కామారెడ్డి, జూలై 31 : ఆన్లైన్ గేమింగ్ పేరుతో మోసం చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వాట్సాప్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ లింకులు పంపిస్తూ, పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని రామారెడ్డి పోలీసు స్టేషన్లో కేసు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో రామారెడ్డికి చెందిన భూక్యా నవీన్, భూక్యా ప్రవీణ్‌ను నిందితులుగా గుర్తించారు. వారు విశాఖపట్నం వెళ్లడానికి కామారెడ్డి బస్టాండ్ వద్ద ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు, 15 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన భూక్యా నవీన్ విదేశాల్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో ఫ్యూచర్9.కం అనే ఆన్లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌కు సంబంధించిన వివరాలు మొబైల్ నంబర్ల డేటాను సేకరించాడు. స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం భూక్యా ప్రవీణ్‌తో కలిసి వాట్సాప్ ద్వారా పలువురికి ఆన్లైన్ గేమింగ్ లింకులు పంపించి, పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించి ఆన్లైన్ మోసాలకు పాల్పడ్డారు. బాధితులకు యూజర్ ఐడీలు సృష్టించి వెబ్సైట్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేవారు. వెబ్సైట్లో నేరుగా చెల్లింపులు జరగని సందర్భాల్లో తమ యూపీఐ ద్వారా నగదు స్వీకరించి సంబంధిత వెబ్సైట్లో జమ చేసేవారు.
ఇందుకు ప్రతిఫలంగా వారికి 5 శాతం కమిషన్ అందేది. ఈ వెబ్సైట్ ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది బాధితులు మోసపోయినట్లు పోలీసులు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందుతుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. డీఎస్పీ మధుసూదన్, కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్‌గౌడ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రామన్, రామారెడ్డి ఎస్సై మురళి, సైబర్ క్రైం ఎస్సై నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.