హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీ దివాలా తీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఎందుకంటే ప్రజా రవాణా సంస్థకు కేవలం మహాలక్ష్మి ఉచిత పథకం ద్వారా చెల్లించాల్సిన డబ్బులే దాదాపు రూ.3,785 కోట్లు వరకు ఉన్నాయని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు అప్పులు, రుణాలు, చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఎప్పటికప్పుడు మసిబూసి మారేడుకాయ చేస్తున్న ప్రభుత్వం.. అసెంబ్లీ సాక్షిగానైనా చెల్లించాల్సిన బకాయిల గుట్టు విప్పింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి కేవలం మహాలక్ష్మి ఉచితబస్సు ప్రయాణానికి సంబంధించిన బకాయిలే విడుదల చేస్తున్నది తప్పా.. ఆర్టీసీకి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు, రుణాల డబ్బులు ఇవ్వకపోవడంతో సంస్థ దివాళా తీసే స్థితికి వచ్చిందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.
అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన సమాధానంలో 2024 ఆర్థిక సంవత్సరం నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరం వరకు సుమారు రూ.1,834 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి ఉన్నదని తేల్చారు. అయితే, వీటికి 2023 డిసెంబర్ నుంచి అమలు చేసిన ఉచిత ప్రయాణం జీరో టికెట్ల డబ్బులు కలిపితే మొత్తం రూ.3,785 కోట్లకు పైగానే ఉంటుందని ఆర్టీసీ నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ నెల 17న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఈ ప్రయాణాలతో మన ఆడబిడ్డలకు రూ.12,385 కోట్ల మేర ఖర్చు ఆదా అయింది’ అని చెప్పారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణానికి కేవలం రూ.10,433.89 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించింది. అందులో కేవలం రూ.8,599.55 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించి చెల్లించాల్సినవే ఇంకా సుమారు రూ.3,785 కోట్లకు పైగానే ఉంటుందని స్పష్టంగా అర్థమవుతున్నది. ఆర్టీసీకి చెల్లించాల్సిన బాకీలపై మీడియా ప్రతినిధులు ఎప్పుడు ప్రశ్నించినా.. ఆర్టీసీ యాజమాన్యం, రవాణాశాఖ మంత్రి తప్పించుకునే ధోరణే ప్రదర్శిస్తున్నారు. అసెంబ్లీ పుణ్యమా అని ఆ లెక్కల బాగోతం బయటపడిందని కార్మికులు అంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో డాంబికాలకు పోతున్నదనడానికి ఇప్పటివరకు ఎగ్గొట్టిన డబ్బులే నిదర్శనం. ప్రభుత్వం కేటాయించిన డబ్బులు కూడా పూర్తిగా విడుదల చేయకపోవడంతో ప్రతినెలా ఆర్టీసీ ఉన్నతాధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం రూ.4,334.45 కోట్లు కేటాయిస్తే.. అందులో విడుదల చేసింది కేవలం రూ.3,866.30 కోట్లు. 2025-26 బడ్జెట్లో రూ.4,305.49 కోట్లు కేటాయిస్తే.. విడుదల చేసింది రూ.3,850.40 కోట్లు మాత్రమే. ఇక 2026-27(2026 ఆగస్టు 31 వరకు) కేటాయించిన బడ్జెట్ రూ.1,793.95 కోట్లు అయితే.. విడుదల చేసింది కేవలం రూ.882.80 కోట్లు మాత్రమే. ఇలా దాదాపు మూడేండ్లలో కేటాయించిన మొత్తం సైతం విడుదల చేయకపోవడంతో రూ.1,834.34 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.
బీఆర్ఎస్ హయాంలోనే ఆర్టీసీ అప్పుల ఊబి నుంచి తేరుకుని లాభాల బాట పట్టిందనడానికి మొన్నటి అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలే నిదర్శనం. 2016 నుంచి 2020 ఆర్థిక సంవత్సరం వరకూ కేసీఆర్ ప్రభుత్వం మొత్తం రూ.3,681.59 కోట్లను ఆయా బడ్జెట్లలో కేటాయిస్తే.. దాదాపు రూ.2,464.42 కోట్లు విడుదల చేసింది. అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన బాకీ రూ.1,217.17 కోట్లు. కాగా, 2020 కరోనా కాలంలో బస్సులు తిరుగకపోయినా, అంతకుముందు ఏడాది కార్మికులు సమ్మెలో ఉన్నా.. అప్పటికే ప్రభుత్వం దగ్గర ఆర్థిక వనరులు లేకపోయినా కూడా 2020-21 బడ్జెట్లో ఏకంగా రూ.1,000 కోట్లు కేటాయించి.. మొత్తం నిధులు విడుదల చేసింది.
ఆ మరుసటి ఏడాది అంటే 2021-22 బడ్జెట్లో కూడా ఆర్టీసీ చరిత్రలోనే అత్యధికంగా రూ.1,500 కోట్లు కేటాయించి ఆ మొత్తం విడుదల చేశారు. ఆ డబ్బులతో ఆర్టీసీకి ప్రభుత్వం పెండింగ్ పడిన రూ.1,217.17 కోట్లలో ముప్పావు వంతును కేసీఆర్ తీర్చేశారని ఆర్టీసీ వర్గాలు చెప్పాయి. 2016-17 నుంచి 2023-24 వరకు మొత్తం రూ.5,764 కోట్లను కేసీఆర్ ఇచ్చినట్టు చెప్తున్నారు. అప్పట్లో ఎలాంటి ఉచిత ప్రయాణం లేకపోయినా కూడా ఆర్టీసీకి కేసీఆర్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచిందని కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులను వృద్ధులు, దివ్యాంగులు, జర్నలిస్టు పాసుల రాయితీలకు, కార్మికులకు చెల్లించాల్సిన ఎరియర్స్‌కు, ఇతర రుణాలకు ఆర్టీసీ యాజమాన్యం వినియోగించిందని స్పష్టం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొనాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు కీలక పాత్ర పోషించాయని మంత్రి గుర్తుచేశారు. గుర్తింపు సంఘాల ఎన్నికల అనంతరం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై తదుపరి ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన గుర్తింపు సంఘం ప్రతినిధులను అధికారుల కమిటీలో భాగస్వాములను చేస్తామన్నారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడే విధంగా విలీనం ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రజా రవాణాను మరింత బలోపేతం చేయడంతోపాటు సేవలను ఆధునికీకరించడమే లక్ష్యంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆర్టీసీ రూ.9,315.07 కోట్లతో బడ్జెట్ అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. గత రెండు బడ్జెట్లలో ఒక్క రూపాయి కూడా కేటాయించని ప్రభుత్వం.. ఈసారైనా తాము అనుకున్న మొత్తం విడుదల చేస్తుందని అధికారులు భావించారు. అయితే, బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో ఆర్టీసీకి ఇచ్చే రుణాలు, అప్పులు, బస్సుల కొనుగోళ్లకు చెల్లించే డబ్బులపై చర్చించిన ప్రభుత్వ పెద్దలు.. ఆర్టీసీ ప్రతిపాదనలను మొత్తం చెత్తబుట్టలో పడేశారు. మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవుతున్న ఖర్చులు, విద్యార్థులు, ఇతర వర్గాలకు అందిస్తున్న బస్‌పాస్‌ల రాయితీలకు రూ.7,776.08 కోట్లు కావాలని ఆర్టీసీ కోరింది. దీంతోపాటు 666 కొత్త బస్సుల కొనుగోలుకు రూ.241.37 కోట్లు ఇవ్వాలని కోరింది. రుణాల చెల్లింపులకు రూ.855.01 కోట్లు, కొత్తగా బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణానికి మరో రూ.406.27 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. వీటన్నింటినీ గాలికి వదిలేసి, వారికి అవసరమైన మహాలక్ష్మి పథకానికి మాత్రమే రూ.4,305 కోట్లు కేటాయించారు.