హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పెండింగ్లోని నిధులను విడతలవారీగా మంజూరు చేస్తున్నది. ఈ క్రమంలోనే శుక్రవారం మూడో విడతకుగాను రూ.387.53 కోట్లను విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తం రూ.1,034.42 కోట్ల మేర నిధులు అందాయి. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగేందుకు ఈ నిధులు కీలకంగా ఉపయోగపడనున్నాయి.
ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, అంతర్గత రహదారుల మరమ్మతులు వంటి పనులకు ఈ నిధులను వినియోగిస్తారు. అయితే, ఇంకా సుమారు రూ.2,000 కోట్ల మేర విడుదల చేయాల్సిన నిధులు పెండింగ్లో ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కొనసాగాలంటే నిధుల విడుదల అవసరమని ఆమె స్పష్టంచేశారు.
తొలివిడత రూ.323.45 కోట్లు
రెండో విడత రూ.323.44 కోట్లు
మూడోవిడత రూ.387.53 కోట్లు
మొత్తం వచ్చినవి రూ.1,034.42 కోట్లు
ఇంకా పెండింగ్లోసుమారు 2,000 కోట్లు