గజ్వేల్, ఫిబ్రవరి 20: తెలంగాణను సస్యశ్యామలం చేయాలని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి బీడు భూములకు సాగునీరు అందించిన జలశేఖరుడు కేసీఆర్ అయితే రెండేండ్లలో రైతులను పట్టించుకోకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ పాలనలో కర్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణకు జీవనాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అనేక ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి కాల్వలు, వాగుల ద్వారా సాగునీళ్లు అందించడంతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో లక్షలాది ఎకరాల్లో పంటలుసాగయ్యాయన్నారు.
కానీ నేడు వేసవి సమీపిస్తున్నా ప్రాజెక్టుల ద్వారా సాగునీళ్లు ఇవ్వడంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కిందని, హామీలు ఎప్పుడు అమలవుతాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోస పడుతున్నారని, ఆత్మహత్యలతో కుటుంబాలు కన్నీళ్లు కారుస్తున్నాయని, కరెంట్ రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు సకాలంలో ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వడం లేదని, కరెంట్ సక్రమంగా సరఫరా చేయకపోవడంతో రైతులు పొలాల వద్దనే పడిగాపులు కాస్తున్నారన్నారు.
ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే రాబోయే రెండు మాసా ల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో చూడాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. కేసీఆర్ హయాంలో రైతులు అడగకముందే మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి కూడవెళ్లి, హల్దీవాగుల్లోకి సాగునీళ్లు విడుదల చేస్తే పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో వరి సాగు చేశారన్నారు.
కొండపోచమ్మ కాల్వ ద్వారా నీటిని విడుదల చేయడంతో జగదేవ్‌పూర్, ఆలేరు, భువనగిరి, నల్లగొండ జిల్లాలోని పలు ప్రాం తాల రైతులకు మేలు చేకూరిందన్నారు. మల్లన్నసాగర్ నుంచి కొడకండ్ల వద్ద కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల చేయడంతో గజ్వేల్, దుబ్బాక, మిరుదొడ్డి, మానేరు డ్యామ్ వరకు సాగు నీటి ప్రవాహం ఉండేదన్నారు. మండుటెండల్లో సాగునీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. సంగారెడ్డి కాల్వ ద్వారా రామాయంపేట వెళ్లే కాల్వలోకి నీటిని విడుదల చేస్తే 50కి పైగా గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండాయన్నారు.