ఈ నెల 21న వరల్డ్ అల్జీమర్స్ డే
నేను అనే ఉనికి మనిషిని మిగతా జీవులకి భిన్నంగా ఉంచుతున్నది. నా వ్యక్తిత్వం అనే అవగాహన తనను మిగతా మనుషుల్లో ప్రత్యేకంగా నిలుపుతున్నది.ప్రతి పేరు వెనుకా ఏండ్ల తరబడి ఏర్పరుచుకున్న అభిప్రాయాలు, దాటిన కష్టాలు, నిలబెట్టుకున్న పరపతి, సంపాదించిన ఆస్తి, మంచిచెడుల ప్రవర్తన, అలవాట్లు, ఇష్టాయిష్టాలు, బంధాలు, జ్ఞాపకాలు.. ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా క్రమంగా సన్నగిల్లుతుంటే.. కట్టుకున్న ఇల్లు, తోడున్న కుటుంబం, చివరికి తన పేరును సైతం మర్చిపోతే.. అదే అల్జీమర్స్! అలాగని అధైర్య పడనక్కర్లేదు. అల్జీమర్స్కి ఇప్పుడు చాలా మంచి మందులే వచ్చాయి. చికిత్సా పద్ధతుల్లోనూ వేగం పెరిగింది. వీటన్నిటికీ మించి అవగాహన ముఖ్యం. ఆ అవగాహన కల్పించే సందర్భమే ‘వరల్డ్ అల్జీమర్స్ డే’.
వయసుతో పాటు జ్ఞాపకశక్తి తగ్గడం వేల ఏండ్ల నుంచి గమనిస్తున్నదే. భారతీయుల నుంచి గ్రీకు వైద్యుల వరకూ సంప్రదాయ వైద్యంతో సరిదిద్దే ప్రయత్నం చేసేవారు. కొంతమందిలో మతిమరుపునకు కారణం కేవలం వయసు కాదనీ వారి మెదడులో ఉన్న సమస్య అని 1901లో గుర్తించారు. అలా గుర్తించిన వైద్యుడే అల్జీమర్. అతని పేరు మీదుగానే ఈ వ్యాధి స్థిరపడిపోయింది. అగస్ట్డెటర్ అనే 50 ఏండ్ల రోగిలో ఒక్కసారిగా జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, భ్రమల్లో గడపడం చూసిన అల్జీమర్, దీని వెనుక ఏదో ప్రత్యేకమైన వ్యాధి ఉందని గుర్తించాడు. కానీ, అల్జీమర్స్ గురించిన ప్రచారం మాత్రం నిదానంగానే గడిచింది. పైగా అవగాహన కంటే అపోహలే ఎక్కువగా సాగేవి. ఇలాంటి సమయంలో Alzheimer’s Disease International అనే సంస్థ దీని మీద ప్రచారానికి పూనుకుంది. అందులో భాగంగానే 1994 నుంచి ఏటా సెప్టెంబర్ 21ని ‘వరల్డ్ అల్జీమర్స్ డే’గా నిర్వహిస్తున్నది.

కారణం స్పష్టం?
అమెలాయిడ్ బీటా ప్రొటీన్, టావ్ ప్రొటీన్ ఈ రెండు ప్రొటీన్ల తీరులో ఏర్పడే సమస్యే అల్జీమర్స్కి దారి తీస్తుందని కనిపెట్టారు. అమెలాయిడ్ ప్రొటీన్ విపరీతంగా ఉత్పత్తి అవుతూ న్యూరాన్ల మధ్య అడ్డుగోడలా నిలుస్తుంది. ఇక టావ్ ప్రొటీన్ న్యూరాన్లు దెబ్బతినేలా చేస్తుంది. ఈ రెండు సమస్యలూ కలిసి అల్జీమర్స్కి దారితీస్తాయి.
అల్జీమర్స్ ఎలా వస్తుందో తెలిసింది. కానీ, ఎందుకు వస్తుందనే దానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది వంశపారంపర్యం. రక్త సంబంధీకులలో ఎవరో ఒకరికి ఈ సమస్య ఉంటే అల్జీమర్స్ వచ్చే అవకాశం ఎక్కువని అంటారు. ఇందులో కూడా ఓ వైవిధ్యం ఉంది. APOE e4 అనే జన్యువు సంక్రమిస్తే సదరు వ్యక్తికి అల్జీమర్స్ రావచ్చు, రాకపోవచ్చు. ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగో వంతు మందిలో ఈ జన్యువు ఉంటుంది. కానీ, అందరికీ అల్జీమర్స్ రావాలని లేదు. APP, PSEN1, PSEN2 అనే మూడు జన్యువులలో సమస్య ఉంటే అల్జీమర్స్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇవే కాకుండా డౌన్ సిండ్రోమ్, MCI (Mild cognitive impairment) అనే సమస్య, తలకు తీవ్రమైన గాయాలు కావడం లాంటివి కూడా మన చేతుల్లో లేని కారణాలు. అయితే మన వాతావరణం, జీవనశైలి, అలవాట్లు కూడా అల్జీమర్స్ రావడానికి లేదా తీవ్రతరం కావడానికి కారణం అవుతున్నాయంటూ లాన్సెట్ ప్రకటించిన ఓ నివేదిక సంచలనం సృష్టించింది. ఈ జాబితాలోని 14 కారణాలని కనుక మనం అదుపులో ఉంచుకోగలిగితే ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ కేసులలో దాదాపు 45 శాతం వరకూ అదుపు చేయవచ్చని అంచనా వేసింది ఆ నివేదిక. దీని ప్రకారం అల్జీమర్స్‌కు గురిచేసే కొన్ని కారణాలు ఇలా ఉన్నాయి..
నిరక్షరాస్యత: ఇది ఆశ్చర్యకరమైన కారణంగా కనిపిస్తుంది. చిన్నప్పుడు చదువుకోని వారిలో అల్జీమర్స్ వచ్చే ప్రమాదం అయిదు శాతం ఎక్కువని అంచనా వేసింది లాన్సెట్. చదవడం, రాయడం, నేర్చుకోవడం, విశ్లేషించడం, సమస్యలు పరిష్కరించడం ఇవన్నీ కూడా విద్యలో భాగంగా ఉంటాయి. వాటివల్ల మెదడు సమర్థత పెరుగుతుంది. దీన్నే కాగ్నిటివ్ రిజర్వ్ అంటారు. దీనివల్ల మెదడుకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, దాన్ని తట్టుకునే నైపుణ్యం అలవడుతుంది.
వినికిడి లోపం: నామోషీతోనో, అశ్రద్ధగానో చాలామంది వినిపించక పోవడాన్ని పట్టించుకోరు. ఫలితంగా శబ్దాలను విశ్లేషించే మెదడు భాగం దెబ్బతింటుంది. ఎదుటివారి మాటలను అర్థం చేసుకునే ప్రయత్నంలో మరికొన్ని భాగాలు అలసిపోతాయి. సమస్య బయటపడకుండా ఉండేందుకు ఏకాంతాన్ని ఆశ్రయిస్తారు. వీటన్నిటి ఫలితంగా అల్జీమర్స్ త్వరగా రావడమో, ఉధృతం కావడమో జరుగుతుంది. అది కూడా 7 శాతం వరకూ!
అదుపు తప్పిన రక్తపోటు: బీపీని పట్టించుకోకపోవడం అంటే రక్తనాళాలను దెబ్బతీయడమే. ఫలితంగా మెదడుకి చేరాల్సినంత రక్తం చేరకపోవడం, గడ్డలు ఏర్పడటం, పైకి కనిపించని స్ట్రోక్స్, న్యూరాన్లు దెబ్బతినడం లాంటి సమస్యలన్నీ అల్జీమర్స్‌ని ప్రోత్సహిస్తాయి.
పొగ, మద్యపానం: ఈ రెండూ కూడా అల్జీమర్స్‌ని రెచ్చగొట్టేవే. ధూమపానం రక్తనాళాలు గట్టిపడేలా చేస్తుంది. మెదడుకి తగినంత ప్రాణవాయువు దక్కకుండా చేస్తుంది. ఇక మద్యం కూడా నాడీ వ్యవస్థని నేరుగా దెబ్బతీస్తుంది. పోషకాల నుంచి నిద్ర వరకూ ఒంటికి కావాల్సిన ఆరోగ్యాన్ని దూరం చేస్తుంది. ఫలితం.. మెదడు త్వరత్వరగా అల్జీమర్స్ వైపు ప్రయాణిస్తుంది.
ఊబకాయం: అధిక బరువుతో రక్తప్రసరణ, ఇన్సులిన్ స్థాయులలో సమస్యలు వస్తాయి. ఇవి రక్తపోటు, మధుమేహాలతో పాటు మెదడుని కూడా ప్రభావితం చేస్తాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు) సమస్య ఏర్పడుతుంది. కదలని మెదలని సెడెంటరీ జీవన విధానం వల్ల కూడా ఇవే సమస్యలు ఉంటాయి. అంతిమంగా అల్జీమర్స్కి సాయపడతాయి.
కుంగుబాటు, ఒంటరితనం: కుంగుబాటులో నిద్ర సరిగ్గా ఉండదు. శరీర వ్యాయామం అసలే ఉండదు. కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్ల తీరు కూడా మారుతుంది. ఇవన్నీ మెదడు మీద ప్రభావం చూపేవే. ఒంటరితనంలో ఈ సమస్యలతో పాటుగా సామాజిక నైపుణ్యాలు కొరవడటం, భాష ఇంకా ఉద్వేగాల మీద నియంత్రణ లేకపోవడం లాంటి ఇబ్బందులూ ఉంటాయి.
కాలుష్యం: ఆశ్చర్యంగా ఉన్నా వాయుకాలుష్యం కూడా ఓ ముఖ్యమైన అంశమే. పీల్చే గాలిలో ఉండే సన్నటి ధూళి కణాలు మన ఊపరితిత్తుల్లోకి చేరి శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు)ని కలిగిస్తాయి. ఇదొక సమస్య అయితే అంతకంటే సన్నటి ధూళి ఏకంగా రక్తం ద్వారా మెదడుని కూడా చేరుకుంటున్నదనే విశ్లేషణ సాగింది. అలా చేరిన ధూళి మెదడును దెబ్బతీస్తుందని తేలింది.
వీటితో పాటుగా ఒంట్లో కొవ్వు శాతం పెరగడం, దృష్టిలోపం, మధుమేహం, తలకు బలమైన గాయాలు అనే మరో నాలుగు కారణాలు కూడా మెదడు మీద ప్రతికూల ప్రభావం చూపిస్తాయని తేల్చింది లాన్సెట్. అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి! ఈ కారణాలు ప్రత్యేకించి అల్జీమర్స్‌ని కలిగించవు. కానీ, ఒక వ్యక్తిలో అల్జీమర్స్ ఏర్పడే ప్రమాదం ఉంటే, దాన్ని త్వరితగతం చేయడం లేదా అప్పటికే అల్జీమర్స్ వచ్చి ఉంటే.. దాన్ని తీవ్రతరం చేయడానికి సాయపడతాయి.
ఈ కారణాలు సూచించే మరో ముఖ్యమైన పాఠం నియంత్రణ. ఈ 14 అంశాలలో తలకు గాయాలు కావడం తప్ప మిగతా కారణాలన్నీ మన అదుపులో ఉండేవే. వీటిలో ధూమపానం, శరీర వ్యాయామం లేకపోవడం లాంటి కారణాలను పూర్తిగా నివారించవచ్చు. రక్తపోటు, మధుమేహం, కొవ్వు లాంటి అంశాలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. వినికిడి లోపం, కుంగుబాటు లాంటి సమస్యలకి నిపుణులను సంప్రదించవచ్చు. హెల్మెట్ ధరించడం వల్ల తలకు గాయాలయ్యే ప్రమాదాన్ని సైతం తగ్గించుకోవచ్చు.

Barin
పసిగట్టాల్సిన లక్షణాలు!
వయసుతో పాటు మతిమరుపు రావడం సహజం. నిజానికి అల్జీమర్స్ కూడా మతిమరుపు అనే అతిపెద్ద సమస్యకి ఒకానొక కారణం మాత్రమే. కాబట్టి ఫలానా ప్రవర్తన అల్జీమర్స్ వల్లేమో అనే విశ్లేషణకి కొన్ని లక్షణాలను గమనించాలి.
ఎర్లీ స్టేజ్ కూడా దాటిన రోగులలో తీవ్రమైన సమస్యలు మొదలవుతాయి. పదాల కోసం తడుముకోవడం, రాయలేకపోవడం, దగ్గర బంధువులనీ, పాత విషయాలనీ మర్చిపోవడం, భావోద్వేగాల మీద నియంత్రణ లేకపోవడం, మూత్రాన్ని అదుపుచేసుకోలేకపోవడం లాంటి తీవ్రమైన లక్షణాలు మొదలవుతాయి. బయటికి వెళ్తే ఇంటికి దారి మర్చిపోవడం, రోజువారీ వస్తువులను కూడా గుర్తుపట్టలేకపోవడం, దుస్తులు వేసుకోవడం, తేదీ నెలలాంటివి కూడా మర్చిపోవడం కనిపిస్తుంది.
ఈ మిడిల్స్టేజ్ కుటుంబం మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో మనిషి మీద ఓ కన్ను వేసి ఉంచితే సరిపోతుంది. అలా కాకుండా ఈ దశలో కూడా అశ్రద్ధ జరిగితే తిండి తినడం, నడవడం, ఇంట్లో వాళ్లని గుర్తుపట్టడం లాంటి చిన్నపాటి చర్యల మీద కూడా నియంత్రణ కోల్పోతారు. ఇది నేరుగా మరణానికి దారితీయకపోయినా.. నిరంతరం మంచం మీదే ఉండటం వల్ల ఏర్పడే సమస్యలతో కాలం దగ్గరపడుతుంది.
అల్జీమర్స్కి పూర్తిస్థాయి చికిత్స లేకపోవచ్చు. కానీ దాన్ని ఇప్పుడు చాలా తేలికగా, తొలి దశలోనే పసిగట్ట గలుగుతున్నారు. సమస్య వేగాన్నీ తగ్గించగలుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది భయం కాదు.. అవగాహన.
ఇలా గుర్తిస్తారు!

జ్ఞాపకశక్తి అనుమానాస్పదంగా ఉండటం, మరీ ముఖ్యంగా చిన్న వయసులోనూ మతిమరుపు లక్షణాలు కనిపిస్తే వైద్యుడి దగ్గరికి వెళ్లి తీరాలి. తను గడిచిన విషయాలు, తీసుకుంటున్న మందులు, కుటుంబ నేపథ్యం ఆధారంగా అల్జీమర్స్ రిస్క్ ఎంతవరకు ఉంది? అన్న అంచనాకి వస్తాడు. కాగ్నిటివ్ టెస్టింగ్.. అంటే పేర్లు, వస్తువులు, లెక్కలు, తేదీలు లాంటివి అడుగుతూ జ్ఞాపకశక్తి స్థాయిని గ్రహిస్తారు. బి12, థైరాయిడ్‌లాంటి రక్త పరీక్షల ద్వారా మతిమరుపునకు ఇతరత్రా కారణాలు ఉన్నాయేమో అని విశ్లేషిస్తారు.
ప్రాథమిక పరీక్షలన్నీ అల్జీమర్స్ సూచిస్తుంటే MRI, CT స్కాన్ల అవసరం పడవచ్చు. వీటిలో మెదడు పరిమాణం తగ్గిపోవడం, రక్తనాళాలు దెబ్బతినడం, కణితులు బయటపడతాయి. వీటి ఆధారంగా రోగ స్థాయి తెలుస్తుంది. అలాగే శరీరంలో అమెలాయిడ్, టావ్ ప్రొటీన్ల తీరును అంచనా వేసే రక్తపరీక్షలు కూడా అల్జీమర్స్‌ని నిర్ధారిస్తాయి.
మెదడుకి అండగా!
ఇంట్లో ఇల్లాలు అందరి గురించీ ఆలోచించి, శ్రమించి తన సంగతే మర్చిపోతుంటుంది. మెదడు కూడా అంతే!
శరీరంలో ప్రతి భాగం గురించీ శ్రద్ధ తీసుకునే తను తన ఆరోగ్యాన్ని పట్టించుకోదు. కాస్త జాగ్రత్తపడాల్సిందే! చాలామంది మెదడుకి బలం
అనగానే పజిల్స్, సుడోకు లాంటివి మాత్రమే అనుకుంటారు. అందరికీ అవి ఆసక్తి ఉండకపోవచ్చు. మాటిమాటికీ చేయడం వల్ల బోర్
కొట్టేయవచ్చు. నిజానికి మెదడుకి దన్నుగా నిలిచే వ్యాపకాలు చాలానే ఉన్నాయి.
ఏదన్నా కొత్తది నేర్చుకోవడం
ఏదన్నా కొత్త భాష, వాద్యం, ఫొటోగ్రఫీ లాంటి వ్యాపకం, కోడింగ్ లాంటి నైపుణ్యం అలవర్చుకున్నప్పుడు మెదడు బలపడుతుంది. వ్యాయామం చేస్తే కండరాలు బలపడినట్టే మెదడుకి పనిపడితే సరికొత్త న్యూరాన్లు ఏర్పడతాయి. దీనికోసం పూర్తి అపరిచితమైన పనులే చేయాల్సిన అవసరం లేదు. తరచూ చేసే వంట, ప్రయాణాలు లాంటి విషయాల్లోనూ కొత్తదనాన్ని ప్రయత్నించవచ్చు.
చదవడం
పుస్తకాన్ని చదువుతున్నప్పుడు కేవలం మనం అక్షరాలను మాత్రమే చూడం. మెదడు వాటిని ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేస్తుంది, తెలియకుండానే ఓ విశ్లేషణ జరుగుతుంది, మంచిచెడుల బేరీజు ఉంటుంది, భాష మీద పట్టు నిలుస్తుంది. అన్నిటికీ మించి ఆత్మకథల నుంచి పేపర్లో వార్తల వరకూ మనం చదివే ప్రతిదీ మెదడుకి కొత్త తరహా సమాచారాన్ని ఇస్తుంది. న్యూరాన్ల మధ్య బంధాన్ని పెంచుతుంది.
రాస్తూ రాస్తూ ఉంటే
రాయడం అనే చిన్నపాటి చర్య మెదడు మీద ఎంత ప్రభావితం చూపిస్తుందో చెప్పే లెక్కలేనన్ని అధ్యయనాలు ఉన్నాయి. రోజువారీ జరిగిన విషయాలను డైరీలా రాయడం వల్ల మెదడు వాటన్నిటినీ గుర్తుంచుకుని తీరాల్సిన భారం తగ్గుతుంది, అభిప్రాయాలు రాయడం వల్ల స్పష్టత వస్తుంది, పాత జ్ఞాపకాలని మళ్లీ రాయడం వల్ల అవి బలపడతాయి, ఆలోచనలు రాస్తే సృజనాత్మకత పెరుగుతుంది.
సామాజిక బంధాలు
నలుగురితో కలిసిమెలిసి ఉండటానికీ మెదడుకీ ఏంటి సంబంధం? ఎవరు ఏం చెబుతున్నారు, ఏ స్థితిలో ఉన్నారు అనే సోయి ఉంటుంది, ఉద్వేగాలు వెల్లడించడంలో పసిగట్టడంలో నేర్పు పెరుగుతుంది, కలిసిన వ్యక్తుల గురించి వారితో మాట్లాడిన విషయాల గురించి పాత జ్ఞాపకాలన్నీ వెల్లువెత్తుతాయి, కష్టసుఖాలను పంచుకుంటూ మనసు తేలికపడుతుంది, భాష మీద అదుపు ఉంటుంది. అన్నింటికీ మించి ఒంటరితనం, కుంగుబాటుల నుంచి బయటపడతారు.
వీటితో పాటు సంగీతం వినడం, మెదడుకు సవాలు విసిరే చెస్ లాంటి బోర్డ్‌గేమ్స్ ఆడటం, పిల్లలని ఆడించడం లాంటి చాలా వ్యాపకాలే ఉన్నాయి. వాటిని కాస్త పట్టించుకోవాలంతే!
అపోహల్ని మర్చిపోండి!
అల్జీమర్స్ 60, 65 ఏండ్లు దాటినవారిలోనే మొదలవుతుందని ఓ అభిప్రాయం. అల్జీమర్స్ కలిగించే జన్యువుల తీరు, వాటిని రెచ్చగొట్టే పరిస్థితులను బట్టి 40 ఏండ్ల వయసులోనే ఈ సమస్య మొదలు కావచ్చు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా 40-64 ఏండ్ల లోపే అల్జీమర్స్ బారిన పడుతున్నవారి సంఖ్య 1990లో 36 లక్షలు ఉంటే, 2021 నాటికి 77 లక్షలుగా ఉందని ఓ నివేదిక తేల్చింది.
అల్జీమర్స్ మరణాన్ని కలిగించదని ఓ అపోహ.
ఈ వ్యాధి వల్ల ఏర్పడే సమస్యల వల్ల న్యుమోనియా, రోగనిరోధక శక్తి తగ్గడం లాంటి ప్రమాదాలు జీవిత కాలాన్ని అడ్డుకుంటాయి.
అల్జీమర్స్‌తో జ్ఞాపకశక్తి మాత్రమే తగ్గుతుందని అనుకుంటారు. వీరు భావోద్వేగాల నియంత్రణ కూడా కోల్పోతారు. వ్యక్తిత్వం మారిపోతుంది. దూకుడుగానో, ఒంటరిగానో మారిపోతారు.
పథ్యంతో అల్జీమర్స్ తగ్గిపోతుందని కొందరి ఆశ. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం మెదడుకి మంచిదే అయినా.. వాటివల్ల అల్జీమర్స్ రాకపోవడమో, తగ్గిపోవడమో జరుగుతుందన్నది అపోహే అని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు! కొన్ని మందుల వల్లో, వ్యాక్సిన్ల వల్లో అల్జీమర్స్ రాదు. పన్ను పీకించుకోవడం లాంటి చికిత్సల వల్లా పెరగదు. ప్రతి మతిమరపూ (డిమెన్షియా) అల్జీమర్స్ కాదు.
మందులున్నాయ్!
అల్జీమర్స్ ఓ సాధారణ మతిమరుపుగానో, దానికి మందులు లేవనే అపోహతోనో గడిపే రోజులు కావివి. వ్యాధి ఉంది అన్న నిర్ధారణ జరిగాక, దాన్ని తీవ్రతరం చేసే రక్తపోటు లాంటి సమస్యలను అదుపులో ఉంచుకోవడంతో పాటుగా, దాని ప్రభావాన్ని తగ్గించే మందులు వచ్చాయి. అల్జీమర్స్‌ని నియంత్రించేందుకు ఎలా అయితే మందులు ఉన్నాయో, నిద్రమాత్రలు లాంటి కొన్ని మందులు దాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. కాబట్టి వైద్యుడితో పాత మందుల గురించి తప్పకుండా చర్చించాలి!
అల్జీమర్స్కి అడ్డుగోడలు

ఓ వ్యక్తిలో అల్జీమర్స్ కలిగించే జన్యువులు ఉండవచ్చు.
దురదృష్టవశాత్తు అది చిన్న వయసులోనే బయటపడవచ్చు. ఒకసారి వచ్చిన తర్వాత ఇక తగ్గడం అంటూ ఉండదు.
కానీ, మనం పాటించే కొన్ని జాగ్రత్తల వల్ల అది ఆలస్యంగా మొదలు కావడమో లేదా నామమాత్రపు ప్రభావం చూపడమో జరుగుతుంది. కేవలం అల్జీమర్స్ విషయంలోనే కాదు మనసు, శరీరం రెండూ కూడా ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండేందుకు నిపుణులు చెబుతున్న సూచనలివి.
నడక: అంటే కేవలం అలా కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లడం కాదు. బ్రిస్క్ వాకింగ్ చేయమని సూచిస్తున్నారు. ఆరుబయట ఓ 20-40 నిమిషాల బ్రిస్క్వాక్తో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇన్సులిన్ పనితీరు పెరుగుతుంది, కొవ్వు కరుగుతుంది, నిద్ర బాగా పడుతుంది. అంతిమంగా మెదడుకి మేలు జరుగుతుంది.
వేగం పెరిగేలా: బ్రిస్క్ వాకింగ్ మాత్రమే కాదు… వారంలో ఓ 150 నిమిషాల పాటు రక్తప్రసరణ వేగంగా పెరిగేలా ఏదన్నా వ్యాయామం చేసి తీరాలని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్నది. సైక్లింగ్, స్విమ్మింగ్, జాగింగ్, ఏరోబిక్స్, షటిల్ లాంటి పనులన్నీ ఈ కోవలోకే వస్తాయి.
బలపడేలా: వయసు పెరుగుతున్న కొద్దీ కండరాల పటుత్వం తగ్గుతుంది. కండరాలు బలహీనపడతాయి. ప్రొటీన్ లోపం ఏర్పడుతుంది. అందుకే చిన్నపాటి బరువులు ఎత్తడం, జిమ్ చేయడం, తోట పని లాంటివి చేస్తే శరీరం ఫిట్‌గా ఉంటుంది. అల్జీమర్స్ ఉన్న వ్యక్తులు నీరసంగా ఉంటే ఏ పనీ చేయలేకపోవడం, ఎవరినీ కలవలేకపోవడంతో మరింతగా ఆ వ్యాధి బారినపడతారు. అందుకే ఏదో ఓ రూపంలో వ్యాయామం తప్పనిసరి!
నాట్యంతో: కాస్త విచిత్రంగా ఉండవచ్చు కానీ, అల్జీమర్స్ ఉన్నవారు ఏదో ఓ నాట్యం చేయడం, తాయ్చి, యోగ సాధన వల్ల చాలా ప్రయోజనం పొందుతారని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. నాట్యం చేయడం వల్ల తన కదలికల మీద అదుపు పెరుగుతుంది; మెదడు శరీరాల మధ్య సమన్వయం బలపడుతుంది; భేషజాలను మర్చిపోయి నలుగురితో కలిసి ఆడిపాడే చొరవ ఏర్పడుతుంది. యోగా, తాయ్చితో ఏకాగ్రత, ప్రశాంతత, శ్వాస మీద అదుపు, తన శరీరం గురించి అవగాహన (body awareness) మెరుగుపడతాయి.
– కె.ఎల్.సూర్య