హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసేందుకు విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు అంగీకరించాయి. పీఆర్సీ-2026 కమిటీని త్వరలోనే నియమిస్తామని హామీ ఇచ్చా యి. విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల సమస్యల పరిష్కారంలో భాగంగా విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు బుధవారం, తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ నేతలతో చర్చలు జరిపారు. ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, జెన్కో సీఎండీ హరీశ్, దక్షిణ డిస్కమ్ సీఎండీ జితేశ్ వీ పాటిల్, ఉత్తర డిస్కమ్ సీఎండీ వరుణ్‌రెడ్డి చర్చలు జరిపారు.
ఆర్టిజన్ల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు యాజమాన్యం అంగీకరించింది. ఏపీఎస్ఈ సర్వీస్ రూల్స్ అమలుపై న్యాయ సలహా తీసుకొని, తగిన నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్నకు మార్పుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని, 15 రోజు ల్లో బదిలీ ఉత్తర్వులు, రెగ్యులర్ ప్రమోషన్లు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అన్ని క్యాడర్లల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు చర్చ లు తీసుకుంటామని పేర్కొన్నది. పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు సాయిబాబా, శ్రీధర్, రత్నాకర్‌రావు, బీసీరెడ్డి, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్ బుధవారం సీఎస్ సంజయ్‌జాజుతో భేటీ అయ్యారు. సచివాలయంలో సీఎస్ చాంబర్లో సమావేశమై చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పీఆర్సీ నివేదికను తెప్పించుకోవాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది. అయితే ఉద్యోగుల జేఏసీ నేతలతో చర్చలకు ముందే శివశంకర్ భేటీ అయ్యారు. పీఆర్సీ కమిటీ సిద్ధం చేసిన నివేదికను పరిశీలించిన సీఎస్ ఆయా నివేదికలో కొన్ని మార్పులు సూచించినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.