చేగుంట, ఫిబ్రవరి 20: సాగునీటి కోసం రైతులకు పాట్లు తప్ప డం లేదు. కాల్వల ద్వారా వెంటనే గొలుసుకట్టు చెరువులు నింపి యాసంగి పంటలకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం వెంకటాపూర్, చేగుంట మండలం పూలిమామిడి గ్రామాలకు చెందిన పలువురు రైతులు పురుగు మందు డబ్బాలతో మెదక్ జిల్లా చేగుంట మండలం రామాయంపేట, గజ్వేల్ రహదారిలోని పులిమామిడి చౌరస్తాలో శుక్రవారం ధర్నా చేశారు.
మూడు గంటల పాటు ధర్నా చేయడంతో రహదారి పొడవునా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ నీరు విడుదల చేసి కాల్వల ద్వారా గొలుసుకట్టు చెరువులు నింపి సాగు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండేండ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొందని, ఈ సంవత్సరం పంటలకు సాగునీరు అందించకుంటే పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉందన్నారు. స్థానిక తహసీల్దార్ శివప్రసాద్, ఆర్ఐ జయభారత్‌రెడ్డి, ఇరిగేషన్ ఏఈ మమత, డీఈ నరేశ్ అక్కడికి చేరుకొని రైతులకు ఎంతనచ్చ చెప్పినా వినలేదు.
చేసేదేమిలేక అధికారులు కాల్వలను పరిశీలించేందుకు వెళ్లారు. అనంతరం చేగుంట ఎస్సై చైతన్యకుమార్ ఉన్నత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో ఇరుగ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.