పట్టు.. విడుపు!
పచ్చటి పచ్చిక పరిచినట్టున్న బేసిన్ రిజర్వ్ పిచ్‌పై భారత పేస్ లీడర్ జస్ప్రీత్ బుమ్రా (3/52) నిప్పులు చెరిగే బంతులు విసురుతుంటే న్యూజిలాండ్ టాపార్డర్ వణికింది. 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కళ్లెదుటే ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ కుప్పకూలుతోంది.
- బుమ్రా మెరిసినా.. మిగతా పేసర్ల నిరాశ
- తొలి రోజు న్యూజిలాండ్ 243/5
- నికోల్స్ సెంచరీ.. ఫిలిప్స్ జోరు
వెల్లింగ్టన్: పచ్చటి పచ్చిక పరిచినట్టున్న బేసిన్ రిజర్వ్ పిచ్‌పై భారత పేస్ లీడర్ జస్ప్రీత్ బుమ్రా (3/52) నిప్పులు చెరిగే బంతులు విసురుతుంటే న్యూజిలాండ్ టాపార్డర్ వణికింది. 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కళ్లెదుటే ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ కుప్పకూలుతోంది. బుమ్రా జోరు చూస్తుంటే కివీస్ 150లోపే ఆలౌట్ కావడం ఖాయం.. తొలి రోజే భారత్ పట్టు బిగించడం సాధించడం పక్కా అనిపించింది. కానీ, అక్కడే ఆట మలుపు తిరిగింది. భారత్ పట్టు విడిచింది.
ఓవైపు బుల్లెట్లలాంటి బంతులతో బుమ్రా బ్లాక్ క్యాప్స్ బ్యాటర్ల మైండ్ బ్లాంక్ చేస్తుంటే మిగతా ముగ్గురు పేసర్లు ప్రభావం చూపలేకపోయారు. ఇదే అదునుగా హెన్రీ నికోల్స్ (221 బంతుల్లో 14 ఫోర్లతో 113 బ్యాటింగ్), గ్లెన్ ఫిలిప్స్ (182 బంతుల్లో 13 ఫోర్లతో 94 బ్యాటింగ్) అద్భుత పోరాటంతో ఎదురు నిలిచారు. దాంతో గురువారం మొదలైన తొలి టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 82 ఓవర్లలో 243/5 స్కోరు చేసింది. నికోల్స్, ఫిలిప్స్ ఆరో వికెట్‌కు అజేయంగా 173 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. రెండో రోజు మొదటి సెషన్లో కివీస్‌ను ఎంత త్వరగా ఆలౌట్ చేస్తే భారత్‌కు అంత మంచిది.
బుమ్రా మ్యాజిక్
టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకోగా.. ఈ నిర్ణయానికి బుమ్రా న్యాయం చేశాడు. పిచ్‌పై 15 మిల్లీమీటర్ల పచ్చిక ఉండటంతో ఆరంభంలో బుమ్రా నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ మూడో బంతికే కెప్టెన్ టామ్ లాథమ్ (0)ను అద్భుత ఇన్‌స్వింగర్‌తో బౌల్డ్ చేసి కివీస్‌కు షాకిచ్చాడు. డెవాన్ కాన్వే (4) పేలవ షాట్‌తో అన్షుల్ కాంబోజ్ (1/57)కు వికెట్ ఇవ్వగా, రచిన్ రవీంద్ర (15)ను కీపర్ క్యాచ్‌తో ఆకాశ్ దీప్ (1/33) ఔట్ చేశాడు. ఆ తర్వాత డారిల్ మిచెల్ (1) క్రీజులోకి వచ్చి ముందుకు జరిగి ఆడే ప్రయత్నం చేయగా.. బుమ్రా పక్కా ప్రణాళికతో షార్ట్‌లెగ్‌లో యశస్వి జైస్వాల్‌ను ఫీల్డింగ్‌కు పెట్టి అతని వికెట్ రాబట్టాడు. దాంతో 60/4తో కివీస్ తొలి సెషన్‌ను ముగించింది. లంచ్ విరామం నుంచి వచ్చిన వెంటనే బుమ్రా బౌలింగ్‌లోనే టామ్ బ్లండెల్ (5) స్లిప్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా ఔట్ కావడంతో కివీస్ కుప్పకూలే స్థితికి చేరింది.
నికోల్స్, ఫిలిప్స్ ఎదురుదాడి
70 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టును నికోల్స్, ఫిలిప్స్ ఆదుకున్నారు. మరోవైపు 30వ ఓవర్ తర్వాత కొత్త బంతి మెరుపు తగ్గడం, పిచ్‌పై తేమ ఆరిపోవడం వారికి లాభించింది. బుమ్రా ఇచ్చిన అద్భుత ఆరంభాన్ని మిగతా ముగ్గురు పేసర్ల్లు కొనసాగించలేకపోయారు. సిరాజ్ స్థానంలో జట్టులోకి వచ్చిన కాంబోజ్ గంటకు 128-130 కిలోమీటర్ల వేగంతోనే బంతులు వేశాడు. దాంతో లెగ్‌సైడ్‌లో ఆరుగురు ఫీల్డర్లను మోహరించి షార్ట్ బాల్స్‌తో నికోల్స్‌ను కట్టడి చేద్దామనుకున్న గిల్ వ్యూహం బెడిసికొట్టింది. ప్రసిద్ధ్ కృష్ణ (0/58) లైన్ అండ్ లెంగ్త్ కోల్పోయాడు. తను మరీ ఫుల్‌గా లేదా షార్ట్‌గా బంతులు వేయడంతో బ్యాటర్లు సులువుగా బౌండరీలు బాదారు. ఆకాశ్ పొదుపుగా బౌలింగ్ చేసినా, పాత బంతితో ప్రభావం చూపలేకపోయాడు.
జడేజాను తుది జట్టులోకి తీసుకున్న స్పిన్నర్ సుందర్ (0/38) కూడా ప్రభావం చూపలేకపోయాడు. దాంతో కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ తర్వాత మూడో స్థానంలో ఆడుతున్న 35 ఏండ్ల నికోల్స్ తన అనుభవాన్నంతా రంగరించి క్రీజులో పాతుకుపోయాడు. మరో ఎండ్‌లో ఫిలిప్స్ ఎదురుదాడి ప్రారంభించడంతో నికోల్స్ కూడా తన సహజ శైలిలో ఆట ఆడాడు. కవర్ డ్రైవ్‌లతో పాటు మణికట్టును ఉపయోగిస్తూ లెగ్‌సైడ్ ఫ్లిక్ షాట్లు కొట్టిన అతను 188 బంతుల్లో తన 12వ టెస్ట్ సెంచరీ పూర్తి చేశాడు. శతకం తర్వాత ప్రసిద్ధ్ బౌలింగ్‌లో నికోల్స్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ రిషబ్ పంత్‌తో సమన్వయ లోపంతో పడిక్కల్ జారవిడవడం భారత్‌కు శాపంగా మారింది. ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకున్న అతను మరోవైపు దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన ఫిలిప్స్‌తో కలిసి అజేయంగా తొలి రోజును ముగించాడు.
- 237 టెస్టుల్లో బుమ్రా పడగొట్టిన వికెట్లు. ఈ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జవగళ్ శ్రీనాథ్ (236)ను వెనక్కునెట్టి పదో స్థానానికి చేరాడు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 82 ఓవర్లలో 243/5 (నికోల్స్ 113 బ్యాటింగ్, ఫిలిప్స్ 94 బ్యాటింగ్, బుమ్రా 3/52)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

