KTR | సిరిసిల్ల రూరల్/రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ‘ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్టు పెట్టడం కాదు.రేవంత్‌రెడ్డికి నిజంగా దమ్ముంటే భార్యాపిల్లలపై ఒట్టు వేసి చెప్పాలి’ అని సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. అధికారంలోకి రావాలన్న ఆశతో కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించింద ని, మహిళలకు రూ.2,500,కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, రూ.2 లక్షల రుణమాఫీ, రూ.4 వేల పెన్షన్ వంటి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, 150 రోజులు అవుతున్నా అంతా సున్నా అని ధ్వజమెత్తారు. గురువారం సిరిసిల్ల తెలంగాణభవన్‌లో ముస్తాబాద్, గంభీరావుపేట, తంగళ్లపల్లి మండలాల కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సాయంత్రం 7 గంటలకు కోనరావుపేటలో బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి వినోద్‌కుమార్‌తో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికులు అడిశర్ల సాయి, అంకారపు మల్లేశం కుటుంబసభ్యులను పరామర్శించారు. వారి కుటుంబ పరిస్థితి తెలుసుకొని తక్షణ సాయంగా రూ.50 వేల చొప్పున అందజేశారు. రెండు రోజుల్లో మళ్లీ వస్తానని, నేతన్నలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడు తూ.. ‘పాలిచ్చే బర్రెను అమ్ముకుని దున్నపోతును కొనుక్కున్నట్టు ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రైతులు, నేతన్నల ఆత్మహత్యలు మళ్లీ పునరావృతమయ్యాయి. రైతుబంధు ఇప్పటికీ పడలేదు. జనవరి ఆసరా పింఛన్లు ఎగ్గొట్టిండు. రాబోయే రోజుల్లో రైతుబంధు ఎగ్గొట్టడని గ్యారెంటీ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం కాదు కదా.. తులం ఇనుము కూడా ఇవ్వదు’ అని తెలిపారు.
‘సిరిసిల్లలో 2009లో శాసనసభ్యుడిగా ఎన్నికైన సందర్భంలో బాధాకరమైన పరిస్థితులు ఉండేవి. 2007లో కూడా వారంలో 8, 9 మంది నేతకార్మికులు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నరు. సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతున్నదని చెప్పినా, కార్మికులు ఆర్తనాదాలు చేసినా అప్పటి కాంగ్రెస్ సర్కారు పట్టనట్టు వ్యవహరించింది.ఆనాడు కేసీఆరే పార్టీ నుంచి రూ.50లక్షలు పద్మశాలీలకు అందించి, సూక్ష్మరుణాలతో ఆదుకున్నారు’ అని కేటీఆర్ గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నేతన్న చనిపోకుండా, వారికి ధైర్యాన్ని ఇచ్చి, బ్రహ్మాండమైన పాలసీలు చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, బతుకమ్మ చీరల ఆర్డర్లు, చేనేత బంధు, చేనేత బీమా పథకాలను తీసుకొచ్చి ఉపాధి కల్పించామని చెప్పారు. ‘ఇప్పుడు చాలా దురదృష్టం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగునెలల్లో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నరు. ఇవాళ ఒకే రోజు సిరిసిల్లలో యువ నేతకార్మికుడు అడిచర్ల సాయి, తంగళ్లపల్లిలో నేతకార్మికుడు అంకారపు మల్లేశం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే’ అని మండిపడ్డారు. బాగా నడుస్తున్న పరిశ్రమను కేవలం కేసీఆర్, కేటీఆర్ నియోజకవర్గం అన్న కోపంతో రేవంత్‌రెడ్డి వేధించటం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొనాలని, పెండింగ్ బకాయిలు 24 గంటల్లో చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నేతన్నల కోసం తాము రోడ్డెక్కుతామని హెచ్చరించారు.
ప్రజలు మళ్లీ దొంగల మాటలు నమ్మి మోసపోవద్దని కేటీఆర్ సూచించారు. ప్రజల ఆదాయం రెట్టింపు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన మోదీ మాయలో పడొద్దని అన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఎటుపోయాయని బీజేపీని ప్రశ్నించారు. పదేండ్లలో మోదీ సర్కారు దేశ ప్రజలకు చేసిందేమీ లేదని, అందుకే దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. చేసిన అభివృద్ధి చెప్పుమంటే జైశ్రీరాం అంటారని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు అమిత్‌షా చెప్పులు మోసేవాడు కాదు.. కరీంనగర్ ప్రజలకు అభివృద్ధి చేసే నాయకుడు కావాలని వెల్లడించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే బోయినిపల్లి వినోద్‌కుమార్‌ను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 12 ఎంపీ సీట్లు అప్పజెప్పితే ఏడాదిలో మళ్లీ కేసీఆర్ సర్కారు వస్తుందని అన్నారు. సిరిసిల్లలో నేతకార్మికుల వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం సీఎం రేవంత్‌రెడ్డే అని వినోద్‌కుమార్ ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ హయాంలో ఒక్క ఆత్మహత్య జరగలేదని, ఇప్పుడు ఎందుకు చనిపోతున్నారని ప్రశ్నించారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహరావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర నేత గూడూరి ప్రవీణ్, రాఘవరెడ్డి, గజభీంకార్ రాజన్న, పడిగెల రాజు, బొల్లి రామ్మోహన్, అంకారపు రవీందర్, బండి జగన్, అంకారపు అనిత, అబ్బాడి అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.