Rahul Gandhi : ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై
లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు
గుప్పించారు. గురువారం లోక్‌సభ (Lok Sabha) లో మాట్లాడిన ఆయన.. ఇంధన భద్రత విషయంలో
భారత ప్రభుత్వం అమెరికా (USA) తో రాజీపడిందని ఆరోపించారు. ఈ రాజీతో వివిధ చమురు
సరఫరాదారులతో తన సంబంధాలను నిర్ణయించే అధికారాన్ని అమెరికాకు కట్టబెట్టినట్లు అయ్యిందని
ఆయన మండిపడ్డారు.
అమెరికా – ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో భారత్ సుదీర్ఘ పరిణామాలను
ఎదుర్కోవాల్సి వస్తుందని రాహుల్‌గాంధీ చెప్పారు. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం హార్ముజ్
జలసంధి గుండా జరుగుతుందని, జీవనాడి లాంటి ఆ జలసంధి మూతపడటం తీవ్ర పరిణామాలకు
దారితీస్తుందని అన్నారు. ముఖ్యంగా భారత్‌కు ఎక్కువ ఇబ్బందులు కలుగనున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఎందుకంటే మనం దిగుమతి చేసుకునే చమురు, సహజవాయువులో సింహభాగం హార్ముజ్ జలసంధి నుంచే సరఫరా అవుతుందని చెప్పారు.
నొప్పి ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని, గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే రెస్టారెంట్లు
మూతపడుతున్నాయని రాహుల్‌గాంధీ అన్నారు. వీధి వ్యాపారులపై గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతున్నదని వ్యాఖ్యానించారు. ప్రతి దేశానికి పునాది దాని ఇంధన భద్రతేనని ఆయన నొక్కి చెప్పారు. ఇది చిన్న విషయం కాదని, మనం ఎక్కడి నుంచి చమురు కొనుగోలు చేయాలి..? రష్యా నుంచి కొనాలా వద్దా అనేవి అమెరికా నిర్ణయించడం ప్రమాదకరమని అన్నారు.