Crime News : పన్నేండేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు పోలీసుల ఎన్కౌంటర్ (Police Encounter) లో హతమయ్యాడు. ఉత్తర్‌ప్రదేశ్ (Uttarpradesh) లోని బులంద్‌షహర్ (Buland Shahar) లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు చోలా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫతేపూర్ జదౌన్కు చెందిన మోను (Monu) గా పోలీసులు గుర్తించారు.
అధికారుల వివరాల ప్రకారం.. స్థానిక గులాథీ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. వారిని ఆపేందుకు ప్రయత్నించగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో మోను తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్రవాహనంపై ఉన్న రెండో వ్యక్తి అప్రమత్తమై అక్కడి నుంచి పరారయ్యాడు.
గాయాలతో ఉన్న మోనును వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాల్పుల్లో ఎస్ఐ సందీప్‌కుమార్, కానిస్టేబుల్ నరేంద్రకుమార్ గాయపడ్డారు. ఆగస్టు 1న జరిగిన బాలిక అత్యాచారం, హత్య కేసులో మోను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే అతడి ఆచూకీ కోసం డీఐజీ రూ.50 వేల రివార్డు ప్రకటించారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.