కట్ చేస్తే.. అక్కడ అతను కాదు ఆమె.. పురుషులకు మాత్రమే.. బోర్డు వెనుక.. పురుషాధిక్యం కనిపించే చోట.. ఆమె అడుగు పెట్టింది.. కాదు, పరుగు పెడుతున్నది. ట్రిమ్ ఎక్స్.. హైదరాబాద్ మహా నగరంలో 36 బ్రాంచీలున్న పేరు మోసిన మెన్స్ సెలూన్. దీని స్థాపన ద్వారా మగ మహారాజులకు కటింగ్, ట్రిమ్మింగ్లాంటి గ్రూమింగ్ సేవలందిస్తున్నది ఓ మకుటంలేని మహారాణి. అందరూ నడిచే దారితనది కాదని చెప్పే ఆవిడే గాయత్రీ కృష్ణన్. తన ఆసక్తికర ప్రయాణాన్ని జిందగీతో పంచుకుంది..
Gayatri Krishnan | ఆడవాళ్లకు కటింగ్ చేస్తే ైస్టెలిస్ట్ అనీ అదే మగవాళ్లకు చేస్తే బార్బర్ అనీ అంటారు. అతనెందుకు ైస్టెలిస్ట్ కాడో ఇప్పటికీ నాకు అర్థం కాదు. మహిళల సర్వీసుల్లో కూడా మగవాళ్లే ఆధిపత్యం చూపుతున్న రోజుల్లో, మగవాళ్ల కోసం ఓ మహిళ సర్వీస్ ప్రారంభించడం వింత కాదు. మార్పు మాత్రమే. ఇదొక ముందడుగు. సమాజంలో ప్రతి మార్పు తిరస్కరణ ఎదుర్కొన్నదే. మహిళలుగా మేం అవన్నీ దాటుకుని విజయం సాధించాం. ఇకమీదటా సాధిస్తాం!
అన్నిచోట్లా మగవాళ్లదే ఆధిపత్యం. కానీ, ఒక్క సెలూన్లలో మాత్రం మహిళలే మహరాణులు! ఆడవాళ్ల కోసం, ఆడవాళ్ల చేత, ఆడవాళ్లే నిర్వహించే వ్యవస్థలా ఉన్న చోట మగవాళ్లకు అవస్థలు ఉంటాయని గుర్తించాను. ఆడవాళ్ల అవసరాల కోసం సెలూన్లు నడుపుతున్నట్టే, మగవాళ్ల కోసమూ నడపాల్సిన అవసరం ఉందనిపించింది. అందుకే సెలూన్లలో మార్పు తేవాలనుకున్నాను. ట్రిమ్ ఎక్స్ మెన్స్ సెలూన్… ప్రారంభం గురించి చెప్పాలంటే, అంతకు ముందు నా ప్రయాణం గురించీ మాట్లాడాలి.
మా నాన్నది తమిళనాడు. అమ్మది హైదరాబాద్. నాన్న కంపెనీ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నాగ్‌పూర్‌లో పని చేశారు. నేను నాగ్‌పూర్‌లో పుట్టి పెరిగాను. అమ్మమ్మ వాళ్లు ఉన్నారని ఇక్కడికి వచ్చాం. బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్‌లో బీయస్సీ చదివాను. తర్వాత ఉద్యోగం, వివాహం, పిల్లలు… ఇలా అందరి మహిళల్లా నా జీవితం సాగిపోతున్నది. ఇరవై ఏండ్లపాటు టాటా టెలికమ్యూనికేషన్స్‌లో రకరకాల హోదాల్లో, వివిధ నగరాల్లో పని చేశాను. మార్కెటింగ్, కస్టమర్ కేర్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్… ఇలా అవసరం, సందర్భాన్ని బట్టి ఏ పని ఇస్తే అది చేస్తూ పోయాను. మంచి జీతం, సంతోషకరమైన జీవితం. అయినా సరే ఏదో సాధించాలనే తపనతో కంఫర్ట్ జోన్ దాటి రిస్క్ తీసుకున్నాను. 2018లో ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చాను. నా ఫ్రెండ్‌కి యూనిసెక్స్ సెలూన్ కంపెనీ ఉంది. అందులో నేను ఒక ఫ్రాంచైజీ తీసుకున్నాను. ఏడాది నడిపాను. అది పేరుకే యూనిసెక్స్ సెలూన్. సర్వీస్‌లన్నీ ఆడవాళ్ల కోసమే అన్న సంగతి వ్యాపారంలోకి దిగితే కానీ తెలియలేదు!
యూనిసెక్స్ సెలూన్ అంటే ఆడవాళ్ల కోసమే కాదు మగవాళ్ల కోసమూ అని చెబుతాం. కానీ, అది ఆడవాళ్లకు ప్రత్యేకమని జనం అనుకోవడం తప్పు కాదని నాకు పనిచేసే కొద్దీ తెలిసివచ్చింది. ఏడాది కాలంలో సెలూన్ నిర్వహణలో ఉన్న సమస్యలు గుర్తించాను. అక్కడి సర్వీసులు, సదుపాయాలన్నింటిలో స్త్రీలకే ప్రాధాన్యం. దీంతో మహిళలకు సర్వీస్ చేసే చోటకు వచ్చామని మగవాళ్లు ఫీలయ్యేవాళ్లు. ఆడవాళ్లను అందంగా తీర్చిదిద్దడానికి పెద్ద పెద్ద సెలూన్లు ఉన్నాయి. అలాంటి సర్వీసులు మగవాళ్లకు తక్కువే. అందుకే సెలూన్లలో ఉండే సెటప్ దగ్గర నుంచి ైస్టెలిస్టుల వరకు మగవాళ్లకు అనుకూలంగా మార్చాలనుకున్నాను. పురుషుల కోసమే సెలూన్ నడపాలని నిర్ణయించుకున్నాను. ఏడాది తర్వాత ఆ ఫ్రాంచైజీని వదిలిపెట్టి, నేనే కొత్తగా ‘ట్రిమ్ ఎక్స్’ పేరుతో సెలూన్ ప్రారంభించాను.
ఈ రంగంలో అనుభవం లేదు. నేపథ్యమూ లేదు. ప్రతిదీ నేర్చుకోవాలి. ఏడాది కాలంలోనే ైస్టెలిస్టుల పని తీరుని అంచనావేయడం నేర్చుకున్నాను. మగవాళ్లకు ప్రత్యేకంగా సెలూన్ సర్వీస్ నడిపితే అవకాశాలు బాగుంటాయని అనిపించింది. అయితే, ఇక్కడ నాకు ఎదురైన మొదటి సమస్య స్థానిక యువత సెలూన్లలో పని చేసేందుకు ఆసక్తి చూపకపోవడం. మన సమాజంలో ఉన్న కుల వివక్షతో పాటు, ఈ వృత్తిపట్ల కొందరిలో ఉన్న చిన్న చూపు వల్ల యువత ఈ తరహా నైపుణ్యాలను నేర్చుకోవాలనుకోవడం లేదు. అందువల్ల ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల నుంచి కొంతమంది యువకుల్ని తీసుకున్నాను. వాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాను. ఒక అవుట్లెట్ విజయవంతం అయ్యాక మరో అవుట్లెట్ పెడుతూ పోయాను. కొత్తగా ఉద్యోగుల్ని తీసుకోవడం, శిక్షణ ఇవ్వడం చేస్తూ వంద మంది మెన్స్ ైస్టెలిస్ట్లను తయారు చేశాను. షేవింగ్, కటింగ్, హెయిర్ ైస్టెలింగ్, బాడీ మసాజ్ సర్వీసులన్నీ మా సెలూన్లలో చేస్తాం. ఈ వృత్తిలోకి నేను వచ్చిన కొత్తలో ‘ఆడవాళ్లు సెలూన్ బిజినెస్ చేయడమా?!’ అని నోరు వెళ్లబెట్టారు స్నేహితులు, బంధువులు. వాళ్లకు అదొక వింతగా తోచింది. అయినా ఎవరూ వద్దని మాత్రం నిరుత్సాహపరచలేదు. అదే సంతోషం. మా ఇంట్లో మాత్రం నాకు కావాల్సినంత ప్రోత్సాహం లభించింది. అందువల్లే ఈ రోజు నేను ఒక విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తగా నిలబడగలిగాను. నేను ఎలా సక్సెస్ అయ్యానో, నా దగ్గర పని చేసేందుకు వచ్చిన వాళ్లూ అలాగే సక్సెస్ అయ్యారు. మంచి జీతం, వసతి, ఇన్సెంటివ్లతో వాళ్లూ సంతోషంగా ఉన్నారు. ట్రిమ్ ఎక్స్ మెన్స్ సెలూన్లు హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 36 ఏర్పాటు చేశాను. ముందు ముందు కంపెనీని విస్తరించాలనే లక్ష్యంతో ఫ్రాంచైజీ మోడల్లోకి మారబోతున్నాం.
వ్యాపారం చేయడమంటే తేలిక కాదు. అది ఒక ఛాలెంజ్. ఒక దాని తర్వాత ఒకటి వరుసగా సవాళ్లు వస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొంటున్నంత కాలం నిలదొక్కుకుంటాం. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఎవరికీ మినహాయింపులు లేవు. నేను కంపెనీ విస్తరణ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగాను. వాళ్లు లాభాలు చూపించమన్నారు. లాభాలే ఉంటే వాళ్ల సహకారం నాకెందుకు. వాస్తవంగా చెప్పాలంటే మా కంపెనీ వందల మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఆ ఉపాధి కల్పనను బ్యాంకులు పట్టించుకోలేదు. నాకంటూ ఉన్న ఏకైక సపోర్ట్ కుటుంబం. అదొక్కటే నా బలం. అందువల్లే రాణిస్తున్నాను.
– నాగవర్ధన్ రాయల