MLA Malla Reddy | కేపీహెచ్‌బీ కాలనీ/ఎల్బీనగర్, ఏప్రిల్ 25 : నాడు నిండిన చెరువులు…పచ్చని చెట్లు.. పాడిపంటల్లో మాజీ సీఎం కేసీఆర్ కనిపించే వారని.. నేడు ఎండిన చెరువులు, కరువు కాటకాల్లో సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారని….కేసీఆర్ పాలన లేక రాష్ట్రం ఆగమైందని… కాంగ్రెస్ అంటేనే కరువు… కష్టాలని.. ఐదు నెలల పాలనతో ప్రజలకు అర్థమైందని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు.
గురువారం ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా మెట్రోలో ప్రయాణించి..ఎన్నికల ప్రచారం చేశారు. ఎల్బీనగర్ నుంచి కూకట్పల్లి వరకు ప్రయాణించిన వీరంతా.. ప్రయాణికులను ఆప్యాయంగా పలుకరిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నగరాభివృద్ధిని వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థించారు.
అనంతరం కూకట్పల్లి స్టేషన్లో వీరికి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చరిత్ర అని.. అన్ని రంగాల్లో రాష్ట్రం నంబర్ వన్‌గా అభివృద్ధి చెందిందని, పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందాయన్నారు.

రాష్ట్రంలోని గ్రామాల్లో క్రీడామైదానాలు, శ్మశానవాటికలు, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, రైతుబంధు, దళితబంధు, వృద్ధులకు పింఛన్లు అందాయని, చెరువులను అభివృద్ధి చేయగా.. నిండు కుండాల మారి.. చేపలు.. నీటితో కళకళలాడేవన్నారు. ప్రస్తుతం కేసీఆర్ పాలన లేక.. చెరువులన్నీ ఎండిపోయాయని, సునామీ కంటే ఘోరంగా పరిస్థితులన్నీ మారిపోయాయన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, హైదరాబాద్ విశ్వనగరంగా మారిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి.. అధికారంలోకి వచ్చిందని, గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రులకు పరిపాలన చేతగాక.. బీఆర్ఎస్ పార్టీపై తిట్లదండకం అందుకున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్నింటినీ అమలు చేస్తామని చెప్పడంతో ప్రజలు మోసపోయి ఓట్లేశారని, ప్రజలు అమాయకులు కారని, ఈ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పారు.
కాంగ్రెస్ అంటేనే మోసం అని… కాంగ్రెస్ అంటేనే కరెంట్, తాగునీటి కష్టాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ గోవిందా.. అని ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా.. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని, పేద ప్రజలకు బర్కత్ ఉండటం లేదని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులు లేక… కరీంనగర్, చేవెళ్ల నుంచి అభ్యర్థులను బరిలో దింపిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లోకల్ అని.. సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలందరి మధ్యలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 3.5 లక్షల మెజార్టీతో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, కేసీఆర్‌కు మల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని కానుకగా ఇస్తామన్నారు.
ప్రజలు నమ్మి ఎంపీగా రేవంత్‌రెడ్డిని గెలిపిస్తే మల్కాజిగిరికి చేసిందేమీ లేదని, ఒక్క రోజైనా.. ప్రజల కష్టాలు తెలుసుకోలేదని.. ఒక్కసారి కూడా ఇక్కడి ప్రజల కోసం మాట్లాడలేదని ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మళ్లీ పరాయి వ్యక్తులను తీసుకొచ్చాయని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, శిరీషాబాబురావు, సబీహాబేగం, పండాల సతీష్‌గౌడ్, ముద్దం నర్సింహాయాదవ్, అవుల రవీందర్‌రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, మహేశ్వరిశ్రీహరి తదితరులు పాల్గొన్నారు.