ఇంద్రవెల్లి : గురువులు( Teachers ) విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే శిల్పులని, వారి బోధనలు, ఆశీస్సులతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ విజయ ( Principal Vijaya ) అన్నారు. గురువారం ముత్నూర్లోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత గురువే విద్యార్థుల జీవితా నికి దిశానిర్దేశం చేసే వ్యక్తని పేర్కొన్నారు. గురువులు అందించే విజ్ఞానం, క్రమ శిక్షణ, నైతిక విలువలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి పునాదులుగా నిలుస్తాయని అన్నారు.
ప్రతి విద్యార్థిని గురువులను గౌరవిస్తూ వారి బోధనలను ఆచరణలో పెట్టి విద్యతో పాటు మంచి విలువలను కూడా అలవర్చుకోవాలని సూచించారు. గురుపౌర్ణమి వేడుకల్లో భాగంగా విద్యార్థినులు అధ్యాపకులు, ఉపాధ్యాయినులను శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు (మెమెంటోలు) అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు సంగీత, భార్గవి, అధ్యాపకులు, ఉపాధ్యాయినులు, విద్యార్థినులు పాల్గొన్నారు.