SRH vs RCB | ఐపీఎల్-17 సీజన్లో వరుసగా నాలుగు విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కు ఊహించని ఝలక్ తగిలింది. మొదట బ్యాటింగ్‌చేస్తూ బౌండరీలు, సిక్సర్లు బాదడం అంటే ఇంత ఈజీగా అన్నంత రేంజ్లో బాదుతున్న హైదరాబాద్.. ఛేదనలో మాత్రం చేతులెత్తేసింది. ‘టార్గెట్ 300’ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చిన మన వీరులు.. ఛేదనలో 207 కొట్టడానికి నానా తంటాలు పడ్డారు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ విఫలమై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో చిత్తయ్యారు. మరోవైపు ఈ సీజన్లో చెత్త ప్రదర్శనలతో అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న ఆర్సీబీ వరుసగా ఆరు పరాజయాల తర్వాత ఎట్టకేలకు గెలుపు రుచిచూసింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఆ జట్టు ఉప్పల్‌లో పోరాడితే పోయేదేమీ లేదన్నట్టుగా చెలరేగింది. ఐపీఎల్లో 250వ మ్యాచ్ ఆడిన ఆర్సీబీ.. ఈ సీజన్లో తమ అత్యధిక పరుగుల రికార్డు (263) రికార్డును మూడుసార్లు చెరిపేసిన ఎస్ఆర్హెచ్ను వారి సొంత ఇలాఖా ఉప్పల్‌లో ఓడించి బదులు తీర్చుకుంది. ముందు బ్యాటింగ్‌లో రజత్ పాటిదార్ మెరుపులకు తోడు కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్‌తో బెంగళూరు ‘200’ మార్కును దాటింది. ఆర్సీబీ స్పిన్నర్లు హైదరాబాద్‌ను ఆరంభం నుంచే కోలుకోలేని దెబ్బకొట్టి బెంగళూరు ‘బెంగ’ తీర్చారు.
హైదరాబాద్ : వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఝలక్ ఇచ్చింది. సొంతగడ్డ ఉప్పల్‌లో హైదరాబాద్‌ను 35 పరుగుల తేడాతో చిత్తు చేసి ఎట్టకేలకు ఆరు పరాజయాల తర్వాత ఓ విజయాన్ని నమోదుచేసింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సమిష్టిగా రాణించి ఎస్ఆర్హెచ్పై రివేంజ్ తీర్చుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు కోహ్లీ (43 బంతుల్లో 51, 4 ఫోర్లు, 1 సిక్స్), రజత్ పాటిదార్ (20 బంతుల్లో 50, 2 ఫోర్లు, 5 సిక్సర్లు), కామెరూన్ గ్రీన్ (20 బంతుల్లో 37 నాటౌట్, 5 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో హైదరాబాద్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగుల వద్దే ఆగిపోయింది. షాబాజ్ అహ్మద్ (37 బంతుల్లో 40 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆర్సీబీ స్పిన్నర్లు స్వప్నీల్ సింగ్ (2/40), కర్ణ్ శర్మ (2/29) ఎస్ఆర్హెచ్ను కట్టడిచేశారు. పాటిదార్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
టాస్ గెలిచిన బెంగళూరు సారథి మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ తీసుకోవడంతోనే ఆర్సీబీ భారీ స్కోరుపై కన్నేసిందని తేలిపోయింది. అందుకు తగ్గట్టుగానే ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ (12 బంతుల్లో 25, 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండరీగా మలిచిన కోహ్లీ.. కమిన్స్ మూడో ఓవర్లోనూ రెండు ఫోర్లు కొట్టాడు. ఉన్నది తక్కువసేపే అయినా డుప్లెసిస్ 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. 4వ ఓవర్లో నటరాజన్ రంగప్రవేశంతో డుప్లెసిస్ కథ ముగిసి 48 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వన్ డౌన్లో వచ్చిన విల్ జాక్స్ (6)ను మార్కండే అద్భుత బంతికి బౌల్డ్ చేశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన పాటిదార్.. హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మార్కండే వేసిన 11వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లతో ఆర్సీబీ స్కోరుబోర్డు రాకెట్ వేగాన్ని అందుకుంది. కోహ్లీ కూడా అతడికి అండగా నిలిచాడు. అయితే 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న పాటిదార్ 13వ ఓవర్ వేసిన ఉనద్కత్ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆర్సీబీ స్కోరువేగం మందగించింది. 37 బంతుల్లోనే అర్ధ శతకం చేసిన కోహ్లీ కూడా ఉనద్కత్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. ఆఖర్లో కామెరూన్ గ్రీన్ పరుగులు పెట్టించాడు. కార్తీక్ (11), స్వప్నీల్ (12 నాటౌట్) తలా ఓ చేయి వేసి ఆ జట్టు స్కోరును 200 మార్కును దాటించారు.
భారీ ఛేదనలో సన్‌రైజర్స్ ఆదిలోనే తడబడింది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోవడంతో హైదరాబాద్ తర్వాత ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. క్రీజులోకి వచ్చినోళ్లు వచ్చినట్టే వెనుదిరిగారు.ట్రావిస్ హెడ్ (1).. విల్ జాక్స్ వేసిన తొలి ఓవర్లో ఆఖరి బంతికి కర్ణ్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ధాటిగా ఆడే క్రమంలో మూడో ఓవర్లో 4, 6, 6తో 20 పరుగులు రాబట్టినా దయాల్ 4వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి కార్తీక్‌కు చిక్కా డు. స్వప్నీల్ సింగ్ ఒకే ఓవర్లో మార్క్మ్ (7), హైదరాబాద్ భారీ ఆశలు పెట్టుకున్న హెన్రిచ్ క్లాసెన్ (7)ను పెవిలియన్‌కు పంపి భారీ దెబ్బకొట్టాడు. మరో ఆర్సీబీ స్పిన్నర్ కర్ణ్ శర్మ వరుస ఓవర్లలో హైదరాబాద్ కష్టాలను మరింత రెట్టింపుచేశాడు. 8వ ఓవర్లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (13) ని ్ల క్లీన్‌బౌల్డ్ చేసిన అతడు పదో ఓవర్లో అబ్దుల్ సమద్ కూడా బోల్తా కొట్టించడంతో విజయంపై ఎస్ఆర్హెచ్ ఆశలు అడుగంటాయి. కమిన్స్ (31)కు గ్రీన్ చెక్ పెట్టాడు. షాబాజ్ అహ్మద్ పోరాడినా అతడి పోరాటం హైదరాబాద్ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
బెంగళూరు: 20 ఓవర్లలో 206/7 (కోహ్లీ 51, పాటిదార్ 50, ఉనద్కత్ 3/30, నటరాజన్ 2/39)
హైదరాబాద్: 20 ఓవర్లలో 171/8 (షాబాజ్ 40 నాటౌట్, అభిషేక్ 31, గ్రీన్ 2/12, కర్ణ్ శర్మ 2/29)