‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమా గుర్తుందిగా. అందులో దివాకరం అదేనండీ.. రాజేంద్రప్రసాద్ పాత్ర దగ్గర బాకీ వసూలు చేయడానికి వస్తాడు సాక్షి రంగారావు. అప్పుడు దివాకరం ‘అప్పు కింద నా వీడియో పార్లర్లో ఏంతీసుకుపోయినా ఫర్వాలేదు, ఈ టీవీ జోలికి మాత్రం రావొద్దు’ అంటాడు. పైగా అది తన స్నేహితుడు దుబాయ్ నుంచి పంపాడని చెబుతాడు. ఆ మాటలకు బుట్టలో పడ్డ సాక్షి రంగారావు తనకు అదే కావాలంటాడు. ఇంటికి మోసుకెళ్తాడు. వీధి వీధంతా పిలిచి వేడుకగా టీవీ ఆన్ చేస్తాడు. ‘ముందుగా సౌండ్ వస్తుంది.. ఆపై బొమ్మ వస్తుంది.. అది చూసి మీరు..’ అంటుండగానే ముందుగా పొగలొచ్చి… తర్వాత టీవీ కాస్తా పేలిపోతుంది. ఆ సీను చూసిన ప్రతిసారీ నవ్వుకుంటాం కదా!. కానీ, మనల్ని చూసి ఎందరు నవ్వుకుంటున్నారో ఆలోచించారా??
Influencer | ఏదో సినిమాలో ఓ పాత్ర మరోపాత్రకు ఇన్ఫ్లూయెన్స్ అయితే కామెడీ పండింది. కానీ, నిజజీవితంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల మాటలు నమ్మి తప్పులో కాలేస్తే.. బోరున ఏడ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇటీవలి కాలంలో చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు వినియోగదారులు దారి తప్పేలా చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ హీరోల ప్రకటనల కన్నా.. సామాజిక మాధ్యమాల ప్రభావశీలుర మాటలే వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే అంతర్జాతీయ సంస్థలు కూడా తమ బ్రాండ్ల ప్రచారానికి సెలెబ్రిటీలను కాదని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల కాలింగ్‌బెల్ కొడుతున్నాయి.
ఇంతవరకు బాగానే ఉన్నా… ఈ ప్రకటనల పర్వంలో నకిలీ ఇన్ఫ్లూయెన్సర్లు చొరబడటం వినియోగదారులను మోసాల వాకిట నిలబెడుతున్నది. సబ్‌స్ర్కైబర్ల సంఖ్యను పెంచుకునేంత వరకు ఒకరకంగా, పెరిగిన తర్వాత నాణేనికి రెండోవైపు చూపిస్తున్నారు. అందుకే అసలైన ఇన్ఫ్లూయెన్సర్ల గురించి అవగాహన పెంచుకుంటే చిక్కుల్లో పడే పరిస్థితి రాదు. ఏ వస్తువు గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా, ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పారు కదా అని.. అవగాహనారాహిత్యంతో కొంటే నష్టం తప్పదు.
మొబైల్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ పెట్టుబడి, ఆన్లైన్ మల్టీ లెవల్ మార్కెటింగ్, క్రిప్టో కరెన్సీ వంటి చాలా నకిలీ కంపెనీలు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల సాయంతో ఇంటర్నెట్లో అనామకంగా పనిచేస్తాయి. సగటు మధ్యతరగతి వర్గాలను ప్రలోభాలకు గురిచేయడమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ నిర్వహించిన సర్వే ప్రకారం.. ఇన్‌ఫ్లూయెన్సర్లలో 50 శాతం నకిలీలే అని తేలింది. వీరిలో సెలెబ్రిటీలు కూడా ఉండటం గమనార్హం.
ఇలాంటి వ్యక్తుల ప్రకటనలకు సమయం వెచ్చించడం, వాటిలో డబ్బు పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం కాదు. ఆపిల్ స్టోర్, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయకుండా లింక్‌ల ద్వారా వినియోగదారుల మొబైల్‌లోకి వచ్చిపడే కంపెనీల అప్లికేషన్లు చట్టబద్ధమైనవి కాదన్న ఎరుకతో మసులుకోవాలి. డబ్బు సంపాదన ఆశచూపే ఈ కంపెనీలేవీ పోలీసు, న్యాయపరమైన గుర్తింపు పొందవు. ఇలాంటి వ్యవహారాల్లో సోషల్ మీడియా ప్రభావాన్ని నిరోధించడానికి సదరు పోస్ట్ ఉద్దేశాన్ని ప్రశ్నించడం, విమర్శనాత్మక మనస్తత్వం పెంపొందించుకోవడం ఉత్తమం. చివరిగా ఇన్ఫ్లూయెన్సర్ల మాటల్లోపడి వాస్తవాన్ని గుర్తించకపోతే.. ‘ఏప్రిల్ 1&’లో సాక్షి రంగారావు పరిస్థితే మీకూ ఎదురవ్వొచ్చు!
– అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్