Janhvi Kapoor | తిరుమలలో కేక్ కటింగ్ ఘటన చుట్టూ నెలకొన్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో సెలబ్రిటీలు అయినా, సాధారణ భక్తులు అయినా అందరూ ఒకే విధంగా నిబంధనలు పాటించాల్సిందేనని భక్తులు భావిస్తున్న నేపథ్యంలో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బిగ్‌బాస్ ఫేమ్ దివ్వెల మాధురి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఇటీవల తిరుమల కొండపై దివ్వెల మాధురి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ తనూజ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శ్రీవారి సన్నిధిలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పవిత్రతకు విరుద్ధమని భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై టీటీడీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ఈ వివాదంపై స్పందించిన మాధురి మొదట అది ఎగ్-లెస్ కేక్ అని, అక్కడ కేక్ కట్ చేయడం నిబంధనలకు విరుద్ధమని తమకు తెలియదని చెప్పారు. అయితే ఇటీవల ఉమెన్స్ డే సందర్భంగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధురి చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ పేరును ప్రస్తావిస్తూ, “గతంలో జాన్వీ కపూర్ కూడా తిరుమలలో కేక్ కట్ చేశారు. అప్పుడు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. ఇప్పుడు నేను చేస్తేనే ఎందుకు విమర్శలు వస్తున్నాయి?” అని ప్రశ్నించారు. అయితే మాధురి వ్యాఖ్యలను నెటిజన్లు వెంటనే ఖండించారు. జాన్వీ కపూర్ తిరుమలలో ఎప్పుడూ కేక్ కట్ చేయలేదని, అలాంటి సంఘటనకు ఎలాంటి ఆధారాలు లేవని సోషల్ మీడియాలో పలువురు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా మాధురి వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా జాన్వీ కపూర్ దృష్టికి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే జాన్వీ, తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించినట్లు ఒక ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్లో ప్రచారం కోసం కొందరు ఏమైనా మాట్లాడతారు. తిరుపతిలో నేను ఎలాంటి కేక్ కట్ చేయలేదు. మన సంస్కృతి, సంప్రదాయాలు, దేవాలయాల పట్ల గౌరవం ఉండాలి అని పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ ట్వీట్ జాన్వీ కపూర్ అధికారిక ఖాతా నుంచి కాకుండా ఒక ఫ్యాన్ పేజ్ నుంచి పోస్టు అయినట్లు వెల్లడైంది.. అయినప్పటికీ ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మాధురికి జాన్వీ కౌంటర్ ఇచ్చినట్లుగా ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు పవిత్ర క్షేత్రాల్లో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.