అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ‘ఏఏ 22’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే డబ్బుశైతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమా అప్డేట్స్ గురించి బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ మొదలుపెట్టి దాదాపు ఏడాది అయినా ఇప్పటివరకు ఈ సినిమా తాలూకు బిగ్ అప్డేట్స్ వెలువడలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్‌ను అల్లు అర్జున్ జన్మదినమైన ఏప్రిల్ 8న రివీల్ చేయబోతున్నారట. టైటిల్‌తో పాటు ఫస్ట్‌గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేస్తారని తెలిసింది.
హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్ హంగులతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజువల్స్ అబ్బురపరిచేలా ఉంటాయని చెబుతున్నారు. అల్లు అర్జున్ ద్విపాత్రాభినయంతో కనిపిస్తారని, రెండు విభిన్న పాత్రల్లో ఆయన లుక్స్ హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర సన్నిహిత వర్గాలంటున్నాయి. రెండు సమాంతర ప్రపంచాల నడుమ నడిచే సైన్స్ ఫిక్షన్ కథాంశమిదని సమాచారం. అక్టోబర్ లేదా డిసెంబర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని తెలిసింది. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది.