నిమ్మకాయలు గుండ్రంగానే ఎందుకుండాలి? పొడవుగానూ ఉండొచ్చుగా. పచ్చగానే ఎందుకు కాయాలి… రంగు రంగుల్లోనూ పండొచ్చుగా… అని ఎవరన్నా మాట్లాడితే ఎండకు పైత్యం చేసిందేమో అని అనుమానించక్కర్లేదు. ఎందుకంటే ఈ ఊహ.. ప్రకృతిలో నిజం కాబట్టి. అవునండీ దొండకాయల్లా కనిపిస్తున్న ఇవి నిజంగా నిమ్మకాయలే. ‘ఫింగర్ లైమ్’గా పిలిచే వీటిలోని ముత్యాలూ చిత్రంగానే ఉంటాయి.
Lemon | నెలతప్పిన వాళ్లే పులుపు తినాలన్న నియమం ఓ రెండు నెలల్లో మాత్రం వర్తించదు. ఎండ మండి పోతుంటే మామిడి, నిమ్మలు లింగభేదం లేకుండా అందరికీ చేరువవుతాయి మరి! షర్బత్‌లు తాగడానికీ ఇప్పుడెవరికీ షరతులు వర్తించవు. అసలు ఏ పండూ నచ్చని వారికి కూడా ఈ సమయంలో నిమ్మపండు అమ్మంత దగ్గరైపోతుంది. పులుపు మీద మనసుకు తీపి పుట్టించే కాలం మహిమ అది. ఇలా… మనకెంతో దగ్గరైన నిమ్మపండుకూ మనకు పెద్దగా పరిచయం లేని చుట్టాలున్నారు. రూపురేఖల్లో మన నిమ్మకాయతో పోలిక లేకపోయినా రుచి, పోషకాల్లో ఇది ఓ మెట్టు పైనే!
చేతి వేలులాగా పొడవుగా ఉంటుంది కాబట్టి దీనికి ‘ఫింగర్ లైమ్’ అనే పేరు వచ్చింది. అలాగే ఇందులోని ముత్యాలు గుండ్రంగా… ప్రపంచంలోనే అతి ఖరీదైన ఆహారంగా పేరు పొందిన కేవియర్ చేప గుడ్లను పోలి ఉంటాయి. కాబట్టి ‘కేవియర్ లైమ్’ అని కూడా పిలుస్తారు. ‘చిల్లీ లైమ్’ పేరిట భారత్‌లోని నర్సరీల్లోనూ అమ్ముతున్నారు. సిట్రస్ ఆస్ట్రలేసికా… దీని శాస్త్రీయనామం. ఆస్ట్రేలియా ఖండం మూలాలున్న ఇది అమెరికా, ఆసియా దేశాల్లోనూ పెరుగుతుంది. పూత, ఆకు రెండూ నిమ్మచెట్టును పోలి ఉంటాయి. పులుపు రుచితో పాటు రోజ్మేరీ, పుదీనా ఫ్లేవర్ ఇందులో ఉంటుంది. ఒక రకమైన సువాసన దీని సొంతం. ఆకుపచ్చ, పసుపు, గులాబీ, మెరూన్, ఊదా, బ్రౌన్… తదితర రంగుల్లో ఇది కాస్తుంది. కమలా పండుతో పోలిస్తే ఇందులో విటమిన్-సి మూడు రెట్లు అధికంగా ఉంటుంది.
విటమిన్-ఎ, ఇలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఐరన్, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ పండులో లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచేందుకు, రక్తవృద్ధికీ, వార్ధక్యాన్ని వాయిదా వేసేందుకు, చర్మ నిగారింపునకు ఫింగర్ లైమ్ ఎంతగానో ఉపకరిస్తుంది. షర్బత్‌ల తయారీకి దీన్ని వాడతారు. ఇక, ఈ రకం నిమ్మ లోపల ఉండే ముత్యాలు తెలుపుతోపాటు నిండు, లేత గులాబీ రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే, డెజర్ట్‌లు, వంటకాలు, సాస్‌లు, జామ్‌లతో పాటు కాక్టైల్స్, మాక్టైల్స్లాంటి వివిధ పానీయాల అలంకరణకు వాడతారు. రుచితో పాటు అందాన్నీ అందిపుచ్చుకున్న ఈ నిమ్మను చూస్తే నోరూరుతున్నది కదూ!