Rahul Dravid : భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)కు అరుదైన గౌరవం లభించింది. సుదీర్ఘ కాలం ఆటగాడిగా, విజయవంతమైన కోచ్‌గా.. టీమిండియాకు విశేష సేవలందించిన ‘ది వాల్’.. కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ అవార్డుకు ఎంపికైన తొలి క్రికెటర్‌గా ద్రవిడ్ గుర్తింపు సాధించాడు. మార్చి 15వ తేదీన నిర్వహించనున్న ‘నమన్ అవార్డుల వేడుక’లో ఈ వెటరన్ ప్లేయర్‌కు బీసీసీఐ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందించనుంది.
భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గౌరవం, గుర్తింపు సంపాదించుకున్న ఆటగాళ్లలో ద్రవిడ్ ఒకరు. తనదైన జిడ్డు ఆటతో టెస్టు క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన రాహుల్ ద్రవిడ్. ఆపై కోచ్‌గానూ హిట్ కొట్టాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో జూనియర్లను సానబెట్టిన ద్రవిడ్.. అనంతరం.. భారత జట్టు కోచ్‌గా అదుర్స్ అనిపించాడు. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియాను పొట్టి వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలిపాడు ద్రవిడ్.
Rahul Dravid, who served as both captain and coach of India, is set to be honoured with the CK Nayudu Lifetime Achievement Award by BCCI.
The award will be presented on March 15 during the annual NAMAN awards ceremony in New Delhi.pic.twitter.com/YGayelrqoh
— Cricketopia (@CricketopiaCom) March 12, 2026
తద్వారా.. సుదీర్ఘ కలను సాకారం చేశాడీ వెటరన్ క్రికెటర్. అందుకని అతడి సేవలను కొనియాడుతూ బీసీసీఐ ప్రత్యేక గౌరవం కల్పించాలనుకుంది. భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన ద్రవిడ్‌ను సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసింది. టెస్టు స్పెషలిస్ట్‌గా అదరగొట్టిన ఈ దిగ్గజ ఆటగాడు.. 16 ఏళ్ల కెరీర్లో 13,000లకు పైగా రన్స్ సాధించాడు. వన్డేల్లోనూ దుమ్మురేపిన ఈ మిడిలార్డర్ బ్యాటర్ 10 వేలకు పైగా పరుగులు బాదాడు.
మొట్ట మొదటి టెస్టు జట్టు కెప్టెన్ సీకే నాయుడు పేరుతో బీసీసీఐ జీవితకాల సాఫల్య అవార్డులను ఇస్తోంది. భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన ఆటగాళ్లును ఈ పురస్కారంతో గౌరవించడం ఆనవాయితీగా వస్తోంది. 1994లో తొలిసారి ఈ అవార్డును ప్రకటించారు. ఆ ఏడాది లాల్ అమర్నాథ్కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. ఇప్పటివరకూ 17 మంది ఈ అవార్డును స్వీకరించారు.
లాల్ అమర్నాథ్, సయ్యద్ ముస్తాక్ అలీ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, బీ.ఎస్.బేడీ, చంద్రశేఖర్, ఈ.ఏ.ఎస్. ప్రసన్న, వెంకట రాఘవన్, గుండప్ప విశ్వనాథ్, అజిత్ వాడేకర్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సయ్యద్ కీర్మాణీ, కృష్ణమాచారి శ్రీకాంత్, అంజుమ్ చోప్రా, ఫారూక్ ఇంజనీర్, రవి శాస్త్రి, సచిన్ టెండూల్కర్ ఈ పురస్కారాన్ని అందుకోగా.. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ సైతం వీరి సరసన చేరాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆడలేకపోయిన శుభ్‌మన్ గిల్ ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు.