నల్లగొండ సిటీ, మార్చి 12 : సిఐటియు నల్లగొండ జిల్లా 13వ మహాసభలు ఈ నెల 14, 15 తేదీల్లో నల్లగొండ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, హమాలీ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కానుగు లింగస్వామి తెలిపారు. గురువారం కనగల్ మండల కేంద్రంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ మహా సభలలో జిల్లాలోని 33 మండలాల నుండి జిల్లా వ్యాప్తంగా వివిధ యూనియన్స్ నుండి 500 మంది ప్రతినిధులు, అఖిల భారత, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. సిఐటియు కేవలం కార్మికుల హక్కులే కాకుండా, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, సామాజిక సంఘాల పోరాటాలకు సంఘీభావంగా అండగా నిలుస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే విధంగా నాలుగు లేబర్ కోడ్ల అమలుకు ప్రయత్నిస్తున్నదన్నారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా గత ఐదు సంవత్సరాలుగా దేశంలో, రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్మికుల పోరాటాల ఫలితంగా వాటిని నివారించగలుగుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ పరిశ్రమలతో పాటు 73 షెడ్యూల్డ్ పరిశ్రమలలో గత ఏడు సంవత్సరాలుగా కనీస వేతనాలు జీఓలను సవరించడం లేదన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, అశా, అంగన్వాడీ, మధ్యాహ్నభోజన కార్మికులు, వీఓఏ, ఉపాధి హామీ, ఫీల్డ్ అసిస్టెంట్లలతో పాటు అనేక రకాల పార్ట్ టైమ్, గౌరవ వేతన ఉద్యోగులకు వేతనాలు పెంచడం లేదన్నారు. భవన నిర్మాణం, హమాలీ, ట్రాన్స్పోర్టు, కార్మికుల సంక్షేమం గాలికి వదిలేసిందన్నారు. అన్నిరకాల అసంఘటిత కార్మికుల హక్కులు కాలరాయబడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సంఘటిత అసంఘటిత రంగాలలో పనిచేసే కార్మికులకు అనేక వాగ్దానాలు చేసిందని, అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయినా వాగ్దానాల అమలుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో శోచనీయమన్నారు.
జిల్లాలో రాబోవు రోజుల్లో కార్మికుల పక్షాన మరిన్ని పోరాటాలు, ఆందోళనలు నిర్వహించేందుకు ఈ నెల 14, 15 తేదీలలో నల్లగొండ పట్టణంలో జరిగే సిఐటియు జిల్లా మహాసభలు వేదిక కానున్నట్లు తెలిపారు. ఈ మహాసభలో కార్మికుల ఆర్ధిక, సామాజిక సమస్యలపై చర్చలు జరగనున్నట్లు చెప్పారు. కార్మిక, కర్షక మైత్రి ద్వారానే పాలకుల దుష్ట విధానాలను తిప్పికొట్టగలమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కనగల్ మండల కన్వీనర్ నేలగొంద రాసి లింగయ్య, పిన్నపురెడ్డి శేఖర్ రెడ్డి, బురుకల నర్సింహ, విజయ్, మల్లికార్జున్, నాగయ్య, పాలకూరి వెంకటేశం, రామలింగయ్య పాల్గొన్నారు.