మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘రేవంత్‌రెడ్డీ గుర్తుపెట్టుకో.. జూరాల ఆయకట్టు కింద ఒక్క ఎకరా ఎండినా మీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అవసరమనుకుంటే జూరాల నుంచి చివరి ఆయకట్టు వరకు ఉద్యమిస్తామని, రైతుల పక్షాన నిలబడుతామని తేల్చిచెప్పారు. నీళ్లు ఉన్నా, రైతుల కోసం వదిలిపెట్టాలనే సోయి ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరు రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ పాలమూరు బిడ్డ అని చెప్పుకొనే రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి నల్లమల పులి కాదని, చంద్రబాబు ముందు పిల్లి అని, అందుకే కృష్ణా జలాలను ఆంధ్రాకు వదిలి పెడుతున్నాడని మండిపడ్డారు.
శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, వెలిగొండకు బ్రహ్మాండంగా వందల టీఎంసీల నీళ్లను వదిలిపెడుతున్నాడు కానీ పాలమూరుకు మాత్రం నీళ్లు ఇవ్వడం లేదని విమర్శించారు. కరెంట్ కోసం ముఖ్యమంత్రి సొంత ఊరైన కొండారెడ్డిపల్లి రైతులు ధర్నా చేయడం రేవంత్‌రెడ్డికి సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు వచ్చింది అంటూ నిప్పులుచెరిగారు. ఈ సర్కార్‌కు యూరియా ఇచ్చే తెలివి లేదు.. రైతుబంధు చేసే తెలివి లేదు.. రుణమాఫీ చేసే తెలివి లేదు.. ఆఖరికి నీళ్లు ఇచ్చే తెలివి కూడా లేదని ఎద్దేవా చేశారు. ‘జూరాల, ఆల్మట్టి, నారాయణపూర్‌లో ఉన్నాయి.. కింద శ్రీశైలంలో ఉన్నాయి.. పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కూడా మీ పార్టీయే కదా!

రేవంత్‌రెడ్డీ.. నీకు చేతనైతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయ్.. లేదా మమ్మల్ని పంపు.. మా రైతులకు నీళ్లు విడుదల చేయండి అని అడుగుతాం’ అని చెప్పారు. తమకు రైతు ప్రయోజనం ముఖ్యమని, రాజకీయ ప్రయోజనం కాదని కేటీఆర్ స్పష్టంచేశారు. జూరాల ఆయకట్టు కింద ఉన్న వనపర్తి జిల్లాలో నీళ్లు సరిగ్గా రాక పంటలన్నీ ఆగమైపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. జూరాలలో మొత్తం కాలమయిన తర్వాత ఇప్పటివరకు కేవలం మొత్తం కలిపి 18 టీఎంసీల నీళ్లు మాత్రమే ఇచ్చారని ధ్వజమెత్తారు. తన గురువు చంద్రబాబు కోసం మాత్రం 100 టీఎంసీలు వదిలిపెడ్తున్నాడని విమర్శించారు. కల్వకుర్తి పంపులు కూడా సరిగ్గా ఆన్ చేయలేదని మండిపడ్డారు. ఐదు పంపులు ఉంటే ఎన్నడూ ఏ ఒక్క రోజు కూడా 3 పంపులు కూడా సరిగ్గా నడుపలేదని ధ్వజమెత్తారు. ఇక కల్వకుర్తి కింద పది టీఎంసీలకు మించి నీళ్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. జూరాలలో నీళ్లు ఉన్నా పైనుంచి ఇన్‌ఫ్లో లేక నీళ్లు వదలడం లేదని సీఈ చెప్పారని కేటీఆర్ తెలిపారు.
తొక్కుకుంటూ వచ్చిన, పండబెట్టి తొక్కుతా అని ఎప్పుడూ డైలాగ్‌లు కొట్టే ముఖ్యమంత్రి, నిజంగానే పాలమూరులో వ్యవసాయాన్ని పండబెట్టిండు.. ఇక్కడి రైతులను తొక్కుతున్నడు. నీళ్లివ్వకుండా వారి బతుకులను ఆగం చేస్తున్నడు. కానీ మేము వదిలిపెట్టం.. గీ డ్రామాలతోటి తప్పించుకుంటావని అనుకుంటున్నావేమో.. రైతులను గోసపెట్టే సర్కార్ తాటతీస్తం.
– కేటీఆర్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ 90శాతం నిర్మిస్తే.. దాన్ని ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతున్నది. మరో 400 మీటర్ల కాలువ తవ్వితే కొడంగల్ దాకా నీళ్లు పోతయ్. కానీ సీఎం రేవంత్‌రెడ్డికి అది ఇష్టం లేదు. ఒకవేళ పూర్తి చేస్తే కేసీఆర్‌కు ఎక్కడ పేరొస్తదోనని.. నీళ్లు రానీయ అని పట్టుబడుతున్నడు. ఆంధ్రాకు మాత్రం కృష్ణా నీళ్లను వదిలిపెడ్తున్నడు.
– కేటీఆర్

కాంగ్రెస్ పాలనలో కరెంట్ 6గంటలు కూడా సరిగ్గా రావడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. కరెంట్ ఎలా వస్తుందోనని వనపర్తి జిల్లా గుమ్మడం సబ్‌స్టేషన్‌కు వెళ్తే 12గంటలు ఇస్తున్నామని అక్కడి ఏఈ తెలిపారని, కానీ నిజానికి 5-6 గంటలకు కంటే ఎక్కువ ఇవ్వడం లేదని రైతులు చెప్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి హయాంలో కరెంట్ సక్కగ వస్తున్నదా? అని రైతులను ప్రశ్నించగా, లేదు.. లేదు అంటూ వారు బదులిచ్చారు. మరి కేసీఆర్ పాలనలో ఎలా ఉండేదని అడుగగా రోడ్‌షోకు వచ్చిన ప్రజలంతా చేతులెత్తి మంచిగ వచ్చేదంటూ సంఘీభావం తెలిపారు. సబ్‌స్టేషన్ లాగ్ బుక్‌ను పరిశీలిస్తే 10-15 సార్లు కరెంటు వచ్చి పోతున్నట్టు రికార్డు ఉన్నదని కేటీఆర్ తెలిపారు. వారం రోజుల లెక్కలను చూస్తే ఒక్కో రోజు 12 సార్లు కరెంటు పోతున్నదని తెలిసిందని చెప్పారు. వెనుకటి రోజులు మళ్లీ తెస్తా అని రేవంత్‌రెడ్డి చెప్పినట్టే కరెంట్ కష్టాలు తెచ్చారని ఎద్దేవా చేశారు.
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి ఇటీవల మృతిచెందగా, మాజీ మంత్రులతో కలిసి సింగోటంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. అనంతరం ఆయన తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
దేవుడు నీళ్లిచ్చిండు.. బొగ్గు ఇచ్చిండు.. దేవుడు బ్రహ్మాండంగా అన్నీ ఇచ్చిండు.. కేసీఆర్ ఉన్నప్పుడు సబ్స్టేషన్లు కట్టిండు.. నిరంతరాయంగా 24గంటల కరెంటు ఇచ్చిండు. దురదృష్టం ఏమిటంటే దేవుడు అన్నీ ఇచ్చినా కూడా పూజారి ఇవ్వడన్నట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీల కూసున్నోళ్లకు సోయి లేక, కరెంటు ఇచ్చే తెలివి లేక రైతులకు అవస్థలు పెడుతున్నడు.
– కేటీఆర్
పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో 33 కేవీ సబ్‌స్టేషన్‌ను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ఎన్ని గంటలకు కరెంటు వస్తున్నదని అక్కడున్న సిబ్బందిని ఆరా చేశారు. 12గంటలు ఇస్తున్నామని వారు చెప్పడంతో అక్కడే ఉన్న రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఐదారు గంటలకు మించి కరెంటు ఇస్తలేరని, పంటలు మడులు కూడా పారడం లేదని వారు ఆవేదన చెందారు. దీంతో కేటీఆర్ వెంటనే ఏఈని పిలిపించి లాగ్ బుక్కులను పరిశీలించారు.
అందులో రోజుకు 10-12 సార్లు కరెంటు కోతలు విధిస్తున్నట్టు ఉండటంతో నిలదీశారు. పైనుంచి కరెంట్ రాకపోతే తామెక్కడ నుంచి ఇస్తాం సార్ అంటే సిబ్బంది దాటవేశారు. అనంతరం పెబ్బేరు సబ్‌స్టేషన్‌ను కూడా పరిశీలించి కరెంటు సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఉండడాన్ని గుర్తించి కేటీఆర్.. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు.