Mamata Banerjee : సర్ విషయంపై, సీఈసీ జ్ఞానేష్ కుమార్ అంశంపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఓట్లను, ఓటర్ల హక్కులను సీఈసీ జ్ఞానేష్ కుమార్ తొలగిస్తున్నాడని, అందువల్ల అతడు జ్ఞానేష్ కుమార్ కాదని, వ్యానిష్ కుమార్ అంటూ అభివర్ణించారు. వ్యానిష్ అంటే తొలగించడం, కనిపించకుండా పోవడం వంటి అర్థాలున్న సంగతి తెలిసిందే.
జ్ఞానేష్ కుమార్ సర్ ద్వారా ఓట్లను తొలగిస్తుండటంతో మమత ఆయనను ఇలా పోల్చారు. అలాగే, సర్ ప్రక్రియసహా వివిధ అంశాలపై మమతా బెనర్జీ మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో తాము వ్యతిరేకించే వరకు సర్ అంశంపై ఎవరూ మాట్లాడలేదన్నారు. సర్ ద్వారా ఓట్లు కోల్పోయిన వారితో కలిసి తాము ఎన్నికల సంఘాన్ని కలిసినప్పుడు వారు తమను అవమానించారని గుర్తు చేశారు. ఇదే సమయంలో జ్ఞానేష్ కుమార్ను తొలగించకుండా రక్షణ కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేశారని మమత గుర్తు చేశారు. అయితే, 147 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం ఈ బిల్లును కేంద్రం ఆమోదించిందన్నారు.
తమకు మద్దతుగా ఉన్న ప్రాంతాల్లో సర్ పేరిట ఓట్లు తొలగించారని మమత ఆరోపించారు. సర్ తర్వాత ఓటరు లిస్టులో పేరు లేని వారికి పశ్చిమ బెంగాల్లో రేషన్ కూడా అందడం లేదని విమర్శించారు. సర్ బాధితులకు ఇతర ప్రభుత్వ పథకాలు కూడా అందడం లేదన్నారు. ఎన్నికల ప్రక్రియను సీమా ఖన్నా, వ్యానిష్ కుమార్ హైజాక్ చేశారని, ఎన్నికల ప్రక్రియ మొదలవ్వడానికి ముందే ఈవీఎంల ద్వారా గెలుపును ఖాయం చేసుకున్నారని మమత ఆరోపించారు.