మూసీని అమ్మేందుకు సర్కార్ కుట్ర
సుందరీకరణ ప్రాజెక్టు పేరిట మూసీ నదిని కార్పొరేట్ సంస్థలకు అమ్మేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మూసీ జనాందోళన్ ప్రతినిధులు ఆరోపించారు. సుందరీకరణలో భాగంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మూసీ జనాందోళన్ ఆధ్వర్యంలో మూసీ బాధితులతో కలిసి శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు.
- సుందరీకరణ మాటున రియల్ ఎస్టేట్ వ్యాపారం
- ప్రజాభిప్రాయాలు, డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు కడతారా?
- 13వేల కుటుంబాలను రోడ్డున పడేసేందుకు యత్నం
- ప్రజాభిప్రాయాలు తీసుకునేదాకా ఉద్యమం..
- ప్రభుత్వంపై మూసీ జనాందోళన్ ఆగ్రహం
సుందరీకరణ ప్రాజెక్టు పేరిట మూసీ నదిని కార్పొరేట్ సంస్థలకు అమ్మేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మూసీ జనాందోళన్ ప్రతినిధులు ఆరోపించారు. సుందరీకరణలో భాగంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మూసీ జనాందోళన్ ఆధ్వర్యంలో మూసీ బాధితులతో కలిసి శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూసీ జనాందోళన్ ప్రతినిధి సజయ మాట్లాడుతూ.. ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు సమగ్ర నివేదిక ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.
-సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ పేరిట సర్కార్ కుట్రలు పన్నుతుందని మూసీ జనాందోళన్ ప్రతినిధి సజయ అన్నారు. డీపీఆర్ పబ్లిక్ డొమైన్లో పెట్టేందుకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. డీపీఆర్ బయటపెట్టకుండానే టెండర్లు పిలవడమేంటని నిలదీశారు. డీపీఆర్ లేకుండా, టెండర్ ప్రక్రియ ముగిశాక బాధితులతో సంప్రదింపులు చేయడం ఎంతవరకు సమజసమని ప్రశ్నించారు. సంప్రదింపుల్లోనూ ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా రికార్డుల్లో నమోదు చేసుకుని మోసం చేస్తున్నారని ఆరోపించారు. టెండర్ల గడువు ముగిశాక మూసీ జనాందోళన్ ప్రతినిధులను సంప్రదింపులకు పిలిచారని..దానికి కూడా గంటన్నర సమయం మాత్రమే ఇస్తామని చెప్పడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి అద్దంపడుతున్నదని అసహనం వ్యక్తం చేశారు. కేవలం మూసీ జనాందోళన్లోని నలుగురిని పిలిచి, బాధితుల అభిప్రాయాలు తీసుకోకపోవడంపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం బాధితులకు న్యాయం జరిగేలా మూసీ ప్రాజెక్టు రూపకల్పన చేయకుండా మూసీ జనాందోళన్ తరఫున ప్రజా ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు సంధ్యా వి, సయ్యద్ బిలాల్, వైశాలీ, రుచిత్ ఆశా కమల్, సంజీవ్, లిస్సీ జోసెఫ్, శైలేంద్ర, సుబ్బలక్ష్మి, కొండల్రావు, సుధా గోపరాజు సహా ఎంజేఏ కార్యకర్తలు, బాధిత ప్రజలు పాల్గొన్నారు.
పౌర భాగస్వామ్య ప్రాథమిక సూత్రాల ఉల్లంఘన
ప్రభుత్వాలు ప్రాజెక్టులను ప్రజలు, బాధితుల భాగస్వామ్యంతో వారి పూర్తి సమ్మతితో చేపట్టాల్సి ఉంటుందని మూసీ జనాందోళన్ ప్రతినిధులు అన్నారు. కానీ మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో బాధితుల అభిప్రాయాలు తీసుకోకుండా, పౌర సంఘాల అభ్యంతరాలను పరిగణించడకుండా ప్రజాస్వామ్య నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మూసీ నదిలో ఉన్న కాలుష్యాన్ని నిర్మూలించేందుకు రూపకల్పన చేసిన ప్రాజెక్టులో రోడ్లు, భవనాలకే 61 శాతం బడ్జెట్ కేటాయించారని, దీన్ని బట్ట చూస్తే అది పూర్తిగా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం చేపట్టిన ప్రాజెక్టుగా స్పష్టమవుతున్నదని విమర్శించారు. ప్రజల నుంచి అధికారికంగా అభిప్రాయాలు తీసుకోకుండానే టెండర్లు పిలుస్తూ.. లక్ష మంది బాధితులతో పాటు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణకు అవలంభిస్తున్న మోడల్ పూర్తిగా ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజల అభిప్రాయాలు తీసుకుని, డీపీఆర్ పబ్లిక్ డొమైన్లో పెట్టకుంటే ఉద్యమం ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు.
మూసీ జన ఆందోళన్ ప్రధాన డిమాండ్లు
రివర్ బేసిన్ అథారిటీకి అనుకూలంగా కార్పొరేట్ ఎంఆర్డీసీఎల్ రద్దు చేయాలి. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఎన్నికైన పట్టణ స్థానిక సంస్థలు, నదీ తీర నివాసితులు, స్వతంత్ర శాస్త్రవేత్తలతో ప్రజాస్వామ్య, చట్టబద్ధమైన మూసీ రివర్ బేసిన్ అథారిటీని ఏర్పాటు చేయాలి.
పర్యావరణ పునఃపరిశీలన కోసం అన్ని బిడ్డింగ్ ప్రక్రియలను నిలిపేయాలి. మట్టి తవ్వకాలను నిలిపివేయాలి పర్యావరణ, కనీస నిర్వాసిత దృకోణంలో ప్రాజెక్టును పునఃపరిశీలించాలి.
జీవో 921ను ఉపసంహరించుకోవాలి. తప్పనిసరిగా సామాజిక ప్రభావ అంచనాలు, ప్రజాభిప్రాయ సేకరణలను పునరుద్ధరించాలి, 2013 భూసేకరణ చట్టాన్ని దాని అసలు రూపంలో పునరుద్ధరించడానికి 2017 సవరణను రద్దు చేయాలి.
పూర్తి సమగ్ర ప్రాజెక్టు నివేదిక, మెయిన్ హార్ట్ మాస్టర్ ప్లాన్, జలవిజ్ఞాన నమూనాలు, ధృవీకరించిన నదీ హద్దులను తెలుగు, ఉర్దూ ఆంగ్ల భాషలలో విడుదల చేయాలి. ప్రజల అభ్యంతరాలకు తప్పనిసరిగా 60 రోజుల గడువు ఇవ్వాలి.
పేద నదీ గర్భ నివాసితులను ఖాళీ చేయించడానికి బదులుగా, దిగువ రైతులను రక్షించడానికి పారిశ్రామిక, బల్ డ్రగ్ వ్యర్థాల కోసం ప్రత్యేక కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి.
గోప్యమెందుకు?
-రుచిత్, మూసీ జనాందోళన్ ప్రతినిధి
కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నది. 13వేల కుటుంబాల జీవితాలతో చెలగాటమాడుతున్నది. డీపీఆర్ బయటపెట్టకుండా మూసీ పరీవాహక భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు ధారదత్తం చేసేందుకు కుట్రలు చేస్తున్నది. ప్రాజెక్టు వ్యయంలో కేవలం రోడ్ల నిర్మాణానికే 61 శాతం నిధులను కేటాయించడం విడ్డూరంగా ఉంది. మూసీ ప్రాజెక్టు ప్రకటించిన రెండేండ్ల నుంచి ఇప్పటిదాకా ఒక అధికారిక డాక్యుమెంట్ కూడా బయటపెట్టలేదు. అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? డీపీఆర్ బయటపెడితే ప్రభుత్వం చేస్తున్న లూటీ బయటపడుతుందని భయమా? ఇప్పటికైనా డీపీఆర్ బయటపెట్టి ప్రజల అభ్యంతరాలకు సమయం ఇచ్చి ప్రాజెక్టు పనులు చేపట్టాలి.
డీపీఆర్ లేకుండా ప్రజాభిప్రాయ సేకరణేంటి?
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు డీపీఆర్ ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. ముందుగా ప్రాజెక్టులో ఏమేమి పనులు చేస్తారు? కాలుష్య నియంత్రణతో పాటు ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా చేస్తారా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలి. అంతేకానీ మూసీ ప్రాజెక్టులో ఏముందో తెలియకుండానే బాధితులను పిలిచి పరిహారం గురించి మాట్లాటం సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అకారణంగా తమ ఆస్తులు కోల్పోతామనే భయంలో వేలాది మంది బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. జీవిత కాలంలో సంపాదించి నిర్మించుకున్న ఇండ్లను కోల్పోతామనే ఆందోళనలో బతుకీడుస్తున్నారు. ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసిన తర్వాత మూసీ ప్రాజెక్టు నిర్మించాలి.
– వైశాలి, మధుపార్క్ రిడ్జ్ నివాసి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

