చుంచుపల్లి, సెప్టెంబర్ 16 : బతుకుతెరువు కోసం పెయింటింగ్ పనులు చేసుకుంటున్న ఓ యువకుడు భవనం పైనుండి జారిపడి మృతిచెందిన ఘటన కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో మంగళవారం విషాదం నింపింది. అన్నపురెడ్డిపల్లి మండలం గుంపేటకు చెందిన పెనుమల సతీష్ పెళ్లైన ఆరు నెలలకే మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సతీష్ తన భార్యతో కలిసి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ సమీపంలో అక్కా, బావల ఇంటి వద్ద ఉంటూ పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం విద్యానగర్ కాలనీలోని రాయల్ బిల్డింగ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో పెయింటింగ్ పనులు చేస్తుండగా, తాడు తెగిపోవడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలతో సతీష్ అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.
నిర్మాణ పనులు జరుగుతున్న భవనంలో కార్మికులకు కనీస భద్రతా పరికరాలు కల్పించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎత్తైన ప్రదేశాల్లో పనిచేసే కార్మికులకు సేఫ్టీ బెల్టులు, సేఫ్టీ నెట్లు, ఇతర రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచాల్సి ఉన్నప్పటికీ, కేవలం తాడుపైనే ఆధారపడి పనులు చేయించడం వల్లే ప్రమాదం జరిగిందని వారు పేర్కొంటున్నారు.
ప్రధాన రహదారి పక్కనే నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భవనానికి అనుమతులు ఉన్నాయా? నిర్మాణ నిబంధనలు పాటిస్తున్నారా? కార్మికుల భద్రతా ప్రమాణాలను అమలు చేస్తున్నారా? అనే అంశాలపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తనిఖీల్లో నిర్లక్ష్యం జరిగిందా, నిర్మాణానికి సంబంధించిన అనుమతులు సక్రమంగా ఉన్నాయా అనే విషయాలను అధికారులు స్పష్టం చేయాలని కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల ఉల్లంఘన కారణంగానే సతీష్ మృతిచెందాడనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.