బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బాగుండని కాంగ్రెస్, బీజేపీ బలంగా కోరుకుంటాయి. అందుకే ఆ పార్టీ పని అయిపోయిందని పదేపదే వల్లిస్తుంటాయి. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టే పార్టీలవి. గల్లీ మనసు వాటికి ఎంతచెప్పినా అర్థం కాదు. కానీ, బీఆర్ఎస్ అలా కాదు. ఇక్కడి జనం గుండె చప్పుడుతో లయ కలిపిన పార్టీ. ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వరాష్ట్ర సాధన పోరుకేక. బంగారు తెలంగాణ కోసం సాగిన ఏరువాక. ఏదో ఏమరుపాటున ఓటును చేజార్చుకుని, ‘ఎంతపనాయే’ అని మథనపడుతున్న తెలంగాణ బిడ్డలకు దిక్కుతోచడం లేదు. అందుకే టీవీలకు అతుక్కుపోయారు. ఓ మీడియా చానల్‌కు కేసీఆర్ ఇచ్చిన ఇంటర్వూను టీ-20 క్రికెట్ మ్యాచ్ లైవ్ చూసినట్టు 4 గంటల పాటు ఉత్కంఠభరితంగా చూశారు. టీవీ తెరమీద కేసీఆర్ లెక్కాపత్రం చెప్తుంటే కండ్లప్పగించారు. తెలంగాణ సాధకుడి మాటలతో వారికి గుండె భారం దిగింది. భవిష్యత్తుపై భరోసా కలిగింది. కేసీఆర్ ఇచ్చిన ఆ టీవీ ఇంటర్వ్యూ వెయ్యి ఎన్నికల సభల పెట్టు అని చెప్పాలి. ఇంటింటా కేసీఆర్ గొంతు మారుమోగింది. ప్రతిఒక్కరికీ ఓ పెద్దదిక్కు పక్కన కూసుండి ‘నేనున్న తియ్యి బిడ్డా నీకేమైతది’ అని భుజం తట్టినట్టు అయ్యింది. దటీజ్ కేసీఆర్.
అపజయాల్నే సోపానాలుగా మలచుకుని అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ కోటను ముట్టడించిన సాహసి కదా.. తెలంగాణకు మహోజ్వల శకాన్ని సాధించిన ప్రగతి పిపాసి కదా.. ఇప్పుడేదో చిన్న విరామం వస్తే ప్రత్యర్థులు రెచ్చిపోయి అత్యాశతో బీఆర్ఎస్ కథ ఒడిసిపోయిందని వెర్రికూత లు కూస్తున్నారు. కానీ, కేసీఆర్ వారికి దీటైన సమాధానమిచ్చారు. ఓటమికి భయపడి కాడిపడేసే బాపతు కాదు కేసీఆర్. అట్లయితే తెలంగాణ వచ్చునా, సమున్నతంగా నిలుచునా? అందుకే బంగారు తెలంగాణ సం పూర్ణంగా సాకారం అయ్యేంత వరకు నా పోరాటం ఆగదు అని ధీమాగా చెప్పారు.
మాటల్లో పెట్టి ఓటును మాయ చేసే కేటుగాళ్ల వలలో చిక్కి విలవిలలాడుతున్న తెలంగాణకు కేసీఆర్ మాట ఓ ఊరట. తెలంగాణ చరిత్రతో పెనవేసుకున్న దార్శనిక నాయకత్వం తనది. ఆ చరిత్రను పలకపై బలపం రాతల్లా చెరిపేయాలనుకుంటే ఎలా కుదురుతుంది? తన ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణను చెరిపేయాల్సిందేనని కుండబద్దలు కొట్టారు కేసీఆర్. ఆయన ప్రజాసేవ అనే బ్యాడ్జీ తగిలించుకున్న సాదాసీదా రాజకీయ నేత కాదు. తెలంగాణను అణువణువూ నింపుకొన్న స్వాప్నికుడు. అందుకే ఆగమైపోయిన బతుకుల్ని చీకట్లోంచి బయటపడేసే దారిదీపమూ తానే అవుతానని తేల్చిచెప్పారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు. వారి చేతగానితనాన్ని ఎండగట్టారు. ప్రజలకు ఎవరు ఏమిటో తెలిసిపోతున్న తరుణంలో కాంగ్రెస్ నేతల గుండెల్లో కేసీఆర్ మాటలు శతఘ్నులై పేలుతున్నాయి.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల హోరులో కొందరు నేతలు మాటలు జారుతున్నారు. అలాంటి మరుగుజ్జు నేతలకు హుందాతనంలో పాఠాలు చెప్పారు కేసీఆర్. ఇంకా మారకపోతే ప్రజాక్షేత్రంలో గుణపాఠాలు తప్పవని మందలించారు. ప్రజలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలకు కర్తవ్య బోధ చేశారు. ప్రజలు రికార్డు స్థాయిలో పెద్దసంఖ్యలో వీక్షించారని నివేదికలు వస్తున్న కేసీఆర్ టీవీ ఇంటర్వ్యూ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిందనే విశ్లేషణలూ వినవస్తున్నాయి. నైరాశ్యాన్ని వదిలించి ఉత్సాహోద్వేగాలు నింపి ముందుకు నడిపించడమే కదా నాయకుడి లక్షణం. అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య!