నా ఎత్తు మీద ఉన్న ధ్యాస రైతుల ధాన్యం కొనుగోలు చేయడంలో చూపెట్టు. భువనగిరిలో ఎస్సీ మహిళలపై అరాచకాలు జరుగుతున్నా, 280 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలె. అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు గాల్లో తేలుతున్నరు. ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్తే భూమ్మీదికి వస్తరు.
-మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao | మెదక్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ‘అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం వద్దకు శుక్రవారం రాజీనామా పత్రంతో నేను వస్తా.. దమ్ముంటే నువ్వు వస్తావా?’ అని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. ‘ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆరు హామీలు అమలు చేస్తే అమరవీరుల స్తూపం వద్దకు రా.. రాజీనామా లేఖలను ఇద్దరం మేధావుల చేతిలో పెడదాం.. నువ్వు చెప్పినవి అమలు చేస్తే నా రాజీనామా లేఖను ఆ మేధావులే స్పీకర్‌కు ఇస్తరు. చేయకుంటే నీ రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇస్తరు. దానికి సిద్ధమేనా అని అడుగుతున్నా. నువ్వు మాట మీద నిలబడేవాడివి అయితే రా.. రాకుంటే తెలంగాణ ప్రజలకు అర్థమైతది. కొడంగల్‌లో రాజకీయ సన్యాసం తీసుకుంటానని తోక ముడిచినట్టే, ఇప్పుడూ అదే అవుతుంది’ అని ఎద్దేవా చేశారు.
గురువారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ధ్యాన్‌చంద్ విగ్రహం నుంచి రాందాస్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తాలో హరీశ్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాకు కేసీఆర్ ఏం చేశారని మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డిని మెదక్ గడ్డ మీదికి తీసుకొచ్చిన ఘనత గులాబీ జెండాకే దకుతుందని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాగా ఏర్పడటం వల్లే నామినేషన్ కోసం రేవంత్‌రెడ్డి మెదక్‌కు వచ్చిన విషయం గమనించాలని అన్నారు.
‘మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలు చేసి మూడు జిల్లాలకు మూడు మెడికల్ కళాశాలలు మంజూరు చేసింది కేసీఆరే. రూ.100 కోట్లతో మెదక్‌కు రైలు సౌకర్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దే. మెదక్‌లో నాలుగు లేన్ల రోడ్డు, హల్దీవాగులోకి నీళ్లు అందించిందీ బీఆర్ఎస్ సర్కారే’ అని వివరించారు. 1952లో బీహెచ్ఈఎల్ ఏర్పాటైతే, ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన 1980లో ఏర్పాటు చేశారని రేవంత్ చెప్పడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. స్రిప్ట్ రాసేవానికి లేకున్నా, చదివేవారికి బుద్ధి ఉండాలని చురక అంటించారు. ‘నీ ఇజ్జత్ పోయినా ఫర్వాలేదు. సీఎం కుర్చీ ఇజ్జత్ తీస్తున్నవ్’ సీఎం రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఎకడికి వెళితే అకడ దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నారని, రేవంత్ ఎన్ని ప్రమాణాలు చేసినా ప్రజలు నమ్మబోరని హరీశ్ అన్నారు. ‘నా ఎత్తు మీద ఉన్న ధ్యాస రైతుల ధాన్యం కొనుగోలు చేయటంలో చూపెట్టు. భువనగిరిలో ఎస్సీ మహిళలపై అరాచకాలు జరుగుతున్నా, 280 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఆటో కార్మికుల ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలె’ అని విమర్శించారు. అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు గాల్లో తేలుతున్నారని, ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెబితే భూమ్మీదికి వస్తారని మండిపడ్డారు.
బీజేపీ మాటలు నమ్మితే నీళ్లు లేని బావిలో దూకినట్టేనని హరీశ్‌రావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక మెడికల్, నర్సింగ్ కళాశాల కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. దుబ్బాకలో ఎడ్లు, నాగలి ఇస్తామని మోసం చేసిన రఘునందన్‌రావుకు ప్రజలు బుద్ధి చెప్పారని, ఎంపీ ఎన్నికల్లో సైతం బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు తకువ కాలంలోనే నీళ్లు ఏవో, పాలు ఏవో తెలిశాయని, టీవీ 9 చర్చలో కాంగ్రెస్ మోసాలను కేసీఆర్ కండ్లకు కట్టినట్టు వివరించారని గుర్తు చేశారు. కేసీఆర్ బస్సుయాత్రకు అపూర్వ స్పందన లభిస్తున్నదని, పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవటం ఖాయమని తెలిపారు.
ఉన్న జిల్లాలను ఎత్తివేసేందుకు రేవంత్‌రెడ్డి సరార్ కుట్ర చేస్తున్నదని, ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. ఎంపీగా పోటీ చేసే అభ్యర్థుల్లో ఒకరు బ్లాక్‌మెయిలర్ అని, ఒకరు 6వ తరగతి అని, మన మాజీ కలెక్టర్ అయితేనే పార్లమెంట్లో మన హకుల కోసం పోరాటం చేస్తారని చెప్పారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌గా విశేష సేవలు అందించిన వెంకట్రామిరెడ్డి ప్రజాసేవ చేసేందుకు వస్తున్నారని, రూ.100 కోట్ల ట్రస్టు ద్వారా ఎంతో మంది పేదలకు మేలు జరుగుతుందని, ఆయనను ఆశీర్వదించాలని కోరారు. ర్యాలీలో ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింతాప్రభాకర్, మహిపాల్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ హేమలతాశేఖర్‌గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, చంద్రాగౌడ్, బట్టి జగపతి పాల్గొన్నారు.