కాంగ్రెస్ సర్కార్‌కు కౌంట్‌డౌన్
హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా రేవంత్‌రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నడు. నా గడ్డంపై వ్యాఖ్యలు చేయడం తప్ప రాష్ట్ర సమస్యలపై దృష్టి పెడుతలేడు. ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు నా గడ్డం ఏమైనా అడ్డమా? మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు, రైతు బంధు, రూ.4 వేల పెన్షన్ ఇచ్చేందుకు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద పేద ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చేందుకు నా గడ్డం నీకేమైనా అడ్డమవుతున్నదా?
- 500 రోజుల తర్వాత సీఎంగా కేసీఆర్
- వరంగల్ జనచైతన్య సభలో కేటీఆర్
- మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఖతం చేద్దాం
- పేదలు, రైతులు సంతోషంగా ఉండే రోజులొస్తయ్
- మన నాయకుడు కేసీఆర్‌తోనే మంచి తెలంగాణ
- ఆయన ఉంటేనే తల్లి దగ్గర బిడ్డ ఉన్నట్టు రాష్ట్రం
- కోటిమంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తానన్న సీఎం
- లక్షాధికారుల్ని చేసినా రాజకీయ సన్యాసం తీసుకుంటా
- రేవంత్‌రెడ్డి, పొంగులేటి బిడ్డల కోసమే ఇంటర్ రద్దు
- రాష్ట్రంలో 4.71 లక్షల ఆసరా పెన్షన్లకు కోత పెట్టి..
- 4.63 లక్షల మందికి కొత్తగా ఇస్తున్నమంటున్నరు
- హామీల అమలుకు సీఎంకు నా గడ్డం అడ్డం అట!
- అసలైన ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ ఉన్న సిటీ వరంగల్
- ఈ నగరం అభివృద్ధి బాధ్యతను నేనే తీసుకుంటా!
- హనుమకొండ జనచైతన్య సభలో కేటీఆర్ హామీ
- పార్టీలోకి ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ తిరుపతిరెడ్డి
హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా రేవంత్‌రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నడు. నా గడ్డంపై వ్యాఖ్యలు చేయడం తప్ప రాష్ట్ర సమస్యలపై దృష్టి పెడుతలేడు. ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు నా గడ్డం ఏమైనా అడ్డమా? మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు, రైతు బంధు, రూ.4 వేల పెన్షన్ ఇచ్చేందుకు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద పేద ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చేందుకు నా గడ్డం నీకేమైనా అడ్డమవుతున్నదా?
-కేటీఆర్

హనుమకొండ, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని మరచి ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ పని అయిపోయిందని, కాంగ్రెస్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. సరిగ్గా 500 రోజుల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టంచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తల్లి దగ్గర పిల్ల ఉన్నట్టుగా రాష్ట్రం బాగుంటుందని, పేదలు, రైతులు మళ్లీ సంతోషంగా ఉంటారని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి బిడ్డలు పెడుతున్న స్కూళ్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వ్యవస్థను రద్దు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు రాబోయే ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏకశిల విద్యా సంస్థల అధినేత గౌరు తిరుపతిరెడ్డి బీఆర్ఎస్లో చేరిక సందర్భంగా హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన జన చైతన్య సభలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తిరుపతిరెడ్డితోపాటు పలువురు మాజీ కార్పొరేటర్లు ముష్కమల్ల అరుణ సుధాకర్, భోగి సువర్ణ సురేశ్, వస్కుల బాబు, వీర భిక్షపతి, వివిధ పార్టీల నాయకులకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం 1,200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ పెద్దల ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే అధిష్ఠానాల మెప్పు పొందడమే ఆ రెండు పార్టీల నాయకులకు ముఖ్యమైందని మండిపడ్డారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారికి బాడీగార్డుగా మారుతారని దుయ్యబట్టారు. కుర్చీలు సరి చేయడం, టిష్యూ పేపర్లు తీసి చేతుల్లో పట్టుకోవడం, సెక్యూరిటీ వాళ్లతో పక్కకు నెట్టించుకోవడం చేస్తున్నారని ఎద్దేవాచేశారు.
రాహుల్‌గాంధీ బండి మీద పోతుంటే రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, వివేక్ వెనుక ఉరుకాల్సిన దుస్థితి ఏర్పడిందని దెప్పిపొడిచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తన కంటే ఆరేండ్లు చిన్నవాడైన అమిత్‌షా కాళ్లు మొక్కడమేందని ప్రశ్నించారు. కాకతీయుల పౌరుషానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఓరుగల్లు గడ్డపై కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, కాకతీయ కళా తోరణాన్ని తొలగించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీని ఖతం చేద్దామని పిలుపునిచ్చారు.

Ktr
కాంగ్రెస్ పాలనలోఅన్నీ సున్నా
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేండ్లలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసిందని, కృత్రిమ కరువు తెచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవడంలో విఫలమైందని విమర్శించారు. చెరువులు, రిజర్వాయర్లను నింపి రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వానికి సరైన ప్రణాళిక, చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కరువు వచ్చిందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దేవాదుల పంపులు, కన్నెపల్లి మోటర్లను సమర్థంగా వాడుకొని నీటిని వినియోగించుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, విద్యార్థినులకు సూటీలు, విద్యార్థులకు రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం హామీలను కాంగ్రెస్ మరిచిపోయింది. మొదటి ఏడాది లక్షన్నర, రెండో ఏడాది మరో లక్షన్నర, మూడో ఏడాది లక్షా 20 వేల పెన్షన్లు తొలగించింది. మొత్తం 4.71 లక్షల పెన్షన్లకు కోత పెట్టింది. కొత్తగా 4.63 లక్షల పెన్షన్లు ఇచ్చినట్లు చెప్తున్నది. పెన్షన్లు పెంచామని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ మంత్రులు వాస్తవాలు మాట్లాడాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 4 లక్షల 71 వేల పెన్షన్లు తొలగించారు. కొత్తగా 4 లక్షల 63 వేల పెన్షన్లు మాత్రమే ఇచ్చారు.
ఈ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ల లబ్ధిదారులను పెంచినట్టా? తగ్గించినట్టా?’ అని ప్రశ్నించారు. ‘కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రూ.2 వేల పెన్షన్‌ను కొనసాగిస్తూ, కొత్తగా పెన్షన్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. వృద్ధులకు రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇస్తామన్న హామీ ఏమైంది? రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్తున్నడు. కోటీశ్వరులు కాదు కదా లక్షాధికారులనైనా చేయలే. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి 36 నెలలు గడిచినా అమలు చేయలే. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం ఒకో మహిళకు రూ.85,500 బకాయి పడ్డది. వచ్చే రెండేండ్లవి కలిపి మహిళలకు రూ.1.50 లక్షలు చెల్లించాలి. ఇప్పటికైనా ఒక్కో మహిళకు లక్ష రూపాయలివ్వాలి. మహిళలను లక్షాధికారులుగా చేసినా శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అని సవాల్ చేశారు.

Ktr
హామీల అమలుకు నా గడ్డం అడ్డమా?
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తన గడ్డంపై వ్యాఖ్యలు చేయడం మినహా రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టడం లేదని ఎద్దేవాచేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు తన గడ్డం ఏమైనా అడ్డమా? అని ప్రశ్నించారు. ‘మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు, రైతు బంధు, రూ.4 వేల పెన్షన్ ఇచ్చేందుకు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద పేద ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చేందుకు నా గడ్డం నీకేమైనా అడ్డమవుతున్నదా? రాష్ట్రంలో కరువు, రైతుల సమస్యలు, నిరుద్యోగం, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యమంత్రికి పట్టింపు లేదు.
హామీల గురించి అడిగితే పేగులు మెడలో వేసుకుంటా, గుడ్లు పీకి గోటీలాడుకుంటా అనుడు, బూతులు మాట్లాడుడు తప్ప రాష్ట్రానికి రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదు’ అని ఎద్దేవాచేశారు. ‘రేవంత్‌రెడ్డి నిజాయితీ గల మోసగాడని, హామీలు ఇచ్చి నమ్మించి మోసం చేశాడు. చెప్పినట్టే ఎనుకటి ఇందిరమ్మ రోజులు మళ్లీ తెచ్చిండు. కరెంట్ కోతలు, నీళ్ల గోస, యూరియాకు చెప్పులు నిలబెట్టే పాత రోజులను వాసప్ తెచ్చిండు. పాలిచ్చే బర్రెను వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు అంటున్నరు’ అని తూర్పారబట్టారు.
ఫ్యూచర్ ఉన్న సిటీ వరంగల్
హైదరాబాద్ సమీపంలో కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం భూములు సేకరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాని పేరు మార్చి ఫ్యూచర్‌సిటీ అని ప్రచారం చేసుకుంటున్నదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజమైన భవిష్యత్తు ఉన్న నగరం వరంగల్ అని చెప్పారు. ఫ్యూచర్ సిటీ వరంగల్ అని, వరంగల్‌ను రాష్ట్రంలోనే ప్రధాన పారిశ్రామిక, ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యతను భవిష్యత్తులో తాను తీసుకుంటానని ప్రకటించారు. ‘కేసీఆర్ పాలనలో వరంగల్‌ను రాష్ట్రంలోనే ప్రధాన పారిశ్రామిక, విద్య, వైద్య, ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు పునాదులు వేసినం.
24 అంతస్తులు, 2,250 పడకలు, 35 వైద్య విభాగాలతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను 90 శాతం పూర్తి చేసినం. జనగామ, మహబూబాబాద్ దవాఖానల పనులు 90 శాతం పూర్తయినయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసి వైద్య విద్యకు పెద్దపీట వేసింది. మడికొండ ఐటీ పారులో ఎల్అండ్టీ మైండ్ ట్రీ, సైయెంట్, టెక్ మహీంద్రా, క్వాడ్రంట్ వంటి కంపెనీలను తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించినం.
నేత కార్మికులు ఉపాధి కోసం భీవండి, సూరత్‌లకు వలస పోకుండా ఉండేందుకు దేశంలోనే అతి పెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పారును వరంగల్‌లో ఏర్పాటు చేసినం. కిటెక్స్, గణేశా ఎకోస్పియర్, యంగ్ వన్ వంటి పరిశ్రమలను తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించినం. మిషన్ భగీరథ ద్వారా వరంగల్‌లో తాగునీటి సమస్యను పరిషరించినం. రూ.150 కోట్లతో రెండు సమీకృత కలెక్టరేట్లు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినం. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో వరంగల్‌కు ఒక కొత్త ఐటీ కంపెనీ, ఒక కొత్త పరిశ్రమ తీసుకురాలేపోయింది.
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పటికే ఉన్న కంపెనీలు మూతపడుతున్నయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మిగిలిన పనులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతున్నది. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ హాస్పిటల్‌ను పట్టించుకోవడం లేదు గానీ బినామీ మెడికవర్ హాస్పిటల్‌ను రేవంత్‌రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రారంభించిండు’ అని విమర్శించారు.

Ktr
కాళోజీ కళాక్షేత్రంలో కుడా ఆఫీసా?
ప్రజాకవి కాళోజీ నారాయణ ‘పుట్టుక నీది చావు నీది.. బతుకంతా దేశానిది’ అని అద్భుతంగా ఇదే గడ్డపై గర్జించి తెలంగాణకు ఊపిరిలూదారని కేటీఆర్ గుర్తుచేశారు. రవీంద్రభారతిని తలదన్నేలా హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందని చెప్పారు. కవులు, కళాకారులు, రచయితల కోసం బీఆర్ఎస్ నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రభుత్వ కార్యాలయంగా మార్చాలనుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరు మీద 1,217 మంది కూర్చునే సామర్థ్యంతో నిర్మించిన కళాక్షేత్రంలో కుడా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం సరికాదని చెప్పారు. వరంగల్ ప్రజల వ్యతిరేకత, ఇప్పటి బీఆర్ఎస్ జన చైతన్య సభతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనకి తీసుకున్నదని తెలిపారు. కాకతీయుల కళాతోరణం, కాళోజీ వారసత్వం, వరంగల్ సాంసృతిక వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని సూచించారు.
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని రేవంత్‌రెడ్డి చెప్తున్నడు. కోటీశ్వరులు కాదు కదా లక్షాధికారులుగానైనా చేయలే. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న ఎన్నికల హామీని 36 నెలలు గడిచినా అమలు చేయలే. ఈ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకో మహిళకు రూ.85,500 బాకీ పడ్డది. వచ్చే రెండేండ్లవి కలిపి ఒక్కో ఆడబిడ్డకు రూ.1.50 లక్షలు చెల్లించాలె. కోటీశ్వరులకు బదులు లక్షాధికారులుగా చేసినా నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా.
-కేటీఆర్
కాంగ్రెస్‌ది అవినీతి ప్రభుత్వం
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అవినీతి ఏ స్థాయిలో పెరిగిపోయిందో ఆ పార్టీ నాయకులే చెప్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఐదు లక్షల కోట్ల నుంచి పది లక్షల కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చెప్తున్నారని గుర్తుచేశారు. 20 శాతం కమీషన్ ఇవ్వనిదే పనులు జరుగడం లేదని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సోదరులు పారిశ్రామికవేత్తలను తుపాకీ పెట్టి బెదిరించి వందల కోట్లు డిమాండ్ చేస్తున్నారని మాజీ మంత్రి కొండా సురేఖ కూతరు బయటపెట్టారని తెలిపారు.
మంచిరేవులలోని దేవాలయ భూము ల వ్యవహారంతోనే తనను పదవి నుంచి తొలగించారని కొండా సురేఖ తెలిపారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిషరించాల్సిన ప్రభుత్వం కమీషన్ల వసూళ్లలో ము నిగిపోయిందని నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి బిడ్డ, మంత్రి పొంగులేటి బిడ్డ ప్రైవేట్ స్కూళ్ల కోసమే ఇంటర్మీడియట్ విద్యను రద్దు చేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Ktr
ప్రజల సమస్యలను పరిషరించాల్సిన ప్రభుత్వం కమీషన్ల వసూళ్లలో మునిగిపోయింది. సర్కార్ అవినీతి బాగోతాన్ని సొంత కాంగ్రెస్ పార్టీ వాళ్లే బయటపెడుతున్నరు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిడ్డ, మంత్రి పొంగులేటి బిడ్డ ప్రారంభిస్తున్న ప్రైవేట్ స్కూళ్ల కోసమే ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేస్తున్నది. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఇలాంటి నిర్ణయాలను వెంటనే వెనకి తీసుకోవాలె.
-కేటీఆర్
ఓరుగల్లు గడ్డతో ఉద్యమ అనుబంధం
వరంగల్‌తో తనకు విడదీయలేని అనుబంధం ఉందని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్‌లో కాగడాల ప్రదర్శనలో కవాతు చేసిన రోజులను యాదిచేసుకున్నారు. 17 ఏండ్ల క్రితం నవంబర్ 29న అరెస్టయి వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీగా గడిపిన సందర్భం ఇప్పటికీ గుర్తున్నదని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం సాగిన ప్రతి కీలక సందర్భంలోనూ వరంగల్ అండగా నిలిచిందని, ఉద్యమ మహాగర్జన నుంచి తెలంగాణ రజతోత్సవ సభ వరకు ఓరుగల్లు ప్రజలు అందించిన మద్దతును ఎప్పటికీ మరువలేమని పేరొన్నారు.
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అధ్యక్షతన జరిగిన జన చైతన్య సభలో శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, డీఎస్.రెడ్యానాయక్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, కే వాసుదేవరెడ్డి, సుందర్‌రాజుయాదవ్, రామస్వామినాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, పెద్ది స్వప్ప, జీ కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

