సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ) : పట్టభద్రుల పోరుకు గులాబీ దండు సిద్ధమవుతున్నది. గెలుపే లక్ష్యంగా వ్యూహాన్ని రచిస్తున్నది. ఇందులో భాగంగా బుధవారం నగరమంతా బీఆర్ఎస్ శ్రేణులు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఓటరు నమోదులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. గెలుపే లక్ష్యంగా పట్టభద్రులను సమాయత్తం చేయాలని కోరారు. సమావేశాలకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా హాజరు కావడం.. పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపింది.
గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మక మహబూబ్‌నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి సురభివాణిదేవి అద్భుత విజయం సాధించి శాసనమండలిలో గులాబీ జెండాను ఎగురవేసిన విషయం విదితమే. ఈసారి ఆ నాటి గెలుపు విజయాన్ని పునరావృతం చేయడమే కాకుండా, సురభివాణిదేవి సాధించిన మెజార్టీ కంటే మరింత భారీ మెజార్టీతో విజయం సాధించడమే బీఆర్ఎస్ ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది.

కాంగ్రెస్ సరార్ వైఫల్యాలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో నిరసనలపై యువతలో ఉన్న తీవ్ర వ్యతిరేకతను, అసంతృప్తిని ప్రజల్లోకి తీసుకెళ్తూ, గులాబీ దళం క్షేత్రస్థాయిలో దూసుకుపోతోంది. పట్టభద్రుల మద్దతు పూర్తిస్థాయిలో బీఆర్ఎస్కే ఉందనే ధీమాతో గులాబీ శ్రేణులు ఎన్నికల కదనరంగంలోకి దిగారు..ఫస్ట్ కం ఫస్ట్ ప్రాదిపదికన ఓటరు నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో కేడర్‌ను దిశానిర్ధేశం చేస్తున్నారు.
ఈ మేరకు బుధవారం గ్రేటర్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. బేగంపేటలోని జోరాస్ట్రీయన్ క్లబ్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొని ఓటరు నమోదు ప్రక్రియపై శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జిల్లెలగూడ సామ యాదిరెడ్డి గార్డెన్లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, అంబర్‌పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తదితర నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు నేరుగా రంగంలోకి దిగారు. ప్రతి నియోజకవర్గాన్ని జల్లెడ పడుతూ సన్నాహక సమావేశాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు సిద్ధ్దమయ్యారు. ఇప్పటికే అత్యధిక నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు విజయవంతంగా పూర్తయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నియోజకవర్గ స్థాయిలో కేడర్‌కు దిశానిర్దేశం చేస్తూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు ప్రక్రియే కీలకమని భావించి ఈ దిశగా ఓటర్ల నమోదుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఫస్ట్ కం-ఫస్ట్ ప్రాతిపదికన గ్రాడ్యుయేట్లతో సమన్వయం చేసుకుంటూ, డిగ్రీ పూర్తి చేసిన యువతను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించడంలో బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగార్థులు, నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయాన్ని ఓటర్లకు వివరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది. పాలనా లోపాలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైన తీరును ఎండగట్టాలన్నారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా సరే గులాబీ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగానే కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి పట్టభద్రుడి ఓటును నమోదు చేయించే బాధ్యతను కార్యకర్తలు తమ భుజాలపై వేసుకోవడం గమనార్హం.