Virosh | టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇన్నాళ్లు ప్రేమజంటగా వార్తల్లో నిలిచిన ఈ జంట ఇప్పుడు భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వారి రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్ తాజ్ కృష్ణలో వైభవంగా జరగనుంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరుకానున్నట్లు సమాచారం. ఈ వేడుకను అత్యంత ప్రైవేట్‌గా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలు హాజరవుతారని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, అలియా భట్, రణ్‌భీర్ కపూర్, కరణ్ జోహార్, అనన్య పాడే తదితరులు పాల్గొనే అవకాశముందని సమాచారం. భద్రతా ఏర్పాట్ల విషయంలో నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కేవలం ఆహ్వానం పొందిన అతిథులకే ప్రవేశం కల్పించేందుకు ‘వన్ టైమ్ క్యూ ఆర్ కోడ్’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అభిమానుల రద్దీ, ప్రముఖుల హాజరు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం అల్లు అర్జున్ ఈ కొత్త దంపతులకు ఖరీదైన కారును కానుకగా ఇవ్వబోతున్నారట. పుష్ప ఫ్రాంచైజీ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించింది. అప్పుడే రష్మిక పెళ్లికి ప్రత్యేక బహుమతి ఇవ్వాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారని ప్రచారం.
ఇప్పటికే విజయ్–రష్మిక జంట ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి రిసెప్షన్‌కు ఆహ్వానించినట్లు సమాచారం. మొత్తం మీద ఈ వేడుక సినీ పరిశ్రమలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. గీత గోవిందం సినిమాలో చూడముచ్చటగా కనిపించిన ఈ జంట ఇప్పుడు నిజ జీవితంలో దాంపత్య జీవితాన్ని ప్రారంభించడంతో అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. త్వరలోనే వీరిద్దరూ కలిసి ‘రణబాలి’ అనే మరో చిత్రంతో పలకరించనున్నారు. సెప్టెంబర్ 11న ఈ సినిమా విడుదల కానుందని సమాచారం.