US death row : అమెరికాలో అరుదైన ఘటన జరిగింది. మరణ శిక్ష పడ్డ ఒక ఖైదీకి ఇచ్చిన రెండు విషపు ఇంజెక్షన్లు విఫలమయ్యాయి. రెండు ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత కూడా మహిళా ఖైదీ ప్రాణాలు కోల్పోకపోవడంతో ఇప్పుడు ఆమెను వైద్యులే రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. అమెరికాలో 1995లో జరిగిన ఒక హత్య కేసులో క్రిస్టా పైక్ అనే మహిళకు మరణశిక్ష విధించింది కోర్టు. పైక్, ఆమె బాయ్‌ఫ్రెండ్ కలిసి కొల్లీన్ స్లెమ్మర్ అనే మహిళను హత్య చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు 1996లో పైక్‌కు మరణ శిక్ష విధించింది.
అప్పుడు పైక్ వయసు 19. మరణ శిక్ష అనంతరం పైక్ తరఫు లాయర్లు ఆమె శిక్షను తగ్గించేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. వివిధ కోర్టుల్లో ఇంతకాలం విచారణ సాగుతూ వచ్చింది. చివరకు అమెరికా సుప్రీంకోర్టు పైక్‌కు మరణ శిక్ష ఖరారు చేసింది. దీంతో ఇటీవల ఆమెకు మరణశిక్ష అమలు చేశారు. అక్కడ విషపు ఇంజెక్షన్ ఇచ్చి, సులభంగా ప్రాణం పోయేలా చేస్తారు. అలా, టెన్సెస్సీ జైలులో ఉన్న పైక్‌కు ఒక విషపు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇది ఇచ్చిన కొద్ది సేపటి తర్వాత ప్రాణం పోతుంది. అయితే, వైద్యులు ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆమె మరణించలేదు.
దీంతో నిబంధనల ప్రకారం వెంటనే రెండో ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఆమె బ్రతికే ఉంది. పైక్ స్పృహ కోల్పోయినప్పటికీ, ఆమె గుండె కొట్టుకుంది. అలాగే, గురక శబ్దం కూడా వినిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు, పోలీసు సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను తిరిగి కాపాడేందుకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంలో ఆమె తరఫు లాయర్లు కూడా కోర్టును ఆశ్రయించారు. ఆమె మరణశిక్షను ఆపేయాల్సిందిగా కోరారు. అయితే, దీనికో కారణం ఉంది. సాధారణంగా ఒకే విషపు ఇంజెక్షన్‌తో ప్రాణాలు పోతాయి. ఒకవేళ అలా జరగకుంటే రెండో ఇంజెక్షన్ ఇవ్వాలనే నిబంధన ఉంది.
దీంతో ఆమెకు రెండో ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ ప్రాణాలు పోకపోతే ఏం చేయాలనేది నిబంధనల్లో లేదు. పైక్ రెండు ఇంజెక్షన్ల తర్వాత కూడా బతికి ఉండటంతో ఏం చేయాలో తెలియక ఆమె మరణ శిక్షను ప్రస్తుతానికి వాయిదా వేశారు. ఇది చాలా అరుదైన అంశమని, ఆమె ఇలా మరణాన్ని జయించడం ఆసక్తికర విషయమని వైద్యులు అన్నారు.