రోజులు భారంగా గడుస్తున్నాయా? జీవితం నిస్తేజంగా అనిపిస్తున్నదా? ఉన్నపళంగా అన్నిటినీ మార్చేయాలని అనుకుంటున్నారా? ఉద్యోగాన్ని వదిలేయడం, బంధాన్ని తెంచుకోవడం, వేరే ప్రాంతానికి వెళ్లిపోవడం.. లాంటి ఆలోచనలు చేస్తున్నారా? అయితే, అన్ని సమస్యలకూ పెద్దపెద్ద నిర్ణయాలే పరిష్కారం చూపలేవు. జీవితాన్ని పూర్తిగా తగలబెట్టేసి కొత్తగా మొదలుపెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటే, మీ ప్రాధాన్యాలను కొద్దిగా సర్దుకుంటే చాలు.. మార్పు మీలోనే కనిపిస్తుంది.
అన్ని అసౌకర్యాలకూ పెద్దపెద్ద మార్పులే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద మార్పు ద్వారా లభిస్తుందని అనుకునే ఊరట.. ఒక చిన్న హద్దును గీయడంతోనే దొరకొచ్చు. సమావేశానికి వెళ్లడం మానేస్తారా? మిమ్మల్ని విసిగించే వ్యక్తికి ‘నో’ చెబుతారా? ఉదయాన్నే ఫోన్ చూడకుండా కాసేపు ఉంటారా?.. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఇలాంటి చిన్నచిన్న మార్పులను ప్రయత్నించి చూడండి.
రోజువారీ రొటీన్ జీవితం స్తబ్ధుగా అనిపించడం సహజం. ఈ పరిస్థితిని అధిగమించడానికి, మీ జీవితంలో మళ్లీ ఉత్సాహాన్ని నింపుకోవడానికి చిన్నచిన్న మార్పులే ఎంతో సాయపడతాయి. అల్పాహారం, భోజనంలో విభిన్నమైన వంటకాలు ప్రయత్నించడం, ఆఫీసులో డెస్క్ సెటప్‌ను మార్చడం కూడా మెదడుకు తాజాదనం అందిస్తుంది.
తీవ్రమైన అలసట కూడా కొన్నిసార్లు పెద్ద సంక్షోభంలా భ్రమింపజేస్తుంది. శారీరక అలసట, నిద్రలేమి వంటివి.. మంచి ఉద్యోగాన్ని, ఆరోగ్యకరమైన బంధాన్ని కూడా భారంగా అనిపించేలా చేస్తాయి. అందుకే, ముందు ఆ అలసటను సరిదిద్దుకోండి. అవసరం అనుకుంటే.. ఓ రెండు వారాలపాటు కావాల్సినంత విశ్రాంతి తీసుకోండి. కంటినిండా నిద్రపోండి. అంతేకానీ, జీవితాన్ని మార్చే నిర్ణయాలు తీసుకోకండి.
అసలు ఎవరి విజయం కోసంమీరు శ్రమిస్తున్నారు? అనే విషయాన్ని ముందుగా తేల్చుకోండి. ఎందుకంటే.. నేటితరంలో చాలామంది తల్లిదండ్రులను, సమాజాన్ని మెప్పించే ప్రయత్నంలోనే ఎక్కువ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తమ సంతోషాన్ని కోల్పోతున్నారు. అందుకే.. మీకు నిజంగా ఏదంటే ఇష్టమో తెలుసుకోండి.
పెయింటింగ్ వేయడం నుంచి ప్రయాణాలు చేయడం, ప్రశాంతమైన జీవనం.. ఏదైనా కావొచ్చు. మీ ఆనందం ఎందులో ఉందో గుర్తించండి. కొన్నిరోజులపాటు
దాన్ని ఫాలో అవ్వండి.