ఇస్లామాబాద్: బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను పాకిస్థాన్(Pakistan) 2-1 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. మీర్పూర్లో ఆదివారం జరిగిన మూడో వన్డేలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా సెంచరీ కొట్టినా.. ఆ మ్యాచ్‌లో పాక్ 11 రన్స్ తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు జట్టు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సెలెక్టర్‌గా పనిచేసిన కమ్రాన్ అక్మల్ పాక్ జట్టుపై విరుచుకుపడ్డారు. పాక్ పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, ఇప్పుడు పాక్‌తో ఆడేందుకు నెదర్లాండ్స్ కూడా ఆసక్తిగా ఉందని, మనల్ని ఓడించి ఆ జట్టు టెస్ట్ హోదా సంపాదిస్తుందని, పాక్ క్రికెట్ పరిస్థితి ఇంత దారుణంగా మారిందని అక్మల్ విమర్శించారు. మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఈజీగా 350 స్కోర్ చేసేదని, కానీ ఆ జట్టు కేవలం 290 మాత్రమే చేసిందని, లింటన్ దాస్ నెమ్మదిగా ఆడాడని, అయినా మనం మ్యాచ్ కోల్పోయామని విమర్శించారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోషిన్ నఖ్వీపై అక్మల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆసియాకప్‌లో ఇండియా గెలిచినా.. ఇంకా ఆ ట్రోఫీని భారత్‌కు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ ట్రోఫీ ప్రస్తుతం నఖ్వీ ఆఫీసులో ఉన్న విషయం తెలిసిందే. ప్రత్యర్థులను మ్యాచుల్లో ఓడించకుంటే, ఐసీసీ ట్రోఫీని ఇంటికి ఎత్తుకొస్తారా అని అక్మల్ పరోక్షంగా పాక్ బోర్డును విమర్శించారు. ఓ టీవీ చర్చలో పాల్గొన్న అక్మల్ తీవ్ర స్థాయిలో పాక్ బోర్డు తీరును ఖండించారు. ఫస్ట్ వన్డేలో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. రెండో వన్డేలో పాక్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది. ఇక కీలకమైన మూడో వన్డేలో 11 రన్స్ తేడాతో పాక్ ఓడింది.