పాడ్ ట్యాక్సీ.. అట్టర్ ఫ్లాప్ !
ప్రపంచవ్యాప్తంగా విఫలమైన పీఆర్టీఎస్, పాడ్ ట్యాక్సీలను నగరానికి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గంటకు కేవలం 35-41 కిలోమీటర్ల నెట్‌వర్క్‌కు రూ. 13,500 కోట్ల నుంచి రూ. 14,000 కోట్ల వరకు ప్రజాధనం వృథా చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది.
- ప్రపంచవ్యాప్తంగా విఫలమైన పీఆర్‌టీఎస్‌పై సర్కార్ అత్యుత్సాహం
- కిక్కిరిసిన రోడ్లపై పిల్లర్లు వేసి నడపడం అసాధ్యమంటున్న నిపుణులు
- ఏఏ రూట్లలో వేయాలో స్పష్టతలేని ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తారా?
- వేల కోట్లు ప్రజాధనం వృథా చేసేందుకు రేవంత్ సర్కార్ రంగం సిద్ధం
సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) ప్రపంచవ్యాప్తంగా విఫలమైన పీఆర్టీఎస్, పాడ్ ట్యాక్సీలను నగరానికి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గంటకు కేవలం 35-41 కిలోమీటర్ల నెట్‌వర్క్‌కు రూ. 13,500 కోట్ల నుంచి రూ. 14,000 కోట్ల వరకు ప్రజాధనం వృథా చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. డిసెంబర్లో టెండర్లు ఖరారు చేసి ఏడాదిలోనే తొలి కారిడార్‌ను పరుగులు పెట్టిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం రవాణా రంగ నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. నిత్యం కిక్కిరిసి ఉండే రోడ్ల మధ్య పిల్లర్లు వేసి నడపడం అసాధ్యమని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొలి కారిడార్ కేపీహెచ్‌బీ-మైండ్‌స్పేస్ అని ,ఎల్బీ స్టేడియం-రాణిగంజ్ అని మరోసారి చెబుతూ.. కనీసం ఏ రూట్లో వేయాలో కూడా స్పష్టత లేని ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తామనడం హాస్యాస్పదంగా మారింది.
కాగితాలపై చూడటానికి డ్రైవర్ లేని చిన్న ఎలక్ట్రిక్ పాడ్లు, ఆకాశమార్గంలో ఎలివేటెడ్ ట్రాక్‌లపై దూసుకెళ్తున్నట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ వాస్తవ క్షేత్రంలో పీఆర్టీఎస్ అనేది ఒక విఫల ప్రయోగం అని అభిప్రాయం ఉంది. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిపాదించిన మెజారిటీ ప్రాజెక్టులు అసలు పురుడు పోసుకోకముందే ఆగిపోయాయి. ప్రస్తుతం మనుగడలో ఉన్నవి కేవలం నామమాత్రపు, నియంత్రిత వ్యవస్థలు మాత్రమే. అందులో హీత్రో విమానాశ్రయం (లండన్)లో 2011లో మొదలైన ఈ ప్రాజెక్టు కేవలం 3.8 కిలోమీటర్ల దూరంలో, 3 స్టేషన్ల మధ్య 21 పాడ్లతో నడుస్తోంది. టర్మినల్-5 నుంచి పార్కింగ్ స్థలానికి ప్రయాణికులను చేర్చడానికి మాత్రమే ఇది పరిమితమైంది. 2014లో దీనిని విస్తరించాలని ప్రతిపాదించినా అడుగు ముందుకు పడలేదు. ఇక2010లో మస్దార్ సిటీ (యూఏఈ) కేవలం 1.2 కిలోమీటర్ల పైలట్ ప్రాజెక్టుగా మొదలైంది. దీనిని నగరమంతా విస్తరించాలని తొలుత భారీ ప్రణాళికలు వేశారు. కానీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైన వెంటనే, అది ఆచరణ సాధ్యం కాదని తేలడంతో విస్తరణను పూర్తిగా రద్దు చేశారు. అమెరికాలోని మోర్గాన్టౌన్ 1975 నుంచి నడుస్తున్న ఈ 13.2 కి.మీ వ్యవస్థలో ఒక్కో వాహనంలో 20 మంది ప్రయాణిస్తారు (ఇది గ్రూప్ ట్రాన్సిట్). దీని నిర్వహణ ఖర్చు తడిసి మోపెడవడంతో ప్రపంచంలో మరెక్కడా దీనిని ఇప్పటివరకు కాపీ కొట్టలేదు.
గంటకు కేవలం 500 మందే…
గ్రేటర్ వెల్లింగ్టన్ అంతర్జాతీయ సమీక్ష గణాంకాల ప్రకారం.. ఒక పాడ్ ట్యాక్సీ కారిడార్ గంటకు ఒక దిశలో గరిష్టంగా 480 నుంచి 500 మంది ప్రయాణికులను మాత్రమే గమ్యస్థానాలకు చేర్చగలదు (హీత్రోలో 480, మస్దార్లో 500)
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ – మైండ్‌స్పేస్ ఐటీ కారిడార్‌లో కానీ, ఎల్బీ స్టేడియం – రాణిగంజ్ మార్గంలో కానీ రద్దీ వేళల్లో గంటకు వేలాది మంది ప్రయాణికులు ఉంటారు. గంటకు 500 మందిని కూడా మోయలేని ఈ బొమ్మ రైళ్లు హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను ఎలా తీరుస్తాయి? ఇది మెట్రో రైలుకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేల కోట్లు ధార పోసేందుకు సిద్ధమవుతున్న సర్కార్..
పాడ్ ట్యాక్సీల తయారీ సంస్థలు (వెండర్లు) ప్రభుత్వాలను ఆకర్షించేందుకు కిలోమీటరుకు కేవలం 3 నుంచి 5 మిలియన్ పౌండ్లు (లేదా 7-15 మిలియన్ డాలర్లు) మాత్రమే ఖర్చవుతుందని, ఇది మెట్రో కంటే 3-5 రెట్లు చౌక అని ప్రచారం చేస్తుంటాయి. కానీ వాస్తవ లెక్కలు దిమ్మతిరిగేలా ఉన్నాయి. లండన్ హీత్రోలో కేవలం 3.8 కిలోమీటర్ల నిర్మాణానికి 30 మిలియన్ పౌండ్లు ఖర్చయింది. అంటే కిలోమీటరుకు సగటున 8 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 85 కోట్లకు పైమాటే). 2016లో ఢిల్లీలో ప్రతిపాదించిన ‘మెట్రినో’ పాడ్ ప్రాజెక్టుకు కిలోమీటరుకు రూ. 100 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇది అధిక ఖర్చు – అత్యల్ప సామర్థ్యం కలిగిన వృథా ప్రయాస అని నిపుణులు పురిటిలోనే తీవ్రంగా విమర్శించారు. కానీ 35-41 కిలోమీటర్ల నెట్‌వర్క్‌కు రూ. 13.,500 కోట్ల నుంచి రూ. 14,000 కోట్ల వరకు ప్రజాధనం ధార పోసేందుకు సర్కారు రంగం సిద్ధం చేసుకుందని వాదనలు వస్తున్నాయి.
ప్రపంచంలో ఎక్కడా లేని ప్రయోగం ఇక్కడేనా?
ప్రపంచంలో ఎక్కడా 30 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ పొడవైన పీఆర్టీ నెట్వర్క్ మనుగడలో లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 34 నుంచి 40.82 కిలోమీటర్ల మేర నిర్మిస్తామని చెబుతోంది. అదీగాక, హీత్రో, మస్దార్ సిటీలు పూర్తిగా వాహనాల రద్దీ లేని నియంత్రిత ప్రాంతాలు అలాంటి చోట నడిచిన పాడ్లను.. నిత్యం కిక్కిరిసి ఉండే హైదరాబాద్ ఓపెన్ రోడ్ల మధ్య పిల్లర్లు వేసి నడపడం అసాధ్యమని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక నివేదికలో కారిడార్ పొడవు 34 కి.మీ అంటే, మరోచోట 35 కి.మీ అంటున్నారు.
అక్టోబర్ నివేదికలో ఏకంగా 40.82 కి.మీ అని పేర్కొన్నారు. తొలి కారిడార్ కేపీహెచ్‌బీ-మైండ్‌స్పేస్ అని ఒకసారి, ఎల్బీ స్టేడియం-రాణిగంజ్ అని మరోసారి చెబుతున్నారు. కనీసం ఏ రూట్లో వేయాలో కూడా స్పష్టత లేని ప్రాజెక్టుకు డిసెంబర్లో టెండర్లు పిలిచి, ఏడాదిలోపే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా మారింది. కానీ తయారీ కంపెనీల రంగుల బ్రోచర్లు, అతిశయోక్తి లెక్కలను నమ్మి వేల కోట్ల ప్రజాధనాన్ని పణంగా పెట్టవద్దని రవాణా రంగ నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. మస్దార్ సిటీలాగా మధ్యలోనే చేతులెత్తేసే పరిస్థితి రాకముందే.. వాస్తవ వ్యయ అంచనాలను ప్రజల ముందు ఉంచాలి. లేదంటే హైదరాబాద్ నడిబొడ్డున నిలబడే పాడ్ పిల్లర్లు రేవంత్ సర్కార్ అసమర్థతకు నిలువుటద్దంలా, మరో తెల్ల ఏనుగులా మిగిలిపోవడం ఖాయమని చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

