బడంగ్పేట్, సెప్టెంబర్30: త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధ్దం కావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని జిల్లెలగూడ సామయాదిరెడ్డి గార్డెన్లో రంగారెడ్డి,హైదరాబాద్, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు ఎలా నమోదు చేయించాలన్న అంశంపై మహేశ్వరం నియోజకవర్గం శ్రేణులతో సమావేశం నిర్వహించారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరిని కలిసి ఓటు నమోదు చేయించాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.
గతంలో అందరి కృషితో ఎమ్మెల్సీగా వాణీదేవిని గెలిపించుకున్న విధంగానే మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అభ్యర్థి ఎవరైనా సరే కేసీఆర్ బలపర్చిన వ్యక్తిని గెలిపించుకోవాలన్నారు. ఈ ఎన్నికలను నేతలు సవాల్‌గా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య జఠిలంగా ఉందన్నారు. ఇటీవల పోలీసు ఉద్యోగాలు వేస్తే రంగారెడ్డి, హైదరాబాద్‌కు ఒక్క పోలీస్ ఉద్యోగం రాలేదన్నారు. వేతనాలు అందక చిరుఉద్యోగులు ధర్నా చేశారన్నారు.
బీజేపీ పార్టీలో ఉన్న లావణ్య లాంటి వారు కేసీఆర్ గురించి ఎంతో గొప్పగా చెప్పిందని ఆమె గుర్తు చేశారు. కేసీఆర్ చేసిన మంచి పనులు ప్రజల గుండెలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలు అవుతుందన్నారు. ఈ కార్య క్రమంలో బీఆర్ఎస్ నాయకులు అరవింద్ శర్మ, లక్ష్మీనర్సింహారెడ్డి, సూర్ణ గంటి అర్జున్, కామేష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మన్నె జయేందర్, నాగేష్, అంకి రెడ్డి, సునీతాబాల్ రాజ్, పెద్ద బావి ఆనంద్ రెడ్డి, సాదిక్, లోకసాని కొండల్ రెడ్డి,దీప్లాల్ చౌహన్, దిండు భూపేష్ గౌడ్, శ్రీను నాయక్, మర్రి నర్సింహరెడ్డి, జిల్లెల కృష్ణారెడి సల్మాన్ రాజ్, యాతం పవన్ కుమార్, ఏనుగు రాంరెడ్డి, ముత్యాల కృష్ణ, టి భాస్కర్ రెడ్డి, సిద్దాల బీరప్ప, కర్రొల చంద్రయ్య, అంబయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.