Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం (ఏప్రిల్ 26) భ్రమరాంబికా దేవి అమ్మవారికి కుంభోత్సవం జరుగనున్నది. కుంభోత్సవంలో భాగంగా సాత్విక బలిగా గుమ్మడి కాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలతోపాటు అన్నరాశి సమర్పిస్తారు. కుంభోత్సవ ఏర్పాట్లపై గురువారం సాయంత్రం కార్యనిర్వహణాధికారి డీ పెద్దిరాజు సమీక్షించారు.
స్థానిక భ్రమరాంబా సదన్ అతిథి గ్రుహంలో జరిగిన సమీక్షా సమావేశంలో స్థానిక సీఐ ప్రసాదరావు, ఎస్ఐ గంగయ్య యాదవ్, డిప్యూటీ ఈఓ రవణమ్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు వీ రామక్రుష్ణ, మురళీధరరెడ్డి, సహాయ ఈఓలు ఐఎన్వీ మోహన్, ఎం హరిదాస్, బీ మల్లికార్జున రెడ్డి, పీఆర్ఓ టీ శ్రీనివాసరావు, ఇన్ చార్జీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పీవీ సుబ్బారెడ్డి, చంద్రశేఖర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. కుంభోత్సవం కోసం వివిధ విభాగాలు చేసిన ఏర్పాట్లను ఈఓ పెద్దిరాజు సమీక్షించారు.
ఈ సందర్భంగా ఈఓ డీ పెద్దిరాజు మాట్లాడుతూ శ్రీ అమ్మవారి ఉత్సవ సంబంధిత కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరిపించాలని చెప్పారు. దేవాదాయ చట్టాన్ని అనుసరించి జంతు, పక్షి బలులు, జీవ హింస పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు. పక్షి, జంతు బలుల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఈ విషయమై పూర్తి సహాయ సహకారాలు అందించాలని స్థానిక పోలీసు అధికారులను కోరారు.
పక్షి, జంతు బలుల నిషేధాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే దేవస్థానం అధికారులు, సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ పక్షి, జంతు బలుల నిషేధాన్ని అమలు చేయాలని ఈఓ డీ పెద్దిరాజు ఆదేశించారు. ఆలయ మాడ వీధులు, ప్రధాన ద్వారాలు, అంకాళమ్మ ఆలయం, పంచ మఠాల దగ్గర గల మహిషాసుర మర్దిని, రుద్రాక్ష మఠం వద్ద గల చిన్నమస్తాదేవి, పాత వర్క్ షాప్ వద్ద గల సుంకులమ్మ, పాతాళ గంగ మార్గం సమీపంలో వజ్రాల గంగమ్మ, టోల్ గేట్ తదితర చోట్ల దేవాదాయ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.
ఇక జంతుబలి నిషేధంపై భక్తుల్లో అవగాహన కల్పించడానికి టెంపుల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ (మైక్) ద్వారా పక్షి, జంతు బలి నిషేధం అమలు గురించి ప్రచారం చేస్తారు. క్షేత్ర పరిధిలో పక్షి, జంతు బలి నిషేధం గురించి పలు చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు.
కుంభోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంకాలం అమ్మవారి దర్శనాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తుల రద్దీ వల్ల క్యూ లైన్లలో తొక్కిసలాట లేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని దేవస్థాన భద్రతా విభాగం పర్యవేక్షకులను ఈఓ డీ పెద్దిరాజు ఆదేశించారు. క్యూ లైన్ల నిర్వహణకు కూడా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.