ ఆక్రమించుకున్నారంటూ సీఎం అసెంబ్లీ సాక్షిగా చేసిన ఆరోపణలన్నీ కట్టుకథలేనని రెవెన్యూ అధికారుల సర్వేతో తేలిపోయింది. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఎర్రవల్లిలో వాలిపోయింది. మూడురోజులుగా 325 సర్వేనంబర్‌ను జల్లెడ పడుతున్నది. అణువణువూ సర్వే చేసింది. ఈ సర్వేలో సీఎంకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించినట్టుగా 325లోని అసైన్డ్ భూమి ఎలాంటి కబ్జాకు గురికాలేదని, కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఎలాంటి అసైన్డ్ భూమి లేదని తేల్చారు. అసలు 325 సర్వేనంబర్‌లోని అసైన్డ్ భూమికి, కేసీఆర్ వ్యవసాయ క్షేత్ర భూమికి సంబంధమే లేదని తేల్చారు. రోడ్డుకు ఒకవైపు 325లోని 388 ఎకరాల అసైన్డ్ భూమి ఉంటే, రోడ్డుకు మరోవైపు, మరో సర్వేనంబర్‌లో కేసీఆర్ వ్యవసాయ క్షేత్ర భూమి ఉన్నదని తేల్చారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి, కుట్రల బ్యాచ్ నోట్లో పచ్చివెలక్కాయ పడినట్టు అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఎర్రవల్లి దళిత రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్ కబ్జా చేశారనే ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఇక్కడ వ్యవసాయ క్షేత్రం నిర్మించలేదని, తెలంగాణ రాకముందే ఆయనకు ఇక్కడ ఫామ్‌హౌస్ ఉన్నదని చెప్తున్నారు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఇంచు భూమి కూడా అసైన్డ్, ప్రభుత్వ భూమిలేదని, ఆయన ఎవరి భూమినీ కబ్జా చేయలేదని చెప్తున్నారు. ఆయన వ్యవసాయ క్షేత్రంలోని భూమి మొత్తం పట్టా భూమేనని, రైతులు విక్రయిస్తే వారి నుంచి డబ్బులిచ్చి కొనుగోలు చేశారని, ఆయన ఎవరికీ అన్యాయం చేయలేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ సీఎం కాకముందు 325లోని 388 ఎకరాల్లోని అసైన్డ్ భూములు కొండలు, రాళ్లు, రప్పలు, ముండ్లకంచెతో ఉండేవని, కేసీఆరే వాటిని చదును చేయించారని చెప్తున్నారు.
అంతేకాదు.. కాళేశ్వరం ద్వారా ఇక్కడికి నీళ్లొచ్చేలా కాలువ తవ్వించి, పాండురంగ చెరువును తవ్వించి నీళ్ల సౌకర్యం కల్పించారని అంటున్నారు. దీంతో నాడు కొండలుగా ఉన్న భూమి నేడు పచ్చగా మారిందంటున్నారు. తమకు ఇంత చేసిన వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధ కలిగిస్తున్నదని రైతులు పేర్కొన్నారు. ఏదైనా ఉంటే రాజకీయంగానే చూసుకోవాలని, ఇలా తమలాంటి దళిత రైతులను అడ్డుపెట్టుకుని శిఖండి రాజకీయం చేయడం చేతగానితనమే అవుతుందని మండిపడుతున్నారు. ఇలా ఎర్రవల్లిలోని దళిత రైతులు కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు. అయితే ఇది సీఎం జీర్ణించుకోలేకపోతున్నారు. సర్కార్‌కు వ్యతిరేకంగా కేసీఆర్‌కు మద్దతుగా నిలిచిన రైతులపై సీఎం కక్ష పెంచుకున్నారు. అందుకే వారి భూమిని వారికి కాకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. వారి భూమిని ఇతర రైతులకు పంపిణీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారు.
సర్వే నంబరు 325లోని 388 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని 800 మంది దళితులకు ఒక్కొక్కరికీ అర ఎకరం చొప్పున పట్టాలు పంపిణీ చేస్తానంటూ సీఎం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడి రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. తమ భూమిని ఎవరికో పంచేందుకు సర్కార్ కుట్ర చేస్తున్నదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 1980లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఇక్కడి 80 దళిత రైతు కుటుంబాలకు ప్రభుత్వ భూమిని పంపిణీ చేసి అసైన్డ్ పట్టాలను అందించింది. ఇప్పుడు ఆ 80 కుటుంబాల సంఖ్య 180కి పెరిగింది. ఇందులోని సభ్యుల సంఖ్య 243 మందికి పెరిగింది.
అప్పటి నుంచి ఆ రైతులకు సంబంధించిన కుటుంబాలే సాగు చేసుకుంటున్నాయి. కానీ ఇప్పుడున్న తమ భూములను ఎవరికో పంచేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదంటూ అక్కడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అక్కడి భూముల విలువ ఇప్పుడు భారీగా పెరిగింది. రోడ్డుపక్కన భూమి ఎకరం కనీసం రూ.కోటి నుంచి రూ.1.2 కోట్ల వరకు ధర పలుకుతున్నది. ఇంత విలువైన భూమిని సొంత రైతులకు దక్కకుండా సర్కార్ కుట్రలు చేస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
243 మంది రైతులకు చెందిన భూమిని 800 మంది దళితులకు పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. అంటే వేరే ప్రాంతానికి చెందిన దళితులకు ఇక్కడ భూమి కేటాయిస్తారా? అనే ఆందోళనలు స్థానిక దళితుల్లో వ్యక్తమవుతున్నాయి. లేనిపక్షంలో 800 మందికి పట్టాలు పంపిణీ చేస్తానని ఎందుకు ప్రకటించారని ప్రశ్నిస్తున్నారు. తద్వారా అక్కడ కూడా దళితుల మధ్య విద్వేషాలు పెంచి మంట పెట్టించి చలి కాచుకోవాలని చేస్తున్నారా? అంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఎన్నో ఏండ్ల నుంచి ఈ భూమిలనే పంటలు పండిస్తున్నం. ఎంతో మంది రైతులం ఈ భూముల ఆధారంగా బతుకుతుర్రు. పంటలేసుకొని బతుకుతున్న మమ్మల్ని ఇబ్బందులు పెట్టొద్దు. అధికారులు మాకు అన్యాయం చేయొద్దు. సర్వే చేసి మా భూములు మాకే ఇయ్యాలే. ఎన్నడూ లేనిది అధికారులు సర్వేచేస్తే భయంగా ఉన్నది. ఎట్లున్నా మాకు మాత్రం అన్యాయం జరుగకుండా చూడాలే.
-బెజరమైన చంద్రకళ, రైతు, ఎర్రవల్లి, సిద్దిపేట జిల్లా