హయ్యర్ ఇన్‌కం వస్తున్నవారు గొప్పలకు పోయి గోతిలో పడ్డ సందర్భాలు కోకొల్లలు. వేరే ఏ రంగంలో పెట్టినా ఇంత రాదు కదా అని భ్రమలో జీవిస్తున్నవారు చాలా మంది ఉంటారు. ప్రస్తుతం ఉన్న రంగాన్నే అతిగా నమ్ముకొని డబ్బును మరో చోట పెట్టుబడి పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. బిజినెస్‌ను మరింత విస్తృతం చేసుకుందామని మరో ఆలోచన లేకుండా అగ్రెసివ్ స్టెప్ తీసుకుంటారు. ఏదైనా తేడా కొడితే మొత్తం పేక మేడలా కూలిపోతుంది. హయ్యర్ ఇన్‌కం వస్తున్నవాళ్లు.. అది కూడా బిజినెస్ చేసేవాళ్లే ఇలాంటి రిస్క్‌లో పడతారు. ఇలా ఓసారి పోగొట్టుకుంటే మళ్లీ రావడమనేది చాలా కష్టం. ఒకే రంగంలో ఇన్వెస్ట్ చేయడం ఎంత ప్రమాదకరమో తెలిపే ఈ వారం ‘పైసల ముచ్చట్లు’ ఇవి…
ఒంటరిగా బిజినెస్ చేసేవారికి బాస్ అనేవారు ఎవరూ ఉండరు.. ఎవరూ గైడ్ చేసే పరిస్థితి ఉండదు. సొంత బిజినెస్‌లో వీరు తీసుకునే నిర్ణయాలే ఫైనల్. ఆదాయం వస్తుంది కదా అన్న ఉత్సాహంలో చాలా మంది లెక్కాపత్రం లేకుండా పెట్టుబడి పెట్టేస్తూ చివరకు మళ్లీ జీరో అయిపోతుంటారు. ఇలా హయ్యర్ ఇన్‌కం ఉన్నవాళ్లే ఆర్థికపరమైన తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది.
Financial Management | కొవిడ్‌కు ముందు రోజులవి.. ఓ పేరున్న బిజినెస్‌కు ప్రొప్రైటర్‌షిప్ తీసుకున్నాడు ముకుందరావు. ఒకటి కాదని రెండు షాపులు నిర్వహిస్తున్నాడు.. బాగా నడుస్తున్నాయి. ఖర్చులన్నీ పోను నెలకు ఐదారు లక్షల దాకా మిగులుతున్నది. పెద్దగా ఇష్టం లేకున్నా స్నేహితుడు ఆనందరావు ఇచ్చిన సలహా మేరకు మంత్లీ రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కడుతున్నాడు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలన్న మరో మిత్రుడు విలాస్‌రావు అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించాడు.. పైపాటుగా యుద్ధాలు వస్తే మనం పెట్టిన ఫండ్ సంగతేంటి? అన్న ప్రశ్నను సంధించాడు. ముకుందరావు లేవనెత్తిన సందేహాలన్నీ విలాస్‌రావు తీర్చడంతో చిన్నగా రూ.30 వేలతో ప్రారంభిద్దాం అని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేశాడు. కట్ చేస్తే.. కొవిడ్ తర్వాత, నాలుగేళ్లకు ఓ సందర్భంలో.. విలాస్‌రావు, ముకుందరావు మ్యూచువల్ ఫండ్స్‌పై రివ్యూ చేసుకుంటున్నారు. గతంలో పెట్టిన రూ.30 వేలు ఆరింతలయ్యింది. అప్పుడే లక్షల్లో పెట్టుబడి పెడితే కోట్లల్లో వచ్చేది కదా! అంటూ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశాడు ముకుందరావు. ‘అయ్యో ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఇప్పుడు పెట్టు’.. అన్నాడు విలాస్‌రావు. ఇది విన్న ముకుందరావు ‘ఇప్పుడు పెట్టే పరిస్థితి లేదు. షాప్స్ ప్రొప్రైటర్‌షిప్ కాకుండా మ్యాన్యుఫ్యాక్చరింగ్లోనూ ఇన్వెస్ట్ చేశాను. బిజినెస్ అంతా పోయింది. చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్నాను’.. అని సమాధానమిచ్చాడు.
..ఒక్క ముకుందరావు మాత్రమే కాదు, అసంఘటిత రంగంలో ఒంటరిగా బిజినెస్ చేస్తూ అధికంగా సంపాదిస్తున్న చాలా మందిదీ ఇదే పరిస్థితి. ఇప్పుడున్న బిజినెస్‌నే ఏడాది తిరిగేకల్లా కనీసం రెండు మూడు రెట్లయినా పెంచేద్దామంటూ అప్పటివరకు సంపాదించిందంతా పెట్టుబడిగా పెట్టేస్తారు. అంతే ఏదో నష్టం వాటిల్లుతుంది.. అంతా ఢమాల్. వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్లీ మొదటికొచ్చి పడ్డామన్న సంగతి అప్పుడు బోధ పడుతుంది.
టెన్త్, ఇంటర్మీడియట్ కూడా చదవకుండా నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించేవారు చాలామంది ఉన్నారు. అంత ఇన్నొవేటివ్‌గా బిజినెస్ చేస్తారు కాబట్టే వారు అంతగా ఇన్‌కం పొందుతున్నారు. అధికంగా సంపాదించే స్థాయికి ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా పతనమైనవారి సంఖ్య కూడా పెద్ద మొత్తంలోనే ఉంటున్నది ఈ రోజుల్లో! ఆర్థిక ప్రణాళిక లేకపోవడమే ఇందుకు కారణం. ఉన్న డబ్బంతా ఇన్వెస్ట్ చేసేసి ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్నప్పుడు వారికి మితిమీరిన ఆత్మవిశ్వాసం వచ్చేస్తుంటుంది. అందుకే వచ్చిన లాభాల్లోనుంచి కొంత మరో విధంగా సేవింగ్స్ చేయడంపై దృష్టి పెట్టరు. ఇలాంటి మొండి ధైర్యంతో ఉండటమే వారి కొంప ముంచుతుంది. ఒంటరిగా బిజినెస్ చేసేవారికి బాస్ అనేవారు ఎవరూ ఉండరు.. ఎవరూ గైడ్ చేసే పరిస్థితి ఉండదు. సొంత బిజినెస్‌లో వీరు తీసుకునే నిర్ణయాలే ఫైనల్. ఆదాయం వస్తుంది కదా అన్న ఉత్సాహంలో చాలా మంది లెక్కాపత్రం లేకుండా పెట్టుబడి పెట్టేస్తూ చివరకు మళ్లీ జీరో అయిపోతుంటారు. ఇలా హయ్యర్ ఇన్‌కం ఉన్నవాళ్లే ఆర్థికపరమైన తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది.
అదే ఒక ఉద్యోగిని తీసుకుంటే పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. వీరు ఆర్థికపరమైన చిక్కుల్లో పడే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగి నెలకు రూ.3 నుంచి రూ.4 లక్షల దాకా డ్రా చేస్తున్నట్లయితే ప్రతి నెలా ఓ నలభై వేల రూపాయలైనా ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంటాయి. కంపెనీ షేర్స్, ఈ-షాప్స్ ఉంటే ఆ మార్గంలో కూడా ఆదాయం సమకూరుతుంటుంది. కుటుంబమంతటికీ ఇన్సూరెన్స్ కవరేజీలు ఉంటాయి. ఇలాంటివేవీ అసంఘటిత రంగ వ్యాపారులకు ఉండవు. చుట్టూ తన కింద పనిచేసేవాళ్లే కాబట్టి లాభాలు, సంపాదన గురించి షేర్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉండదు. అన్ని విషయాలూ అందరికీ చెప్పలేరు. స్వయంగా ప్రొప్రైటర్‌షిప్ చేసేవాళ్లు వారి బిజినెస్‌లో వారే కింగ్. పరిస్థితుల కారణంగా ధైర్యం పెరిగిపోతుంది. నాకేంటి ఖర్చులన్నీ పోనూ నెలకు ఐదారు లక్షలు మిగులుతున్నది కదా అన్న ధీమాతో తప్పులు చేసేస్తారు.
హయ్యర్ ఇన్‌కం ఉన్నవాళ్లు రెండు క్యాటగిరీలు ఉంటారు. ఉద్యోగులు.. వ్యాపారులు. వ్యాపారంలో సంఘటిత, అసంఘటిత అని మళ్లీ రెండు రకాలు. అసంఘటిత రంగ వ్యాపారులకు ఆర్థిక స్వేచ్ఛ ఎక్కువ. దీంతో చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా పెట్టుబడులు, ఖర్చులకు పోతారు. చివరికి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతారు. ఇలాంటి వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి మంచివి. అంతేకాకుండా అధిక ఆదాయ వర్గాల వాళ్లు తన లాభాల్లో నెలకు కనీసం 30 శాతం ఇన్వెస్ట్ చేయాలి. ఉన్న బిజినెస్‌లో వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని మరోచోట పెట్టుబడి పెట్టడం కన్నా మంచి మార్గం లేదు.
-ఎం. రాం ప్రసాద్
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in
www.rpwealth.in