Maharashtra : మహారాష్ట్రలో ఘోర విషాదం జరిగింది. సరదాగా బీచ్‌కు పిక్నిక్ వెళ్లిన ఎనిమిది మంది విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. వారి మృతదేహాలను అధికారులు వెలికితీశారు. ఈ ఘటన మహారాష్ట్ర, రాయ్‌గఢ్ జిల్లాలోని దివేగర్ బీచ్‌లో గురువారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. పూనే జిల్లాలోని అలాండిలోని ఒక ప్రైవేటు కోచింగ్ సెంటర్‌కు చెందిన కొందరు 11, 12 తరగతుల విద్యార్థులు రాయ్‌గఢ్ శ్రీవర్ధన్ తాలూకాలోని దివేగర్ బీచ్‌కు పిక్నిక్కు వచ్చారు.
ఇది స్థానికంగా చాలా ప్రముఖమైన పర్యాటక కేంద్రం. మొత్తం 48 మంది విద్యార్థులు ఈ బీచ్‌కు వచ్చారు. వీరిలో 25 మంది అబ్బాయిలు, 17 మంది అమ్మాయిలు, ఆరుగురు టీచర్లు ఉన్నారు. బీచ్‌కు వచ్చిన తర్వాత సముద్ర జలాల్లో ఆడుకునేందుకు కొందరు విద్యార్థులు నీళ్లలోకి వెళ్లారు. ఈ క్రమంలో నీటి లోతును, అలలను అంచనా వేయలేకపోవడంతో ఆ నీటిలోనే కొట్టుకుపోయారు. ఎనిమిది మంది విద్యార్థులు మునిగిపోవడంతో టీచర్లు, తోటి విద్యార్థులు వెంటనే స్థానికులు, రెస్క్యూ బృందాలను అలర్ట్ చేశారు. వారు వేగంగా స్పందించి రంగంలోకి దిగారు.
అక్కడే ఉన్న మహాకాళి వాటర్ స్పోర్ట్స్ ఎంప్లాయిస్, టూరిస్టులు, స్థానికులు కలిసి గల్లంతైన వారి కోసం గాలించారు. ఈ క్రమంలో ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించి, వెలికి తీశారు. మృతదేహాల్ని బొర్లి పంచతన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. సముద్రంపై వారికి అవగాహన లేకపోవడం, లోతును, అలలను అంచనా వేయలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదంపై మహారాష్ట్ర మంత్రి నితీష్ రానే సంతాపం వ్యక్తం చేశారు.