Abhijeet Dipke : సీజేపీ ఆధ్వర్యంలో జూలై 20న ఢిల్లీలో చేపట్టిన ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడికి కారకుడైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ పౌండర్ అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ఈ మేరకు మహారాష్ట్రలోని తన స్వస్థలమైన ఛత్రపతి శంభాజీ నగర్లో అభిజీత్ దీప్కే గురువారం మీడియాతో మాట్లాడారు. సీజేపీ ఆందోళన సమయంలో ఢిల్లీలో విధుల్లో ఉన్న పోలీసులు, కేంద్ర బలగాలకు అమిత్ షా నుంచే ఆదేశాలు వెళ్లాయని దీప్కే ఆరోపించారు. అందువల్ల అమిత్ షా తన హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు.
రాజకీయ పార్టీల్ని విచ్ఛిన్నం చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని వాడుతున్నారని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని దీప్కే వ్యాఖ్యానించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ఇప్పుడు ప్రతిపక్షాల బాధ్యత మాత్రమే కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘మన న్యాయవ్యవస్థపై ఒక అపవాదు ఉంది. శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి ఈడీ, సీబీఐ వంటి సంస్థలను కేంద్రం ఎలా వాడిందో చూశాం. ఇలాంటి వ్యవస్థలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పని చేయాలి కానీ, ఒక వ్యక్తి నియంత్రణలో కాదు. దీన్ని అడ్డుకోవడం ప్రతిపక్షాల బాధ్యతే కాదు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకురావాలి. సీజేపీ విదేశీ శక్తులు, బయటి వారి నుంచి నిధులు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మా ఉద్యమాన్ని బయటివాళ్లు నడిపిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ విషయంలో మంత్రిగా అమిత్ షా విఫలమైనట్లే. బయటివాళ్లు సీజేపీని నడిపిస్తే ఆయన ఏం చాణక్యుడు..?
జూలై 20న విద్యార్థులకు వ్యతిరేకంగా బలగాలను ప్రయోగించాలని ఆదేశించింది అమిత్ షానే. ఇంకెవరూ కాదు. దీనికి బాధ్యత వహిస్తూ అమిత్ షా తన పదవికి కచ్చితంగా రాజీనామా చేయాలి’’ అని అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రాళ్లు, ఆయుధాలతో ట్రక్కును సిద్ధం చేసుకున్నారు అంటూ జరిగిన ప్రచారంపై కూడా దీప్కే స్పందించారు. ఈ అంశంపై అక్కడి డీసీపీని కలిశానని, ఆ ట్రక్కు దగ్గర్లోని ఒక నిర్మాణంలో ఉన్న చోటు నుంచి వచ్చిందని, అందులో అక్కడి వ్యర్థాలు ఉన్నాయని వివరించినట్లు చెప్పారు. ఇదంతా బీజేపీ గూండాలు, పోలీసుల పనే అని దీప్కే ఆరోపించారు.