KCR | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): గండాల సుడిగుండాల నుంచి తెలంగాణను అవలీలగా దాటించిన నేర్పరి.. చిక్కుముడులను తెంపిన తీర్పరి.. మాటలను దట్టించే మందుగుండు. తెలంగాణను చక్కదిద్దిన నైపుణ్యశీలి. ఆయన మరెవరో కాదు.. తెలంగాణ స్వప్నికుడు.. సాధకుడు కేసీఆర్. కాలు బయటపెట్టిన రెండు రోజులకే తెలంగాణ తిరిగి ఉద్యమ కేసీఆర్‌ను కండ్లా రా చూస్తున్నది. తెగుడుతున్న నాల్కలకు ఆయన మాటలు విచ్చుకత్తులవుతున్నయ్. కేసీఆర్ మాటల తూటాలకు ప్రత్యర్థుల్లో వణుకు మొదలైతే, తెలంగాణ మళ్లీ మునుపటి కేసీఆర్‌ను దగ్గర్నుంచి చూస్తున్నది. కేసీఆర్ బస్సుయాత్ర మరో చరిత్రకు సాక్షీభూతం కానున్నది.
బస్సుయాత్రతో రెండు రోజుల్లో మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరిలో ప్రసంగిన కేసీఆర్ తనలో ఉద్యమం నాటి వాడివేడి ఇంకా మిగిలే ఉందని, తాను రంగంలోకి దిగితే విరుచుకుపడుతున్న విపక్షాలు ముడుచుకోవలసిందేనని నిరూపించారు. ఉద్యమనేతగా కేసీఆర్ 2003 ఆగస్టు 25 నుంచి ఆగస్టు 30 వరకు కోదాడ నుంచి హాలియా వరకు చేపట్టిన పాదయాత్రను తాజా బస్సుయాత్ర గుర్తుకు తెచ్చింది. నాడు పిడికిలెత్తి తమ వెంట నడిచిన కేసీఆర్‌కు రైతులు జేజేలు పలుకుతున్నరు. కేసీఆర్ పాలనను గుర్తుకు తెచ్చుకుని సంబరపడుతున్నరు. పదేండ్లలో రెండేసి పంటలు ఎలా పడించుకోగలిగామో, ఇప్పుడు తొలిపంటకే ఎలాంటి కష్టాలు పడుతున్నామో గుర్తుచేసుకుని ఆవేదన చెందుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం కేసీఆర్ పాదయాత్ర చేసిన తర్వాత తమ బతుకులు బాగుపడ్డట్టుగానే.. కళతప్పిన తమ బతుకులు ఇప్పుడు మళ్లీ కేసీఆర్ బస్సు యాత్రతో గాడినపడతాయని ఆశగా ఉన్నారు.
బుధవారం హైదరాబాద్ నుంచి బయల్దేరిన కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించింది మొదలు రైతులతో మాట్లాడేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అన్నేపర్తి, అర్జాలబావి, మిర్యాలగూడ, తిప్పర్తి, సూర్యాపేట, తిరుమలగిరి, అర్వపల్లి, భువనగిరి ఇలా ఎక్కడికి వెళ్లినా రైతుల ఎజెండాగానే మాట్లాడారు. రైతులను దగ్గరకు పిలిపించుకొని మాట్లాడారు. ప్రభుత్వ పనితీరు, అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరాతీశారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నేతలు, కార్యకర్తలతో మాట్లాడి స్థానిక పరిస్థితులు తెలుసుకున్నారు. బుధవారం రాత్రి సూర్యాపేట చేరుకున్న కేసీఆర్ అక్కడ మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నివాసంలో బసచేసిన కేసీఆర్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, భగత్, రవీంద్రనాయక్, నల్లమోతు భాస్కర్‌రావు తదితరులతో సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు.
భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ , జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులతో రోడ్ షో ఏర్పాట్ల గురించి చర్చించారు. అనంతరం సూర్యాపేట జిల్లాకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో ముచ్చటించారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. ఆ తరువాత జనగామ జిల్లా మీదుగా భువనగిరికి పయనమయ్యారు. పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పులలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. కేసీఆర్‌కు అపూర్వ స్వాగత ఏర్పాట్లు చేశారు. జనగామ పొలిమేరలో కేసీఆర్‌కు స్వాగతం పలికిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆయనతో కలిసి బస్సుయాత్రలో పాల్గొన్నారు. హైదరాబాద్-వరంగల్ హైవేపై ఉన్న వివేరా హోటల్లో చాయ్ తాగారు. ఆ తర్వాత పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశం, పైలా శేఖర్‌రెడ్డితో కలిసి భువనగరి రోడ్‌షోలో పాల్గొన్నారు. తొలిరోజు కాంగ్రెస్, బీజేపీని సున్నితంగా హెచ్చరించి వదిలిపెట్టిన కేసీఆర్.. రెండోరోజు విరుచుకుపడ్డారు.
కేసీఆర్ బస్సుయాత్ర సందర్భంగా రోడ్లపై ఎక్కడ చూసినా రైతులే. తమ మొర ఆలకించాలంటూ కేసీఆర్‌ను కలిసి తమ కష్టాలు వెళ్లబోసుకోవడం రాష్ట్రం పరిస్థితికి అద్దం పడుతున్నది. కల్లాల వద్ద ధాన్యం కుప్పలను చూపించి కొందరు, రైతుబంధు రాలేదని మరికొందరు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాల్వల్లో నీళ్లు మాయమయ్యాయని కొందరు.. కొన్న పంటకు డబ్బులు ఇవ్వడం లేదని ఇంకొందరు తమ కష్టాలను కన్నీళ్ల రూపంలో బయటపెట్టారు.