చౌటుప్పల్, మార్చి 16 : చౌటుప్పల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆస్పత్రిలోని గైనిక్ వార్డు, ఎన్ఐసీయూ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. సహజ ప్రసవాల గురించి, మాతా శిశు మరణాలు ఏమైనా చోటుచేసుకున్నాయా? అవసరమైన ఔషధాలు అన్ని అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని, సమయ పాలన పాటించాలని వైద్య సిబ్బందికి ఆయన సూచించారు.