ఆళ్లపల్లి, ఆగస్టు 2: విధి నిర్వహణలో ఉన్న గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ ఆకస్మికంగా మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదాన్ని నింపింది. ఆళ్లపల్లి మండలంలోని రాయపాడు గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న తుమ్మ రాంబాబు (28) శనివారం విధుల్లో భాగంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమీపంలోని కిన్నెరసాని వాగు వద్దకు వెళ్లారు. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు.
ఆదివారం ఉదయం వాగు వద్దకు వెళ్లిన గ్రామస్థులు రాంబాబు మృతదేహాన్ని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు, అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సహచర ఉద్యోగులు, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా, మధ్యాహ్న సమయంలో కిన్నెరసాని వాగు వద్దకు వెళ్లిన సమయంలో అకస్మా్త్తుగా ఫిట్స్ రావడంతో వాగులో పడి మరణించి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు రాంబాబుకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.