వరంగల్/నర్సంపేట/నల్లబెల్లి, జూలై31 : తెలంగాణ ఉద్యమ కెరటం, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం తెల్లవారుజామున కన్నుమూయగా, ఆయనకు పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. తెలంగాణ మలి దశ ఉద్యమనేతగా పరిచయమున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇక లేరన్న విషయం తెలుసుకుని ఓరుగల్లు శోకసంద్రంలో మునిగింది. హైదరాబాద్ నుంచి ప్రారంభమైన పెద్ది అంతిమ యాత్ర వరంగల్, దుగ్గొండి, నర్సంపేట మీదుగా స్వగ్రామమైన నల్లబెల్లి వరకు కొనసాగింది. ఆయన కడసారి చూపు కోసం అశేష జనవాహిని తరలివచ్చింది. దాదాపు 50వేలకు పైగా పార్టీల కతీతంగా ప్రజ లు తరలివచ్చి నివాళులర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వేలాదిగా కార్యకర్తలు భావోద్వేగానికి లోనయ్యారు. దారి పొడవునా తమ అభిమాన నాయకుడిని చూసేందుకు నిరీక్షించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పెద్దికి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించింది.
పెద్ది అంతిమ యాత్రకు బీఆర్ఎస్ పార్టీ అంతా కదిలి వచ్చింది. ఆయనకు గుండెపోటు వచ్చినప్పటి నుంచి పార్టీ అంతా ఆయన వెన్నంటే ఉంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్, హరీశ్‌రావులు హుటాహుటిన హనుమకొండ కు వచ్చి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. పార్టీ అధినేత కేసీఆర్ రెండు సార్లు యశోద అసుపత్రికి వచ్చి పెద్ది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకు న్నారు. విదేశాల్లోని ప్రముఖ డాక్టర్లతో మాట్లాడారు. ఎట్లాయినా మా పెద్దిని బతి కించండి అంటూ డాక్టర్లను వేడుకున్నారు. ఐదు రోజుల పాటు కేటీఆర్, హరీశ్‌రా వు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఆస్పత్రి వద్ద ఉంటూ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఒక నాయకుడి ప్రాణం కాపాడేందు కు ఐదు రోజుల పాటు ఒక రాజకీయ పార్టీ అంతా కదిలిరావడం రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మొదటి సారిగా చెప్పుకుంటున్నారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి అంతమ యాత్ర దారి పొడడువునా జనసంద్రంగా మారింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన పెద్ది పార్థివదేహం ఉమ్మడి జిల్లా సరిహద్దులోకి రాగానే ఎక్కడి అక్కడ అభిమానులు అంబులెన్స్‌లు ఆపి నివాళులర్పించారు. హ నుమకొండ అమరవీరుల స్తూపం వద్ద పెద్దికి పెద్ద ఎత్తున ఉద్యమకారులు, బీఆర్ ఎస్ శ్రేణులు శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడి నుంచి ఆయన స్వగ్రామం నల్లబెల్లికి వెళ్లే క్రమంలో గిర్నిబావి నుంచి వేలాది మంది ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, అభిమానులతో అంతిమ యాత్ర మొదలైంది. అక్కడి నుంచి నర్సంపేట మీదుగా నల్లబెల్లి వరకు సాగిన అంతిమయాత్ర ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపో యింది.
బీఆర్ఎస్ నాయకత్వంతో పాటు నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి పల్లె, ప్రతి తండా అంతిమ యాత్రతో కదిలింది. దీంతో నర్సంపేట-వరంగల్, నర్సంపేట-మల్లంపల్లి ప్రధాన రహదారుల్లో సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించగా పోలీసులు క్లియర్ చేశారు. పెద్ది అంతిమ యాత్రలో మంత్రి సీతక్క, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు పల్లా రా జేశ్వర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ సబితా ఇం ద్రారెడ్డి, మాజీ మంత్రులు సత్యవతి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రా రెడ్డి, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, బాల్క సుమన్, దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

నర్సంపేట పట్టణం సర్వాపురం శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెట్టాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కొద్దిసేపే నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై బైఠాయించి నినదించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సుదర్శన్‌రెడ్డి పాడె మోశారు. కడసారి ఆయనను చూసేందుకు వచ్చిన వారు భావోద్వేగానికి గురయ్యారు. అత్మీయ మిత్రుడి అంతిమయాత్ర కడవరకు వారు నడిచారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. ఉద్యమకాలం నాడు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను తలుచుకుని హరీశ్‌రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టారు.
హనుమకొండ చౌరస్తా : తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రాణాలకు తెగించి పోరాడారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 12.51 నిమిషాలు, ఆరు రోజులు డాక్టర్లు ఎంతో కృషి చేశారు. పెద్ది బతకాలని ప్రజలందరూ దేవుళ్లకు పూజలు చేశారు. ప్రతిఒక్కరూ బాధపడ్డారు. ఆయన కుటుంబం ధైర్యంగా ఉండాలి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు చాలా బాధపడుతున్నారు. పార్టీ పరంగా అన్ని విధాలా ఆదుకుంటాం.
– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
సుబేదారి : గొప్ప ప్రజానాయకుడు. ఉద్యమకారుడిని కోల్పోయాం. కేసీఆర్ నేతృత్వంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి 2001లో టీఆర్ఎస్లో చేరి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. ఆయన చురుకైన పాత్రను గుర్తించిన పార్టీ అధినేత ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలను నిర్వ హించిన ఘనత ఆయనకే దక్కింది. 2009 అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించి, మళ్లీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పెద్దఎత్తున మిలిటెంట్ ఉద్యమాన్ని నిర్వహించారు. 2018లో నర్సంపేట ఎమ్మెల్యేగా గెలు పొంది, దేవాదుల నీళ్లను పాకాల, రామప్ప చెరువులను నింపడం ద్వారా వేలాది ఎకరాల భూములను సాగులోకి తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించారు. నర్సంపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసేలా కృషి చేశారు. ప్రతి రోజు కనీసం 200 కీలోమీటర్ల దూరం ప్రయా ణించే శక్తి ఉన్న గొప్ప నాయకుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం.
– మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎంపీ
హనుమకొండ చౌరస్తా : పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. తెలంగాణ రాష్ట్రం గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఆయన మరణం తీవ్రంగా కలిచివేసింది. కేసీఆర్‌కు పెద్ద కొడుకు, కుడి భుజం లాంటివాడు. ఆయన పెళ్లి కూడా కేసీఆర్-శోభ దగ్గరుండి చేశారు. ఆయన జీవితాంతం ప్రజల కోసమే పోరాడారు. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. పెద్ది కుటుంబానికి శాంతి చేకూర్చాలి. భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలి.
– మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
హనుమకొండ చౌరస్తా : తెలంగాణ రాష్ట్రసాధనలో పెద్ది సుదర్శన్‌రెడ్డి మొదటి నుంచి వరంగల్ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచారు. కేసీఆర్‌కు అత్యంత విశ్వసనీయుడిగా, అనేక కీలక ఘట్టాలు పూర్తిచేశాడు. నిత్యం జనజీవితంలో ఉన్న మనిషి. తెలంగాణలోని పార్టీ శ్రేణులు, ఉద్యమనాయకులు, విద్యార్థి నాయకులు, అన్ని వర్గాల ప్రజలతో పెద్దికి అనుబంధం ఉంది.
– ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు
జనగామ, జూలై 31 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి బాధాకరం. పెద్దితో నాకు ఎంతో సన్నిహిత అనుబంధం ఉంది. ఎన్నో సందర్భాల్లో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిషారంపై కలిసి పని చేసిన జ్ఞాపకాలను ఎప్పటికీ మరువలేను. సుదర్శన్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచి చివరి వరకు క్రియాశీలకంగా పనిచేసిన నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు. ప్రజా ప్రతినిధిగా, పార్టీ నాయకుడిగా, ఉద్యమకారుడిగా ప్రతి బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తూ వేలాది మంది కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమానికి, నర్సంపేట ప్రాంత ప్రజలకు తీరని లోటు. భగవంతుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలి.
– జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
సుబేదారి, జూలై31: తెలంగాణ ఉద్యమ సహచరుడు, సోదరుడు, అత్యంత ఆప్తుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇక లేరనే వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. పెద్ది అన్న జీవితమే ఒక పోరాటం. ఉద్యమ దశ నుంచి నేటి వరకు తనను నమ్ముకున్న ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నాడు. ప్రజల మధ్యే జీవించి, ప్రజల కోసమే శ్రమించిన ఆయన సేవలు ఎప్పటికీ మరువలేనవి. ఆయన ఆశయాలు, ప్రజా సేవపై చూపిన నిబద్ధత ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి. కుటుంబ సభ్యులు, అభిమానులకు ఈ తీరని లోటును భరించే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా.
– పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్‌లీడర్
పెద్ది సుదర్శన్‌రెడ్డి అకాల మరణం చాలా బాధాకరం. ఉద్యమ సహచరుడు, సోదరుడిని కోల్పోవడం తీరని లోటు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోట్లాడిన నిజమైన నికార్సయిన ఉద్యకారుడిని కోల్పోవడం దురదృష్టకరం. నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, పెద్ది కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుంది.
– దాస్యం వినయభాస్కర్ మాజీ ప్రభుత్వ చీఫ్ విప్
హనుమకొండ చౌరస్తా, జూలై 31: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణవార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. తెలంగాణ సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి, నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
– పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
జయశంకర్ భూపాలపల్లి, జూలై 31 (నమస్తే తెలంగాణ) :సుదర్శన్‌రెడ్డి మరణం ఎంతగానో కలిచివేసింది. ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ కేసీఆర్ పిలుపు మేరకు ఉద్యమాన్ని తనదైన రీతిలో ముందుకు నడిపించిన గొప్ప నాయకుడు. ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృ ద్ధి చేశారు. పెద్ది లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఆయనను ఎంతో ప్రేమగా పెద్దన్నగా పిలుచుకునేవాళ్లం. ప్రజలే కోసమమే బతికి ఉద్యమం కోసం పోరాడిన యోధుడు. సుదర్శన్‌రెడ్డి మరణం మా అందరికీ తీరని లోటు.
– భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.

పెద్ది భార్య స్వప్నను ఓదార్చుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి, జగదీశ్‌రెడ్డి, గంగుల

నర్సంపేట అమరవీరుల జంక్షన్ వద్ద పెద్ది భౌతికకాయంపై పడి విలపిస్తున్న మహిళ

సుదర్శన్‌రెడ్డి చిత్రపటం వద్ద పూలు వేస్తున్న మంత్రి సీతక్క

పెద్ది భౌతికకాయంపై బీఆర్ఎస్ జెండా కప్పుతున్న మాజీ ఎమ్మెల్యేలు, దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్, శంకర్‌నాయక్

పెద్ది పాడె మోస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

పెద్ది భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న మండలి ప్రతిపక్ష నేత సిరికొండ